Read more!

English | Telugu

రీల్ స్టార్ టు రియ‌ల్ స్టార్‌.. పునీత్‌ రాజ్‌కుమార్ లైఫ్ స్టోరీ!

 

ప‌వ‌ర్‌స్టార్‌గా క‌న్న‌డిగుల గుండెల్లో స్థానం పొందిన పునీత్ రాజ్‌కుమార్ అక్టోబ‌ర్ 29న తీవ్ర గుండెపోటుతో క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు కేవ‌లం 46 సంవ‌త్స‌రాలు. బెంగ‌ళూరులోని విక్ర‌మ్ హాస్పిట‌ల్‌లో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. కేవ‌లం క‌న్న‌డ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ మాత్ర‌మే కాకుండా, మొత్తం ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ షాక్‌కు గురైన సంద‌ర్భం అది. ఆ వార్త బ‌య‌ట‌కు పొక్కిన మ‌రుక్ష‌ణ‌మే, ఆ హాస్పిట‌ల్ ఉన్న ప్ర‌దేశం జ‌న‌స‌ముద్రాన్ని త‌ల‌పించింది. ఆయ‌న అంత్య‌క్రియ‌లు అక్టోబ‌ర్ 31న బెంగ‌ళూరులోని కంఠీర‌వ స్టేడియంలో ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో జ‌రిగాయి. ఒక్కసారి ఆయ‌న క‌థ‌లోకి వెళ్తే...

లెజెండ‌రీ యాక్ట‌ర్ క‌న్న‌డ కంఠీర‌వ డాక్ట‌ర్ రాజ్‌కుమార్‌, పార్వ‌త‌మ్మ దంప‌తుల‌కు క‌డ‌ప‌టి సంతానంగా చెన్నైలో పునీత్ జ‌న్మించారు. పునీత్‌కు ఆరేళ్లు నిండాక‌, ఆయ‌న కుటుంబం చెన్నై నుంచి మైసూరుకు త‌ర‌లి వెళ్లింది. పునీత్‌కు ఇద్ద‌రు అన్న‌లు.. శివ రాజ్‌కుమార్‌, రాఘ‌వేంద్ర రాజ్‌కుమార్‌, ఇద్ద‌రు అక్క‌లు.. ల‌క్ష్మి, పూర్ణిమ‌.

పునీత్‌కు సినిమా వ‌ర‌ల్డ్ కొత్త‌కాదు. ప‌సివాడుగా ఉన్న‌ప్పుడు తండ్రి రాజ్‌కుమార్‌, అన్న‌య్య‌ల‌తో క‌లిసి సినిమా సెట్స్‌కు వెళ్లేవారు. చిన్న‌ప్పుడే తండ్రి సినిమాలోనే ఆయ‌న‌తో క‌లిసి తొలిసారిగా న‌టించారు. బాల‌న‌టుడిగానే నేష‌న‌ల్ అవార్డ్ సాధించారు. ఆ త‌ర్వాత క‌ర్నాట‌క స్టేట్ అవార్డ్స్‌ను అందుకున్నారు పునీత్‌. ప‌ద్నాలుగేళ్ల వ‌య‌సు నాటికి బాల‌న‌టుడిగా 14 సినిమాలు చేశారు.

2002లో 'అప్పు' మూవీతో హీరోగా ఇంట్ర‌డ్యూస్ అయ్యారు పునీత్‌. ఆ మూవీని డైరెక్ట్ చేసింది.. మ‌రెవ‌రో కాదు, ఇవాళ టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రైన పూరి జ‌గ‌న్నాథ్‌. ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యి, అప్ప‌ట్నుంచే ఆయ‌న‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఫ్యాన్స్ ఆయ‌న‌ను 'అప్పు' అని పిల‌వ‌డం ప్రారంభించారు. బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫిలిమ్స్‌తో కాల‌క్ర‌మంలో మాస్‌లో మ‌రింత క్రేజ్‌, ఇమేజ్ సంపాదించుకున్న పునీత్‌కు ఫ్యాన్స్ 'ప‌వ‌ర్‌స్టార్' అనే బిరుదు ఇచ్చేశారు.

నిజానికి పాపులారిటీలో అన్న‌య్య‌లు శివ రాజ్‌కుమార్‌, రాఘ‌వేంద్ర రాజ్‌కుమార్‌ల‌ను దాటేశారు పునీత్‌. ఆయ‌న‌కు సంబంధించి న‌ట‌న అనేది క్యారెక్ట‌ర్‌ను అర్థం చేసుకొని, అందులోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌డ‌మే. ఆయ‌న మంచి న‌టుడు మాత్ర‌మే కాదు, చ‌క్క‌ని డాన్సర్ కూడా. బాక్సాఫీసును దృష్టిలో పెట్టుకొంటే ఆయ‌న ప‌లు రికార్డుల‌ను సృష్టించారు. ఆయ‌న 49 సినిమాల్లో న‌టిస్తే, వాటిలో 40 సినిమాలు వంద రోజులు ఆడాయంటే.. యాక్ట‌ర్‌గా ఆయ‌న స‌క్సెస్ రేట్ ఎలాంటిదో ఊహించుకోవాల్సిందే. 90 శాతం స‌క్సెస్ రేట్‌తో 'ప‌వ‌ర్‌స్టార్' అనే మాట‌కు అస‌లైన అర్థంగా నిలిచారు పునీత్‌. హీరోగా ఆయ‌న న‌టించిన‌వి 29 సినిమాలు. వాటిలో 23 సినిమాలు థియేట‌ర్ల‌లో శ‌త దినోత్స‌వం జ‌రుపుకున్నాయి. ఆయ‌న బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌లో అప్పు, అభి, వీర క‌న్న‌డిగ‌, మౌర్య‌, ఆకాశ్‌, మిలాన.. లాంటివి ఉన్నాయి.

