English | Telugu
'మురారి'లో మహేశ్ తండ్రి పాత్రను చేజేతులా ప్రసాద్‌బాబుకు అప్పగించిన నరసింహరాజు!
Updated : Aug 23, 2021
మహేశ్ టైటిల్ రోల్ చేసిన 'మురారి' సినిమా ఇటు ప్రేక్షకుల, అటు విమర్శకుల ఆదరణను పొందింది. నిజానికి ఆ సినిమా మహేశ్‌లోని నటుడ్ని తొలిసారి ఆవిష్కరించిన సినిమాగా పేరు తెచ్చుకుంది. మహేశ్, సోనాలీ బెంద్రే జంట చూడముచ్చటగా ఉందని అందరూ అన్నారు. ఆ మూవీలో మహేశ్ తల్లితండ్రులుగా లక్ష్మి, ప్రసాద్‌బాబు నటించారు. నిజానికి తండ్రి క్యారెక్టర్ చెయ్యాల్సింది 'జగన్మోహిని' హీరో నరసింహరాజు. అదివరకు కృష్ణవంశీ సినిమా 'సిందూరం'లో ఆయన ఓ చిన్న పాత్ర చేశారు.
'మురారి' సినిమా తలపెట్టినప్పుడు తల్లి పాత్రకు లక్ష్మిని ఎంచుకున్న కృష్ణవంశీ, ఆమె భర్త పాత్రకు ఎవరిని తీసుకోవాలా అని ఆలోచిస్తున్నప్పుడు నరసింహరాజు మనసులో మెదిలారు. వెంటనే ఆయనకు కబురుపెట్టారు. ఆఫీసుకు వచ్చారు నరసింహరాజు. మహేశ్ తండ్రిగా, లక్ష్మి భర్తగా పాత్ర చెయ్యాలని కృష్ణవంశీ చెప్పారు. దాంతో లక్ష్మి భర్తగా తను సరిపోతానా అనే డౌట్ ఆయనకే వచ్చింది. చూడ్డానికి కాస్త సన్నగా, అసలు వయసు కంటే చిన్నవాడిగా కనిపిస్తుంటారాయన. తన సందేహాన్ని కృష్ణవంశీ దగ్గర వ్యక్తం చేశారు. "లక్ష్మి పక్కన నేను పనికొస్తానా సార్?" అనడిగారు.
దాంతో కృష్ణవంశీకి కూడా డౌట్ వచ్చింది. ఆయనకు ఇద్దామనుకున్న పాత్రను ప్రసాద్‌బాబుకు ఇచ్చారు. ఆ పాత్ర ప్రసాద్‌బాబుకు రావడానికి కారణం కూడా నరసింహరాజే! అవును. కృష్ణవంశీని కలిసినప్పుడు "ఫాదర్ అంటే ప్రసాద్‌బాబు లాగా అయినా ఉండాలి కదా సార్" అని మాటవరసకు ఆయన అన్నారు. అలా మహేశ్ ఫాదర్ క్యారెక్టర్‌ను ప్రసాద్‌బాబు చేశారు. తనకు ఏదైనా సందేహం వస్తే వెంటనే ఆ విషయాన్ని దాచుకోకుండా చెప్పడం నరసింహరాజు అలవాటు. దాని వల్ల ఆయన కొన్ని పాత్రలు మిస్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో నరసింహరాజు స్వయంగా చెప్పారు.