Read more!

English | Telugu

ఒక జ‌ర్న‌లిస్టును క‌త్తితో బెదిరించి షారుక్ ఖాన్ జైలుకు వెళ్లాడని తెలుసా?

 

షారుక్ ఖాన్ పెద్ద‌కొడుకు ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్ కేసులో అరెస్ట‌యి, జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీలో భాగంగా మూడు వారాల పాటు ముంబైలోని ఆర్థ‌ర్ రోడ్ జైలులో గ‌డిపి, బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చాడు. గ‌తంలో ఒక‌సారి షారుక్ ఖాన్ సైతం జైలులో ఊచ‌లు లెక్క‌పెట్టాడ‌ని మీకు తెలుసా? అవును. ఈ విష‌యాన్ని ఒక సంద‌ర్భంలో షారుక్ స్వ‌యంగా వెల్ల‌డించాడు.

తెహ‌ల్కా డాట్ కామ్ ఆర్గ‌నైజ్ చేసిన 'థింక్ 2012' ఈవెంట్‌లో చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్న షారుక్, ఒక జ‌ర్న‌లిస్టును తాను క‌త్తితో చంపుతాన‌ని బెదిరించిన‌ట్లు చెప్పాడు. ఒక హీరోయిన్‌తో త‌న‌కు ఎఫైర్ ఉంద‌ని ఆ జ‌ర్న‌లిస్టు రాశాడ‌నీ, అప్పుడు గౌరీ ఖాన్‌ను పెళ్లి చేసుకొని రెండేళ్లే అయ్యింద‌నీ తెలిపాడు. 

"నేన‌ప్పుడు చాలా బ్యాడ్‌గా బిహేవ్ చేశాను. జైలుకు వెళ్లాను. మా మామ‌య్య పంజాబీ. గౌరీతో పెళ్లి టైమ్‌లో ఆయ‌న నాకు ఓ ఖ‌డ్గం ఇచ్చారు. ఆయ‌న ఆర్మీ ఆఫీస‌ర్‌. 'బాబూ, నువ్వు నా కూతుర్ని కాపాడుతుండాలి' అని చెప్పారు. ఆ క‌త్తి తీసుకొని నా గురించి చెడుగా రాసిన ఆ జ‌ర్న‌లిస్ట్ ఇంటికి వెళ్లాను. గౌరీని ఎవ‌రూ ఏమీ అన‌లేదు. కానీ ఆ క‌త్తి నాకు ఇండియ‌న్ ఆర్మీ ఇచ్చిన ఆయుధంగా నేను భావించాను" అని ఆరోజు త‌న స్పీచ్‌లో చెప్పాడు షారుక్‌.

జైలుకు వెళ్లినా ఆ జ‌ర్న‌లిస్టుపై షారుక్ ఆవేశం త‌గ్గ‌లేదు. జైలు నుంచి ఎవ‌రికైనా ఒక ఫోన్ చేసుకొనే అవ‌కాశం ల‌భించిన‌ప్పుడు ఆయ‌న ఆ జ‌ర్న‌లిస్టుకే ఫోన్ చేశాడు. "జైలు నుంచి వ‌చ్చాక నీ సంగ‌తి చూస్తా, నిన్ను న‌రుకుతా" అని అని బెదిరించాన‌ని షారుక్ వెల్ల‌డించాడు.