Read more!

English | Telugu

బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చిరంజీవికి 'గాడ్‌ఫాద‌ర్' ఎవ‌రో తెలుసా?

 

సినిమా ఇండ‌స్ట్రీలో చిరంజీవి స్వ‌యంకృషితో పైకివ‌చ్చి మెగాస్టార్‌గా ఎదిగార‌నే విష‌యం చాలామందికి తెలుసు. ఆయ‌న అస‌లు పేరు శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ అనే విష‌య‌మూ తెలుసు. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న‌ప్పుడే 'పునాదిరాళ్లు' సినిమాతో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న ఇప్పుడు 153వ సినిమా 'గాడ్‌ఫాద‌ర్' చేస్తున్నారు. నిజానికి ఆయ‌నకు ఇండ‌స్ట్రీలో గాడ్‌ఫాద‌ర్ అంటూ ఎవ‌రూ లేరు. అయితే ఆయ‌న‌లో ఆత్మ‌విశ్వాసం ఉంది. ఆ ఆత్మ‌విశ్వాసంతో, స్థిర ల‌క్ష్యంతో, న‌టుడ్ని కావాలి అనే దృఢ సంక‌ల్పంతో మ‌ద్రాస్ వెళ్లారే త‌ప్ప‌, ఓ చాన్స్ చూద్దాం అనే ఉద్దేశంతో వెళ్ల‌లేదు.

ఆయ‌న‌లో బ‌ల‌మైన ఇచ్ఛ ఉంది. 'ఆ ఇచ్ఛ‌ను సాధించ‌డానికి నేనేం చెయ్యాలి? ఏం చేస్తే నేను అనుకున్న ల‌క్ష్యాన్ని సాధిస్తాను?  దానికి స‌రైన మార్గం ఏమిటి?' అనేవి బాగా ఆలోచించుకొని మ‌రీ వెళ్లారు. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన త‌ర్వాత వెంట‌నే సినిమాల్లో అవ‌కాశాలు వాటంత‌ట అవి ల‌భించేస్తాయా? ల‌భించ‌వు. ఆయ‌న‌కున్న బీకాం డిగ్రీ స‌రిపోదు. అందుక‌ని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్‌లో ట్రైనింగ్ అయ్యారు. దానివ‌ల్ల ఆత్మ‌విశ్వాసం ఏర్ప‌డింది. 'పునాదిరాళ్లు' చిత్రంలో తొలిసారిగా న‌టించే అవ‌కాశం అనుకోకుండా వ‌చ్చిందే త‌ప్ప ఆయ‌న ప్ర‌య‌త్నిస్తే రాలేదు. అప్ప‌టికి ఆయ‌నింకా ఇన్‌స్టిట్యూట్‌లో శిక్ష‌ణ పొందుతున్నారు. మిత్రుడు సుధాకర్‌కు ఆ సినిమాలో మొద‌ట అవ‌కాశం వ‌చ్చింది. కానీ అదే స‌మ‌యంలో భార‌తీరాజా సినిమాలో హీరోగా చాన్స్ రావ‌డంతో ఆ విష‌యం చెప్ప‌డానికి చిరంజీవిని తోడు తీసుకొని వెళ్లారు సుధాక‌ర్‌. అప్పుడు సుధాక‌ర్‌కు అనుకున్న వేషానికి చిరంజీవి మ‌రింత బాగా స‌రిపోతాడ‌ని ఆ సినిమా ద‌ర్శ‌క నిర్మాత‌లు అనుకొని, ఆయ‌న‌ను అడిగారు.

ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ పొందే కాలంలో ఏ విద్యార్థీ సినిమాల్లో న‌టించ‌కూడ‌ద‌న్న నిబంధ‌న ఉంది. ఆ కార‌ణంగా మొద‌ట అంగీక‌రించ‌డానికి మ‌న‌స్క‌రించ‌లేదు. అందుక‌ని ఇన్‌స్టిట్యూట్ రూల్స్ అంగీక‌రించ‌వ‌ని వాళ్ల‌కు చెప్పారు చిరంజీవి. అయినా వాళ్లు ఇన్‌స్టిట్యూట్ నుంచి అనుమ‌తి తీసుకుంటామ‌ని చెప్పి బ‌ల‌వంతం చేశారు. అలా త‌ప్ప‌నిస‌రై ఆయ‌న 'పునాదిరాళ్లు' చిత్రంలో న‌టించ‌డం, ఆ చిత్రంలోని స్టిల్స్ చూసి ప్ర‌ముఖ నిర్మాత క్రాంతికుమార్ ఆయ‌న‌కు 'ప్రాణం ఖ‌రీదు' సినిమాలో న‌టించే అవ‌కాశం ఇచ్చారు. అప్పుడే శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ కాస్తా చిరంజీవి అయ్యారు.

