Read more!

English | Telugu

ఒక బిగ్ స్టార్ మూవీ 100 డేస్‌ ఫంక్ష‌న్‌లో సాయికుమార్‌కూ, తండ్రికీ దారుణ అవ‌మానం!

 

టాలీవుడ్‌లోని ఓ బిగ్ స్టార్ సినిమా 100 డేస్ ఫంక్ష‌న్ తిరుప‌తిలో జ‌రప‌డానికి ఏర్పాట్లు చేశారు. ఆ మూవీలో సాయికుమార్ తండ్రి పి.జె. శ‌ర్మ న‌టించారు. అందువ‌ల్ల ఆయ‌న‌కు కూడా ఆ ఫంక్ష‌న్‌కు ఆహ్వానం అందింది. నిన్ను కూడా ర‌మ్మ‌న్నార‌ని సాయిని కూడా తోడు తీసుకువెళ్లారు శ‌ర్మ‌. అప్ప‌టికింకా వాళ్లు హైద‌రాబాద్‌కు రాలేదు. మ‌ద్రాసులోనే ఉంటున్నారు. మ‌ద్రాస్ నుంచి తిరుప‌తికి చార్ట‌ర్డ్ ఫ్ల‌యిట్‌లో తీసుకుపోతార‌ని చిన్న‌పిల్లాడిలా ఆనంద‌ప‌డిపోతూ శ‌ర్మ చెప్పారు. పొద్దున్నే ఆఫీసుకు ర‌మ్మ‌ని క‌బురు రావ‌డంతో ఇద్ద‌రూ ఆటోలో వెళ్లారు. అక్క‌డెవ‌రూ లేరు. టెక్నీషియ‌న్స్‌కు సంబంధించిన బ‌స్సు మాత్రం ఉంది. 

ఏంటీ అని ఆరా తీస్తే అప్ప‌టికే గెస్టులంద‌రూ చార్ట‌ర్డ్ ఫ్లైట్‌కు వెళ్లిపోయార‌నీ, వాళ్ల‌ను బ‌స్సులో ర‌మ్మ‌న్నార‌నీ చెప్పారు. దాంతో శ‌ర్మగారు చిన్న‌బుచ్చుకున్నారు. ఆయ‌న‌ను బుజ్జ‌గించి, తిరుప‌తికి ఎంత సేప‌ట్లో వెళ్తామ‌ని చెప్పి, బ‌స్సులోనే తీసుకువెళ్లారు సాయి. తిరుప‌తిలోని విష్ణుప్రియ హోట‌ల్‌లో అంతా బ‌స చేశార‌ని తెలిసింది. బ‌స్సును స‌రిగ్గా ఆ హోట‌ల్ ముందే ఆపారు. తండ్రీకొడుకుల‌ను మాత్రం అక్క‌డ దిగిపొమ్మ‌ని చెప్పారు. హ‌మ్మ‌య్య‌.. బ‌తికిపోయాం అనుకుని హోట‌ల్ లోప‌ల‌కు వెళ్లారు. రూమ్ ఇచ్చారు. 

ఆ సాయంత్రం ఫంక్ష‌న్‌. ఇద్ద‌రూ అక్క‌డికి వెళ్లారు. ఆ స్టార్ హీరోకు ఉన్న క్రేజ్‌తో అభిమానులు విప‌రీతంగా వ‌చ్చేశారు. చాలామంది స్టేజ్ ఎక్కేశారు. అది కూలిపోతుందేమో అనిపించింది. దాంతో ఫంక్ష‌న్ కాన్సిల్ చేసేసి, అంద‌రూ వెన‌క్కి మ‌ళ్లారు. తిరిగొచ్చేట‌ప్పుడు చార్ట‌ర్డ్ ఫ్లైట్ లేదు. అతిథుల కోసం ఒక సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సు వేశారు. అంత‌కు ముందు అదే బ‌స్సులో శ‌ర్మ‌గారు, సాయికుమార్ ల‌గేజ్‌తోటే ఫంక్ష‌న్‌కు వ‌చ్చారు. ఆ బ‌స్సులో అంద‌రూ ఎక్కారు. మ‌ధ్య‌లో ఒక‌చోట మూన్‌లైట్ డిన్న‌ర్ ప్లాన్ చేశారు. సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సు అక్క‌డికి వెళ్లింది. టెక్నీషియ‌న్ల బ‌స్సును బ‌య‌టే ఆపేశారు.

లోప‌ల‌ బ్ర‌హ్మాండంగా అరేంజ్‌మెంట్స్ ఉన్నాయి. పార్టీ జ‌రుగుతోంది. అప్పుడు ఆ స్టార్ హీరోకు కావాల్సిన ఓ స్టార్ ప్రొడ్యూస‌ర్ బ‌స్సు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. బ‌స్సెక్కి క‌రెక్టుగా శ‌ర్మ‌గారు, సాయి వాళ్ల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఆగాడు ఆ ప్రొడ్యూస‌ర్‌. "మీరు దిగిపోండి. బ‌య‌టున్న బ‌స్సులో మ‌ద్రాస్ వెళ్లిపోండి" అని చెప్పాడు. శ‌ర్మ‌గారి ముఖం కంద‌గ‌డ్డ‌లా మారిపోయింది. వెంట‌నే సాయికుమార్‌, "సార్ సార్‌.. వాళ్ల‌తో పార్టీలో కూర్చోడానికి నాకు అర్హ‌త లేదు. నేను చిన్న‌పిల్లాడిని. నేనెళ్లిపోతాను. నాన్న‌ను మాత్రం పంప‌కండి. నాన్న‌ను పార్టీలో ఉంచండి ప్లీజ్" అని వేడుకున్నారు.

"నేను చెప్తున్నాను క‌ద‌మ్మా.. మీ ఇద్ద‌రూ దిగిపోండి." అని ఆయ‌న మ‌ళ్లీ చెప్పాడు. ఆ సినిమా హీరోతో కానీ, డైరెక్ట‌ర్‌తో కానీ మాట్లాడాల‌ని సాయి ప్ర‌య‌త్నించారు. కానీ కుద‌ర‌లేదు. తండ్రీకొడుకులిద్ద‌రినీ బ‌స్సులోంచి దింపేశారు. ఇద్ద‌రూ మౌనంగా బ‌య‌ట‌కు వ‌చ్చారు. తండ్రిని టెక్నీషియ‌న్ల బ‌స్సు ఎక్కించ‌డానికి సాయికి గ‌గ‌న‌మైపోయింది. పుండుమీద కారం చ‌ల్లిన‌ట్లుగా, ఆ బ‌స్సులో ఉన్న‌వాళ్లంద‌రికీ తింటానికి ఒక పొట్లం, క్వార్ట‌ర్ బాటిల్ ర‌మ్ తీసుకొచ్చి ఇచ్చారు.. 'ఇది మీకు.. బ‌స్సులో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్లండ‌'న్న‌ట్లు. ఆ బాటిల్ తీసుకొని కోపంతో కిందికి విసిరికొట్టారు శ‌ర్మ‌గారు. "స్కాచ్ తాగ‌డానికి నేను అర్హుడ్ని కాద‌న్న‌మాట‌." అంటూ బాధ‌ప‌డ్డారు, ఎమోష‌న‌ల్ అయ్యారు. అలాగే మ‌ద్రాస్ వెళ్లారు.

ఆరోజు తండ్రి ఎదుర్కొన్న అవ‌మానం, ఆయ‌న ప‌డిన బాధ సాయికుమార్‌కు ఇప్ప‌టికీ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు గుర్తుంది. తండ్రికి ఎలాగైనా స్కాచ్ కొనివ్వాల‌ని ఆరోజు డిసైడ్ అయ్యారు సాయికుమార్‌. ఆ టైమ్‌లోనే ఒక‌సారి అమెరికా వెళ్లారు సాయి. అక్క‌డ 108 డాల‌ర్లు పెట్టి స్కాచ్ బాటిల్ తీసుకొని, తండ్రికి ఇచ్చారు. తండ్రికి తానిచ్చిన గ్రేటెస్ట్ గిఫ్ట్ అదేన‌ని ఫీల‌వుతుంటారు సాయి. ఈ విష‌యాల‌న్నింటినీ ఒక ఇంట‌ర్వ్యూలో ఆయ‌న పంచుకున్నారు.