Read more!

English | Telugu

ప్ర‌కాశ్‌రాజ్ డైలాగ్ డెలీవ‌రీ చూసి బాల‌చంద‌ర్ ఏం చేశారంటే..!

 

ప్ర‌కాశ్‌రాజ్ మొద‌ట్లో నాట‌కాలు ఆడారు. క‌న్న‌డంలో సీరియ‌ల్స్ చేశారు. సినిమాల్లో చిన్న చిన్న వేషాలొస్తున్న రోజుల్లో ఒక ఆర్ట్ సినిమా చేశారు. ఆ సినిమాతో న‌టి గీత ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆమెకు ప్ర‌కాశ్‌రాజ్ న‌ట‌న బాగా న‌చ్చి, "ఇంత టాలెంటుంది. ఒక‌సారి బాల‌చంద‌ర్‌గారిని క‌లిస్తే బాగుంటుంది క‌దా" అని స‌ల‌హా ఇచ్చారు. ఆ త‌ర్వాత కొద్ది రోజుల‌కు ఓ స్నేహితుడి పెళ్లిక‌ని చెన్నై వెళ్లారు. ఎలాగూ ఇక్క‌డికి వ‌చ్చాం క‌దా, బాల‌చంద‌ర్‌గారిని క‌లిస్తే పోతుంది క‌దా అనుకున్నారు. ప్ర‌య‌త్నిస్తే అపాయింట్‌మెంట్ దొరికింది. ఆయ‌న్ను క‌లిశారు ప్ర‌కాశ్‌రాజ్‌. నాట‌కాల గురించీ, సాహిత్యం గురించీ మాట్లాడారు బాల‌చంద‌ర్‌. మొద‌ట ప‌ది నిమిషాలు టైమిచ్చిన ఆయ‌న ఏకంగా రెండున్న‌ర గంట‌ల‌సేపు మాట్లాడారు.

ఉన్న‌ట్లుండి త‌న అసిస్టెంట్‌ను పిలిచి, అత‌నితో "వీడి క‌ళ్లు చూడ‌య్యా, ఆ క‌ళ్ల‌ల్లో ఫైర్ చూడ‌య్యా" అని ప్ర‌కాశ్‌రాజ్ వైపు తిరిగి, "ఇన్నిరోజులూ ఎక్క‌డున్నావురా?" అని చిరాకుప‌డ్డారు. 'జాజిమ‌ల్లి' అనే సినిమా చేస్తున్నాన‌నీ, అందులో వేష‌మిస్తాన‌నీ చెప్పారు. స‌రేన‌న్నారు ప్ర‌కాశ్‌రాజ్‌. రెండు మూడు రోజుల త‌ర్వాత "లేదురా, ఆ క్యారెక్ట‌ర్‌కు మ‌రొక‌ర్ని తీసుకున్నాను. నిన్ను మ‌ళ్లీ పిలుస్తాను" అని చెప్పారు బాల‌చంద‌ర్‌. స‌రేన‌ని బెంగ‌ళూరు వెళ్లిపోయారు ప్ర‌కాశ్‌రాజ్‌.

అలా ఏడాదిన్న‌ర గ‌డిచిపోయింది. ఒక‌రోజు పొద్దున్నే బాల‌చంద‌ర్ నుంచి ఫోనొచ్చింది. "కెన్ ఐ స్పీక్ టు మిస్ట‌ర్ ప్ర‌కాశ్ రాయ్?" అని అడిగారు. అటెన్ష‌న్ అయిపోయి, "నేనే సార్" అన్నారు ప్ర‌కాశ్‌రాజ్‌. "ఏం లేదు, ఓ వేషం ఉంది. వ‌స్తావేమోన‌ని చేశాను" అన్నారాయన‌. "వ‌స్తాను సార్" అన్నారు ప్ర‌కాశ్‌రాజ్‌. ఆ మ‌ధ్యాహ్న‌మే బ‌య‌ల్దేరి చెన్నై వెళ్లారు.

అలా బాల‌చంద‌ర్ డైరెక్ష‌న్‌లో తొలిసారిగా 'డ్యూయెట్' సినిమాలో న‌టించారు ప్ర‌కాశ్‌రాజ్‌. వైజాగ్‌లో ఆయ‌న ఫ‌స్ట్ షాట్ తీశారు. శ‌ర‌త్‌బాబు ఇంట్లో మెట్ల మీద‌నుంచి కిందికి దిగుతూ, ప్ర‌కాశ్‌రాజ్‌ను చూసి "ఎవ‌ర్నువ్వు?" అన‌డుగుతారు. "నా గురించి నీకు తెలీదా, పెద్ద న‌టుడ్ని" అని డైలాగ్ చెప్పారు ప్ర‌కాశ్‌రాజ్‌. అయితే ఆయ‌న డైలాగ్ డెలివ‌రీ చూసి, అప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న డైలాగ్ మార్చేశారు బాల‌చంద‌ర్‌. "గాలిలేని చోట కూడా నా పేరుంటుంది. నా పేరు శిర్పి" అని రాశారు.

"ఏంటి సార్‌, స‌డ‌న్‌గా డైలాగ్ మార్చేశారు?" అని అడిగితే, భుజంత‌ట్టి, "ఇదేరా నీ ఫ్యూచ‌ర్" అన్నారు బాల‌చంద‌ర్‌. డ్యూయెట్ రిలీజ్‌కు ముందు ప్రివ్యూ రోజున ప్ర‌కాశ్‌రాజ్‌ను పిలిపించారు బాల‌చంద‌ర్‌. "ఏమ‌నుకుంటున్నావురా నీ గురించి.. సినిమా అంతా నువ్వేనా?" అన్నారు చిరాకుప‌డుతున్న‌ట్లు.

విష‌య‌మేంటంటే మొద‌టిరోజు ప్ర‌కాశ్‌రాజ్ న‌ట‌న న‌చ్చి దాదాపు ప‌దిహేను సీన్లు అద‌నంగా షూట్ చేశారు. వాటి గురించే ఆయ‌న మాట్లాడారు. అయితే, "ఏం లేదురా.. సినిమాలో నీ సీన్లు కొన్ని తీసేశాం" అని చెప్పారు. ప్ర‌కాశ్‌రాజ్‌కు ఏడుపొచ్చినంత ప‌న‌యింది. 'సీన్లు క‌ట్ చేయ‌డం ఏంటి' అనుకున్నారు. అయినా త‌మాయించుకొని, "ఇట్సాల్ ఇన్ ద గేమ్ సార్" అన్నారు. వెంట‌నే ప్రకాశ్‌రాజ్‌ను కౌగ‌లించుకొని "ఇదిరా స్పిరిట్‌. సినిమా ముఖ్యం, మ‌నం కాదు" అన్నారు బాల‌చంద‌ర్‌.

ప్రివ్యూ అయిపోయి, థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక‌, "ఎలా ఉందిరా సినిమా?" అన‌డిగారు బాల‌చంద‌ర్‌. "ఇది చాలు సార్ నాకు, బ‌తికేస్తాను" అని జ‌వాబిచ్చారు ప్ర‌కాశ్‌రాజ్‌. ఆ త‌ర్వాత ఆయ‌న కెరీర్‌లో వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం క‌లుగ‌లేదు. బ్ర‌హ్మాండంగా బ‌తికేస్తూ వ‌స్తున్నారు.