మొద‌ట న‌టించింది 'పునాదిరాళ్లు' సినిమాలో అయినా విడుద‌లైంది 'ప్రాణం ఖ‌రీదు'. అలా ఆయ‌న తొలి సినిమా 'ప్రాణం ఖ‌రీదు' అని చెప్పుకుంటే, చిరంజీవిగా ముఖాన రంగు వేసుకున్న నాటి నుంచి నేటి వ‌ర‌కూ ఆయ‌న‌కున్న గాడ్‌ఫాద‌ర్‌, అండ‌, మార్గ‌ద‌ర్శి, ఫిలాస‌ఫ‌ర్ ఎవ‌రూ అంటే ఆయ‌న‌లోని శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ అనే వ్య‌క్తే! ఆయ‌న న‌ట జీవితం ప్రారంభించిన నాటి నుంచీ, ఆయ‌న‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అదిలిస్తూ, మంద‌లిస్తూ స‌రైన మార్గంలో వెళ్లేలా చూస్తే, తెర‌మీద‌నే కాకుండా, తెర‌వెనుక కూడా రాణించాలంటే ఏయే ల‌క్ష‌ణాలు అల‌వ‌ర‌చుకోవాలి, ఎలా ప్ర‌వ‌ర్తించాలి? అనేవి అనుక్ష‌ణం చెప్పే వ్య‌క్తి శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాదే!

ఉదాహ‌ర‌ణ‌కు.. హీరోగా చిరంజీవి న‌టిస్తూ, రాణిస్తున్న రోజుల్లో విల‌న్ పాత్ర‌లు పోషించే అవ‌కాశం వ‌చ్చిన సంద‌ర్భాల్లో ఆయ‌న‌కంటూ వెన‌క ఓ అండ ఉంటే ఠ‌క్కున వెయ్య‌కండి అని చెప్పేవారు. 'విల‌న్ వేషాలు నేను వెయ్య‌ను' అని గ‌న‌క ఆయ‌న అనివుంటే 'ఎంత గ‌ర్వం ఈ మ‌నిషికి, స‌త్య‌చిత్ర లాంటి పెద్ద సంస్థ‌లో అవ‌కాశం వ‌స్తే తిర‌స్క‌రించాడు' అని ఎక్క‌డ అపార్థం చేసుకుంటారోన‌ని వాళ్ల ఆఫీసుకెళ్లి బ‌తిమాలుకుంటే 'త‌ర్వాత చిత్రంలో నువ్వు హీరోవ‌య్యా' అని వారు చెబితే, వాళ్ల మాట‌లు గుడ్డిగా న‌మ్మి రెండు చిత్రాల్లో - కృష్ణ‌తో క‌లిసి విల‌న్‌గా న‌టించాల్సి వ‌చ్చింది. 

కార‌ణం - పెద్ద బ్యాన‌ర్‌, పెద్ద హీరో చిత్రం. కాదంటే వాళ్లేమ‌నుకుంటారో - ఇప్పుడు మ‌నం తిర‌స్క‌రిస్తే రేపు మ‌న భ‌విష్య‌త్తు ఏమ‌వుతుందో అనే అతి జాగ్ర‌త్త వ‌ల్ల‌, 'ఒక సినిమాలో విల‌న్‌గా న‌టించినందువ‌ల్ల నీకేం న‌ష్టం లేదు - ఆ పాత్ర‌లోనే నువ్వు నీ టాలెంట్‌ని రుజువు చేసుకోవ‌చ్చు' అని ఆయ‌న‌లోని శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ అనే వ్య‌క్తి చిరంజీవిని ప్రోత్స‌హించాడు. అందువ‌ల్లే అతి స్వ‌ల్ప కాలంలోనే సుప్రీమ్ హీరోగా, త‌ర్వాత మెగాస్టార్‌గా నంబ‌ర్ వ‌న్ రేంజికి చేరుకున్నారు. సో.. చిరంజీవి అస‌లుసిస‌లు 'గాడ్‌ఫాద‌ర్‌'.. శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌!!