English | Telugu

అకార‌ణంగా కోప్ప‌డ్డ భార‌తీరాజా.. మౌనం వ‌హించిన చిరంజీవి!

వ్య‌క్తిగ‌తంగా చిరంజీవి ఎలాంటి వ్య‌క్తో చెప్ప‌డానికి 'ఆరాధ‌న' సినిమా సెట్స్‌పై జ‌రిగిన ఓ ఉదంతం నిద‌ర్శ‌నం. ద‌ర్శ‌కుడు భార‌తీరాజా విప‌రీత‌మైన కోపిష్ఠి. ప్ర‌తి చిన్న విష‌యానికీ ఆయ‌న‌కు చాలా త్వ‌ర‌గా కోపం వ‌చ్చేస్తుంటుంది. ఈ విష‌యం ఆయ‌న‌తో ప‌నిచేసిన ఆర్టిస్టుల‌కూ, సాంకేతిక నిపుణుల‌కూ బాగా తెలుసు. షూటింగ్ టైమ్‌లో ప‌ని ఒత్తిడి వ‌ల్ల ఏ చిన్న‌లోపం జ‌రిగినా భార‌తీరాజాకు విప‌రీత‌మైన కోపం వ‌చ్చేస్తుంది. ఈ విష‌యం ఆయ‌న‌కూ తెలుసు. త‌న‌లోని ఈ స్వ‌భావాన్ని మార్చుకోవ‌డానికి ఎంత ప్ర‌య‌త్నించినా ఆయ‌న వ‌ల్ల కాలేదు.

ఒక‌రోజు 'ఆరాధన' సినిమా షూటింగ్ నాగ‌ర్‌కోయిల్‌లో, మండుటెండ‌లో జ‌రుగుతోంది. ఆ రోజు ప‌ని ఒత్తిడి ఎక్కువ‌గా ఉన్న కార‌ణంగా భార‌తీరాజా చాలా చిరాగ్గా, కోపంగా ఉన్నారు. ఆయ‌న‌లోని కోపంలో కొంత భాగం ఆ సినిమా హీరో అయిన చిరంజీవి మీద కూడా చూపించారు. అప్ప‌టికే చిరంజీవి తెలుగులో అగ్ర క‌థానాయ‌కుడి పొజిష‌న్‌లో ఉన్నారు. ఆ సినిమాకి నిర్మాత అల్లు అర‌వింద్‌. ఆ కార‌ణంగా, డైరెక్ట‌ర్ త‌న మీద చూపించిన కోపానికి ఆయ‌న‌ను పిలిచి, "అకార‌ణంగా నా మీద ఎందుకు కోప్ప‌డ్డారు?" అని అడ‌గ‌వ‌చ్చు. కానీ ఆరోజు ఆ ప‌రిస్థితిలో ద‌ర్శ‌కుడిని ఏమీ అన‌కుండా మౌనంగా ఉండిపోయారు చిరంజీవి. క‌నీసం ఎందుకు కోపంగా ఉన్నార‌ని కూడా భార‌తీరాజాను ఆయ‌న అడ‌గ‌లేదు. డైరెక్ట‌ర్ త‌న‌ను కోప్ప‌డ్డార‌న్న ఫీలింగ్‌ను ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌నీయ‌లేదు. అలాంటి స‌మ‌యాల్లో చిరంజీవి ప్ర‌ద‌ర్శించే స‌హ‌నం, ఓర్పు వ‌ల్లే ఆయ‌నను మెగాస్టార్ రేంజికి ఎదిగేలా చేశాయేమో!

ఈ విష‌యాన్ని ఓ సంద‌ర్భంగా భార‌తీరాజా స్వ‌యంగా షేర్ చేసుకున్నారు. "ఉన్న‌త‌స్థాయికి చేరుకున్న వ్య‌క్తుల్లో అంత‌టి ఉదాత్త‌త‌, స‌భ్య‌త‌, సంస్కారం చాలా అరుదుగా చూడ‌గ‌లం. ఆయ‌న‌లో ఉన్న ఈ అరుదైన ల‌క్ష‌ణాలే ఆయ‌న‌ను చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిల‌బెట్టాయ‌నేది నా న‌మ్మ‌కం. కొంత‌మంది న‌టుల్ని వ్యాప‌ర‌ప‌రంగా వారికున్న పాపులారిటీని బ‌ట్టి, మ‌రికొంత‌మంది న‌టుల్ని వారి బ‌హుముఖ ప్ర‌జ్ఞాపాట‌వాల్ని బ‌ట్టి, ఇంకొంత‌మంది న‌టుల్ని వారి న‌డ‌వడిక‌ను, స‌హ‌కార‌భావాన్ని బ‌ట్టి గౌర‌విస్తాం, ఆద‌రిస్తాం. కానీ చిరంజీవిని నేను లైక్ చెయ్య‌డానికీ, అభిమానించ‌డానికీ కార‌ణం.. వీట‌న్నింటినీ మించిన స‌హృద‌య‌త ఆయ‌న‌లో ఉండ‌ట‌మే." అని ఆయ‌న చెప్పారు.