Read more!

English | Telugu

'రుద్ర‌వీణ‌', 'ఆప‌ద్బాంధ‌వుడు' లాంటి సినిమాలు చిరంజీవి ఇప్పుడెందుకు చేయ‌ట్లేదు?

 

'అభిలాష‌', 'శుభ‌లేఖ‌', 'స్వ‌యంకృషి' లాంటి సినిమాల్లో చిరంజీవి పోషించిన భిన్న త‌ర‌హా పాత్ర‌లు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందాయి. ఆ సినిమాలూ స‌క్సెస్ అయ్యాయి. "సూప‌ర్‌స్టార్స్ భిన్న‌త‌ర‌హా పాత్ర‌లు పోషిస్తే ఆ సినిమాలు స‌క్సెస్ కావు అని చెప్ప‌డానికి వీల్లేదు. అయితే ఒక మాస్ స్టార్ ఇమేజ్ వున్న న‌టుడ్ని అలాంటి పాత్ర‌ల్లోనూ ఆద‌రించే స్థాయిలో మ‌న ప్రేక్ష‌కులు లేర‌"ని చిరంజీవి అభిప్రాయ‌ప‌డ్డారు. దీనికి కార‌ణం, ఆ అభిరుచిని మ‌నం వాళ్ల‌లో పెంపొందించ‌లేక పోవ‌డ‌మేన‌ని ఆయ‌న అంటారు. భార‌తీరాజా ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన 'ఆరాధ‌న‌', బాల‌చంద‌ర్ నిర్దేశ‌క‌త్వంలో చేసిన 'రుద్ర‌వీణ‌', కె. విశ్వ‌నాథ్ తీర్చిదిద్దిన 'ఆపద్బాంధవుడు' సినిమాల‌ను ఎంతో ప్రేమించి చేశారు చిరంజీవి. కానీ అవి ప్రేక్ష‌కుల్ని ఆశించిన రీతిలో ఆక‌ట్టుకోలేక‌పోయాయి. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర హిట్ అనిపించుకోలేక‌పోయాయి.

'ఇమేజ్' అనేది ఏడాదికేడాది పెరుగుతూనే ఉంటుంది. అది స‌హ‌జం. ఆ పెరుగుద‌లే లేక‌పోతే ఇవాళున్న స్థాయికి ఆయ‌న చేరుకునేవారు కాదు. అయితే 'ఇమేజ్' పెరుగుతున్న కొద్దీ ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు ఎక్కువ‌వుతాయి. విభిన్న పాత్ర‌ల పోష‌ణ విష‌యంలో ఆ 'ఇమేజ్' స్టార్ల‌కు ప్ర‌తిబంధ‌కం అవుతుంటుంది. అదే మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్స్ మోహ‌న్‌లాల్‌, మ‌మ్ముట్టి విష‌యంలో అక్క‌డ వారి సినిమాలు బ‌డ్జెట్‌కు లోబ‌డి ఉంటాయి. నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు ఖ‌ర్చు విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉంటారు. 30 రోజుల్లో సినిమాల‌ను తీసేస్తుంటారు వారు. అందుకే అక్క‌డి హీరోలు ఎక్కువ సినిమాల్లో న‌టించ‌గ‌లుగుతున్నారు. వారు మాస్ స్టార్ ఇమేజ్ చ‌ట్రంలో ఇరుక్కుపోలేదు కాబ‌ట్టే వారిని ఏ పాత్ర‌లోనైనా అంగీక‌రించ‌గ‌ల త‌త్వం అక్క‌డి ప్రేక్ష‌కుల్లో అల‌వ‌డింది. 

టాలీవుడ్‌కు వ‌చ్చేసరికి స్టార్ హీరోలు క‌మ‌ర్షియ‌ల్ అనే చ‌ట్రంలో చిక్కుకుపోయి, రిచ్‌నెస్ వ్యామోహంలో ఇరుక్కుపోయి ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు పెంచేసి, వాటిని చేరుకోవ‌డం ఎలా అనేది పెద్ద ప్రాబ్లెమ్‌గా త‌యారుచేసుకున్నారు. చిరంజీవిలోని ఆర్టిస్టుకు విభిన్న‌మైన పాత్ర‌లు పోషించాల‌నే త‌ప‌న ఉంది. కానీ తెలుగు సినిమా చాలా కాలంగా క‌మ‌ర్షియ‌ల్ పంథాలోనే సాగుతూ వ‌స్తోంది. వ్యాపార రీత్యా చాలా సంద‌ర్భాల్లో బాలీవుడ్‌ను మించి కూడా దేశంలోనే నంబ‌ర్ వ‌న్ అనిపించుకుంది టాలీవుడ్‌. 

అందుకే పాతికేళ్ల క్రిత‌మే ఓసారి అమితాబ్ బ‌చ్చ‌న్ - "నిజంగా నేను న‌మ్మ‌లేక‌పోతున్నాను. తెలుగు సినిమాకు ఐదు కోట్ల రూపాయ‌ల పైన వ్యాపారం సాగ‌డం నాకు చాలా ఆశ్చ‌ర్యంగా ఉంది. అదీ నీ ఒక్క సినిమాల‌కే - అంటే, నువ్వు చాలా గొప్ప‌వాడివి" అని చిరంజీవిని ప్ర‌శంసించారు. "అది నా గొప్ప‌త‌నం కాదు. మా ప్ర‌భుత్వం సినిమా ప‌రిశ్ర‌మ అభివృద్ధి నిమిత్తం ప్ర‌వేశ‌పెట్టిన ప‌న్నువిధానం, రాయితీల వ‌ల్ల కావ‌చ్చు" అని జ‌వాబిచ్చారు చిరంజీవి.

ఇలా పెరిగిపోయిన బ‌డ్జెట్‌ను న‌మ్మి కోట్లు ఖ‌ర్చుచేసి సినిమాలు కొనే బ‌య్య‌ర్ల‌కు వాళ్ల పెట్టుబ‌డి వాళ్ల‌కు రావాలీ అంటే, ప్రేక్ష‌కుల అభిరుచిని బ‌ట్టి సినిమాలు చెయ్య‌డం మంచిదా?  లేక త‌న వ్య‌క్తిగ‌త‌మైన అభిరుచిని అనుస‌రించి, త‌న‌కు న‌చ్చింది చెయ్య‌డం క‌రెక్టా - అని త‌న‌ను తాను బేరీజు వేసుకొని చూసుకున్న‌ప్పుడు వ్య‌క్తిగ‌త‌మైన అభిరుచిని, త‌న‌లో ఉన్న న‌టుడ్ని ప‌క్క‌కు నెట్టి ప్రేక్ష‌కులు త‌న‌నుంచి ఎలాంటి సినిమాలు ఆశిస్తారో అవే చెయ్య‌డం న్యాయ‌మ‌నిపించింది చిరంజీవికి. అంచేత క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లోనే న‌టించాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు, అలాగే చేస్తూ వ‌స్తున్నారు.