English | Telugu

బాల‌య్య సినిమాలో అజ‌య్‌కు ఒకే డైలాగ్‌.. "ఏంటో మ‌రి?"

ఇంట‌ర్మీడియేట్‌లో ఉన్న‌ప్పుడే అజ‌య్‌కు సినిమా పిచ్చి ప‌ట్టుకుంది. దాంతో చ‌దువు మీద ధ్యాస క‌లుగ‌లేదు. ఎంసెట్‌లో అత‌నికి వ‌చ్చిన ర్యాంక్ చూసి వాళ్ల‌నాన్న కంగారుప‌డ్డారు. హైద‌రాబాద్ ఇంజ‌నీరింగ్ కాలేజీల్లో సీటు రావ‌డం క‌ష్ట‌మ‌ని, డొనేష‌న్ క‌ట్టి నాగ‌పూర్ పంపించారు. ధ్యాస సినిమాల మీదే ఉండ‌టంతో అక్క‌డ ఎక్కువ రోజులు ఉండ‌లేక‌పోయాడు అజ‌య్‌. పైగా అక్క‌డి వాతావ‌ర‌ణం కూడా అత‌నికి స‌రిప‌డ‌లేదు. వాళ్ల నాన్న‌కు విష‌యం చెబితే, ఆయ‌న అర్థం చేసుకున్నారు. స‌రేన‌ని హైద‌రాబాద్ ర‌ప్పించారు. ఇక్క‌డ బీకామ్ చ‌దువుతూనే మ‌ధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్ కోర్సులో చేరాడు.

కొంత కాలానికి బాల‌కృష్ణ సినిమా 'వంశోద్ధార‌కుడు'లో న‌టించే చాన్స్ వ‌చ్చింది. దాంతో అజ‌య్ సంతోషానికి ప‌ట్ట‌ప‌గ్గాలు లేకుండా పోయాయి. ఫ‌స్ట్ సినిమాలోనే బాల‌కృష్ణ‌తో న‌టించే చాన్స్ రావడంతో, దాని త‌ర్వాత వ‌రుస అవ‌కాశాలు వ‌స్తాయ‌ని క‌లలు క‌న్నాడు. ఫ్రెండ్స్ కూడా "భ‌లే చాన్స్ కొట్టేశావ్‌రా" అని అభినందించారు. షూటింగ్‌కు వెళ్ల‌గానే డైలాగ్ పేప‌ర్ తీసుకొని, డైలాగ్స్‌ను బాగా ప్రాక్టీస్ చేసి, ఎంత పెద్ద డైలాగ్‌నైనా సింగిల్ టేక్‌లో చేసేయాలి అనుకున్నాడు. అంతేనా! హీరో బాల‌కృష్ణ‌కు డైలాగ్స్ విష‌యంలో గ‌ట్టి పోటీ ఇవ్వాల‌ని కూడా అనుకున్నాడు.

సీన్‌లో న‌టించ‌డానికి ర‌మ్మ‌న‌మ‌ని క‌బురు. అక్క‌డికెళ్లాక త‌న‌కెంత సీన్ ఉందో తెలిసొచ్చింది. సింగిల్ డైలాగ్‌.. అది.. "ఏంటో మ‌రి?" ఇంతే! క్లోజ‌ప్ షాట్‌. ఎప్పుడు డైరెక్ట‌ర్ యాక్ష‌న్ అన్నారో, ఎప్పుడు క‌ట్ చెప్పారో అజ‌య్‌కు అర్థం కాలేదు. సీన్ అయిపోయింద‌న‌గానే ఉసూరుమంటూ ఇంటికొచ్చాశాడు. అత‌డ్ని చూడ‌గానే వాళ్ల‌మ్మ‌, "ఏరా ఎలా చేశావ్‌? ఎన్ని డైలాగులున్నాయ్‌?" అన‌డిగింది.

"ఏంటో మ‌రి?" అని ఊరుకున్నాడు అజ‌య్‌. "ఏడ్చిన‌ట్టే ఉంది. ఇదేం డైలాగ్‌రా" అని ఆమె కూడా న‌వ్వేసింది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ 'ఖుషి' సినిమాలో చేసిన క్యారెక్ట‌ర్‌తో న‌లుగురి దృష్టిలో ప‌డ్డాడు అజ‌య్‌. దాని త‌ర్వాత ఒక‌టొక‌టిగా అవ‌కాశాలొచ్చాయి. 'విక్ర‌మార్కుడు' సినిమాలో రాజ‌మౌళి ఇచ్చిన టిట్ల‌ర్ క్యారెక్ట‌ర్‌తో అజ‌య్ కెరీర్ మ‌లుపు తిరిగింది.