Read more!

English | Telugu

ఫ్లాష్‌బ్యాక్‌.. సినీ ఫ‌క్కీలో దొంగ‌ను ప‌ట్టుకున్న‌ శ‌ర‌త్‌కుమార్.. ఫ‌లితం అరెస్ట్ వారెంట్‌!

 

న‌టుడు శ‌ర‌త్‌కుమార్ అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. త‌మిళుడైన‌ప్ప‌టికీ, తెలుగు సినిమాల్లోనూ న‌టించి మ‌న ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడైన చ‌క్క‌ని న‌టుడు. న‌టి రాధిక‌ను వివాహం చేసుకొని వైవాహిక జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నాడు. శ‌ర‌త్‌కుమార్ సినిమాల్లో డూప్ లేకుండా ఎన్నో ఫైట్లు, సాహ‌సాలు చేశాడు. అయితే చ‌దువుకొనే రోజుల్లోనే సినీ ఫ‌క్కీలో ఆయ‌న చేసిన ఓ సాహ‌సం చివ‌ర‌కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యేలా చేసింది. ఆ క‌థేమిటంటే...

అప్పుడాయ‌న మ‌ద్రాస్‌లోని న్యూ కాలేజీలో బీయ‌స్సీ చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడు. ఓ ఆదివారం అడ‌యార్‌లోని ఇందిరా న‌గ‌ర్‌లో ఉన్న త‌మ ఇంట్లూ త‌న స్నేహితుల‌తో క‌లిసి ఆయ‌న టేప్ రికార్డ‌ర్‌లో వెస్ట్ర‌న్ మ్యూజిక్ వింటూ, స‌ర‌దాగా పిచ్చాపాటీ మాట్లాడుతున్నాడు. అలాంటి స‌మ‌యంలో హ‌ఠాత్తుగా బ‌య‌టి నుంచి ఓ అమ్మాయి కెవ్వుమ‌ని వేసిన కేక వినిపించింది. అంత‌దాకా జాలీ మూడ్‌లో ఉన్న శ‌ర‌త్‌కుమార్ బృందం ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయింది. టేప్ రికార్డ‌ర్ క‌ట్టేసి వాళ్లంతా బ‌య‌ట‌కొచ్చి చూశారు.

చూస్తే.. ఎవ‌డో దొంగ ఓ అమ్మాయి మెడ‌లోని బంగారు గొలుసును లాగేసి సైకిల్ మీద తుర్రుమ‌ని పోతున్నాడు. మిగ‌తా మిత్రులంతా ఆమె ద‌గ్గ‌ర‌కెళ్లి విష‌య సేక‌ర‌ణ ప్రారంభించారు. శ‌ర‌త్‌కుమార్ మాత్రం వెన‌కా ముందూ ఆలోచించ‌కుండా, ప‌క్క‌నే ఉన్న స్కూటర్ తీసుకొని, ఆ దొంగ వెంట‌ప‌డి ప‌ట్టుకున్నాడు. ఆమెకు గొలుసు ఇప్పించి, ఆ దొంగ‌ను ద‌గ్గ‌ర్లోని పోలీస్ స్టేష‌న్‌లో అప్ప‌గించాడు. 

అప్ప‌ట్లో అక్క‌డ భ‌ట్ అనే ఆయ‌న అసిస్టెంట్ పోలీస్ క‌మిష‌న‌ర్‌. ఆయ‌న శ‌ర‌త్‌కుమార్ ధైర్యాన్ని మెచ్చుకొని అభినందించారు. చ‌ట్ట‌ప్ర‌కారం ఎఫ్ఐఆర్ త‌యారుచేయించి, దాని మీద సంత‌కం పెట్టించుకొని, "సాక్ష్యానికి కోర్టుకి వ‌స్తారా?" అని అడిగారు. త‌ప్ప‌కుండా వ‌స్తాన‌ని చెప్పాడు శ‌ర‌త్‌కుమార్‌. 

ఆరు నెల‌లు గ‌డిచాయి. బీయ‌స్సీ పూర్త‌యి, బెంగ‌ళూరులోని ఓ డైలీ పేప‌ర్ ఆఫీసులో అడ్వ‌ర్ట‌యిజింగ్ మేనేజ‌ర్‌గా ఉద్యోగంలో కూడా చేరిపోయాడు శ‌ర‌త్‌. ఒక‌రోజు అనూహ్యంగా వాళ్ల ఇంటినుంచి క‌బురొచ్చింది.. "నీకు అరెస్ట్ వారంట్ వ‌చ్చింది. అర్జెంటుగా బ‌య‌లురేరి రా" అని. దాంతో షాకైపోయాడు శ‌ర‌త్‌. ఏం అర్థం కాలేదు. తానెప్పుడూ ఏ గొడ‌వ‌లో త‌ల‌దూర్చ‌లేదు, ఏ పోలీస్ కేసులోనూ ఇరుక్కోలేదు, అలాంటి త‌న‌కు అరెస్ట్ వారంటేమిటా? అనుకుంటూ ఆ రాత్రికి రాత్రే బెంగ‌ళూరు నుంచి మ‌ద్రాసుకు బ‌య‌లుదేరి వ‌చ్చేశాడు.

ఇంటికొచ్చాక అస‌లు విష‌యం అర్థ‌మైంది. ఆర్నెల్ల క్రితం ఆయ‌న ప‌ట్టుకున్న దొంగ కేసు విచార‌ణ‌కు వ‌చ్చింది. సాక్ష్యం కోసం ఆయ‌న‌ను కోర్టుకు ర‌మ్మ‌న‌మ‌ని కోర్టు నుంచి పిలుపొచ్చింది. ఆ స‌మ‌యానికి ఆయ‌న ఊళ్లోలేని కార‌ణంగా, ఎక్క‌డున్నా ప‌ట్టుకొని, అరెస్ట్ చేసి సాక్ష్యానికి కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌మ‌ని సైదాపేట కోర్టు ఆర్డ‌ర్ జారీ చేసింది. ఆ ఆర్డ‌ర్ తీసుకొని ఆయ‌న వెంట‌నే చంద్ర‌న్ జ‌య‌పాల్ అనే అడ్వ‌కేట్‌ను క‌లిశాడు. ఆయ‌న స‌ల‌హా మేర‌కు సైదాపేట కోర్టుకెళ్లి సాక్ష్యం చెప్పివ‌చ్చాడు శ‌ర‌త్‌. ఆ దొంగ‌కు శిక్ష ప‌డింది. అప్ప‌డు న్యాయ‌మూర్తి స‌హా అక్క‌డున్న వాళ్లంతా ఆయ‌న‌ను మెచ్చుకున్నారు. ఆ రోజున శ‌ర‌త్ పొందిన ఆనందం, అనుభూతి అంతా ఇంతా కాదు.