'బెట్టాడ హూవు' సినిమాలో చేసిన రాము పాత్ర‌తో ఉత్త‌మ బాల‌న‌టునిగా నేష‌న‌ల్ అవార్డ్ పొందిన పునీత్‌, 'చ‌లిసువ మొడ‌గ‌ళు', 'యేరాడు న‌క్ష‌త్ర‌గ‌ళు' సినిమాల‌తో బెస్ట్ చెల్డ్ ఆర్టిస్టుగా క‌ర్నాట‌క స్టేట్ అవార్డ్స్ అందుకున్నారు. విశేష‌మేమంటే పునీత్ ప్లేబ్యాక్ సింగ‌ర్ కూడా. త‌ను న‌టించిన కొన్ని సినిమాల్లో ఆయ‌న స్వ‌యంగా పాట‌లు పాడారు. రెండు సార్లు బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగ‌ర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డుల‌కు నామినేష‌న్ పొందారు. హీరోగా న‌టించిన ఫ‌స్ట్ ఫిల్మ్ 'అప్పు'లోనే పాడిన ఆయ‌న ఆ త‌ర్వాత‌, 'వంశీ', 'జాకీ' సినిమాల్లోనూ, త‌న అన్న శివ రాజ్‌కుమార్ సినిమాలు 'ల‌వ కుశ‌', 'మైల‌రి'ల‌లోనూ ఆయ‌న పాట‌లు పాడారు.

వెండితెర‌పైనే కాకుండా టీవీతెర‌పై కూడా త‌నదైన ముద్ర వేశారు పునీత్‌. 2017లో 'క‌న్న‌డాడ కోట్యాధిప‌తి' సీజ‌న్ 1 హోస్ట్‌గా ఆయ‌న బుల్లితెర‌పై అడుగుపెట్టారు. అది అమితాబ్ బ‌చ్చ‌న్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న 'కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి' షో ఆధారంగా రూపొందించిన షో. ఆ త‌ర్వాత రెండో సీజ‌న్‌, నాలుగో సీజ‌న్‌కు కూడా ఆయ‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించారు. అలాగే క‌ల‌ర్స్ క‌న్న‌డ చాన‌ల్‌లో ప్ర‌సార‌మైన‌ 'ఫ్యామిలీ ప‌వ‌ర్‌', ఉద‌య టీవీలో ప్ర‌సార‌మైన 'నేత్రావ‌తి' షోల‌కు ఆయ‌న హోస్ట్‌గా ఉన్నారు.

న‌టుడు, నిర్మాత కాకుండా పునీత్ గొప్ప మాన‌వ‌తావాదిగా పేరు పొందారు. త‌న తండ్రి డాక్ట‌ర్ రాజ్‌కుమార్ త‌ర‌హాలోనే అభిమానుల‌ను క‌లుసుకొని, వారితో గ‌డ‌ప‌డానికి ఇష్ట‌ప‌డేవారు. ప్ర‌తి సంవ‌త్స‌రం త‌న బ‌ర్త్‌డే అయిన మార్చి 17న ఫ్యాన్స్‌ను క‌లుసుకొని, వారితో గంట‌ల‌కొద్దీ గ‌డిపేవారు. అనేక సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌న నిర్వ‌హించేవారు. క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచారు. క‌ర్నాట‌క సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 50 ల‌క్ష‌లు డొనేట్ చేసిన ఆయ‌న‌, షూటింగ్‌లు లేక ఉపాధి కోల్పోయిన ప‌లువురు ఆర్టిస్టుల‌కు నిత్యావ‌స‌రాలు అందించారు.

అంతే కాకుండా, పునీత్ 26 అనాథ శ‌ర‌ణాల‌యాల‌కు, 16 వృద్ధాశ్ర‌మాల‌కు, 19 గోశాల‌ల‌కు ఆర్థిక సాయం అందిస్తూ వ‌చ్చారు. అలాగే త‌న ట్ర‌స్ట్ ద్వారా 1800 మంది పిల్ల‌ల‌కు ఉచిత విద్య అందించారు. ఇక‌నుంచీ వారి బాధ్య‌త‌ల‌ను త‌ను చూసుకుంటాన‌ని ఇటీవ‌ల హీరో విశాల్ ప్ర‌క‌టించారు.

పునీత్ భార్య పేరు అశ్వినీ రేవంత్‌. ప‌రిచ‌య‌మైన మూడేళ్ల‌కు ఆమెను 1999 డిసెంబ‌ర్‌లో ప్రేమ‌వివాహం చేసుకున్నారు పునీత్‌. ఆ ఇద్ద‌రిదీ అన్యోన్య దాంప‌త్యం. వారికి ధ్రుతి, వందిత అనే ఇద్ద‌రు కుమార్తెలు. ఎంతో ఆనందంగా సాగిపోతున్న ఆ జంట‌ను చూసి విధికి క‌న్ను కుట్టింది. అక్టోబ‌ర్ 29న త‌న నిజ‌జీవిత హీరో మృతితో అశ్విని గుండెలు ప‌గిలాయి. పునీత్ పార్థివ‌దేహం మీద ప‌డి ఆమె విల‌పించ‌డం చూసిన వాళ్లకు క‌న్నీళ్లు ఆగ‌లేదు.