Read more!

English | Telugu

అంద‌రికీ న‌వ్వులు పంచి, బ్ల‌డ్ కేన్స‌ర్‌తో స‌డ‌న్‌గా వెళ్లిపోయిన 'బ‌ట్ట‌ల స‌త్యం'!

 

మ‌ల్లికార్జున‌రావు అనే పేరు కంటే 'బ‌ట్ట‌ల స‌త్తి' లేదా 'బ‌ట్ట‌ల స‌త్యం' అంటే ఎక్కువ‌మంది క‌నెక్ట‌యిపోతారు. అవును. వంశీ సినిమా 'లేడీస్ టైల‌ర్‌'లో చేసిన బ‌ట్ట‌ల స‌త్తి పాత్ర మ‌ల్లికార్జున‌రావుకు తెచ్చిన పేరు ప్ర‌ఖ్యాతులు అలాంటివి. ల‌క్ష‌లాది మంది ప్రేక్ష‌కుల‌ను త‌న న‌ట‌న‌తో న‌వ్వించిన మ‌ల్లికార్జున‌రావు 2008లో హ‌ఠాత్తుగా క‌న్నుమూసి, వారింద‌రి హృద‌యాల్నీ త‌డిచేశారు. 375 సినిమాల్లో ర‌క‌ర‌కాల పాత్ర‌లు చేసి, అత్య‌ధిక పాత్ర‌ల‌తో మ‌న ముఖాల‌పై న‌వ్వులు పూయించిన ఆయ‌న‌, అనారోగ్యంతో హాస్పిట‌ల్ పాలైన మూడోరోజే మ‌న‌ల్ని విడిచి వెళ్లిపోయారు. అప్పుడే ఆయ‌న ప్రాణాంత‌క లుకేమియా (బ్ల‌డ్ కేన్స‌ర్‌)తో బాధ‌ప‌డుతున్నార‌నే విష‌యం ప్ర‌పంచానికి తెలిసింది. త‌న‌కు ఆ వ్యాధి ఉంద‌నే విష‌యం అప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న ఫ్యామిలీకి త‌ప్ప మ‌రెవ‌రికీ తెలీదు.

విశాఖ‌ప‌ట్నం జిల్లా అన‌కాప‌ల్లిలో 1951 డిసెంబ‌ర్ 13న జ‌న్మించిన మ‌ల్లికార్జున‌రావుకు చ‌దువు అంత‌గా అబ్బ‌లేదు. నాట‌కాల మీద చిన్న‌ప్ప‌ట్నుంచీ ఇష్టం పెంచుకున్నారు. వంశీ సినిమా 'సితార' (1983)లో ఒక చిన్న పాత్ర చేశాక‌, సినీ న‌టుడిగా కొన‌సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆ త‌ర్వాత రెండేళ్ల‌కే 'లేడీస్ టైల‌ర్' (1985)లో బ‌ట్ట‌ల స‌త్తి పాత్ర చేసే అవ‌కాశం ద‌క్కింది. అప్ప‌ట్నుంచీ అంద‌రూ ఆయ‌న‌ను 'బ‌ట్ట‌ల స‌త్యం' అని పిల‌వ‌డం మొద‌లుపెట్టారు. అంత‌లా ఆ క్యారెక్ట‌ర్ జ‌నాన్ని అల‌రించింది. రెండున్న‌ర ద‌శాబ్దాల సినిమా కెరీర్‌లో ఆయ‌న ఎంతోమంది స్నేహితుల్నీ, అభిమానుల్నీ సంపాదించుకున్న ఆ న‌టుడు ఒక్క శ‌త్రువునీ సంపాదించ‌లేక‌పోయారు. వ్య‌క్తిగా అదీ.. మ‌ల్లికార్జున‌రావు అంటే! తెర‌పై క‌మెడియ‌న్‌గా ఎన్ని ర‌కాల వేషాలు వేసినా, నిజ జీవితంలో మాత్రం ఎంతో హుందాగా ఆయ‌న మెలిగేవారు. వివాదాల‌కు, కోప‌తాపాల‌కు దూరంగా ఉండేవారు. Also read: మ‌న గుండెల్లో ఎప్ప‌టికీ నిలిచివుండే ఎవ‌ర్‌గ్రీన్ హీరో.. ఏఎన్నార్‌!

మ‌ల్లికార్జున‌రావుకు బ్ల‌డ్ కేన్స‌ర్ అనే విష‌యం తెలియ‌గానే, సినిమావాళ్లంతా షాక్‌కు గుర‌య్యారు. స్నేహితులు కూడా త‌మ‌కు ఇంత‌దాకా ఆ విష‌యం తెలియ‌లేదే అని బాధ‌ప‌డ్డారు. ఆయ‌న‌కు షుగ‌ర్ ఉంద‌నే విష‌యం మాత్రం చాలామందికి తెలుసు. అయినా త‌న‌కెలాంటి అనారోగ్యం లేద‌న్న‌ట్లే అంద‌రిలో మెస‌లేవారు. ఆయ‌న‌కు త‌న ఊరంటే ప్రేమ చాలా ఎక్కువ‌. సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా అన‌కాప‌ల్లికి వెళ్లి, బంధుమిత్రులతో గ‌డిపేవారు. హైద‌రాబాద్‌లో కొంత‌మంది పేద సినీ ఆర్టిస్టుల‌కు ఆయ‌న రెగ్యుల‌ర్‌గా సాయం చేస్తూ వ‌చ్చారు. మూవీ ఆర్టిస్ట్స్ ఆసోసియేష‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసేట‌ప్పుడు వారికి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇప్పించారు. Also read: ర‌మేశ్‌బాబు, జుహీ చావ్లా జంట‌గా న‌టించార‌ని మీకు తెలుసా?

తెర‌పై స‌ర‌దాగా క‌నిపించే మ‌ల్లికార్జున‌రావు నిజ జీవితంలో రిజ‌ర్వ్‌డ్‌గా ఉంటార‌నే విష‌యం ఆయ‌న‌కు స‌న్నిహితంగా మెల‌గిన‌వారికి తెలుసు. ఆయ‌న నోరు తెరిచి అడిగితే ఇంకెన్నో పాత్ర‌లు ఆయ‌న‌కు వ‌చ్చి ఉండేవి. కానీ ఆయ‌నెప్పుడూ ఏ నిర్మాత‌నీ, ద‌ర్శ‌కుడినీ త‌న‌కు వేషం కావాల‌ని అడ‌గ‌లేదు. "నేను సినిమా ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది న‌న్ను నేను అమ్ముకోవ‌డానికి కాదు. నాలో విష‌యం ఉంద‌ని న‌మ్మిన‌వాళ్లు నాకు వేషం ఇస్తారు" అని ఆయ‌న అనేవారు.

అలాంటి నిబ‌ద్ధ‌త క‌లిగిన న‌టుడైన మ‌ల్లికార్జున‌రావు అలియాస్ బ‌ట్ట‌ల స‌త్యం 57 సంవ‌త్స‌రాల వ‌య‌సుకే బ్ల‌డ్ కేన్స‌ర్ బారిన‌ప‌డి త‌న‌ను అభిమానించే వారంద‌రినీ బాధ‌పెడుతూ 2008 జూన్ 24న తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయారు.