English | Telugu

మ‌హేశ్ త‌ల్లిగా న‌టించిన 'సీతామాల‌క్ష్మి' గురించి మీకు తెలీని విష‌యాలు!

బాలీవుడ్‌లో పేరుతెచ్చుకున్న ప‌లువురు తార‌లు ద‌క్షిణాదివారే. వారిలో తాళ్లూరి రామేశ్వ‌రి తెలుగింటి ఆడ‌ప‌డుచు. 'సీతామాల‌క్ష్మి'గా ఆమె తెలుగువారిని అల‌రించారు. అయితే తెలుగు చిత్ర‌సీమ కంటే హిందీ చిత్ర‌సీమ ఆమెను ఎక్కువ‌గా ఆద‌రించింది. ఆమె తొలిగా న‌టించింది హిందీ చిత్రంలోనే. ఆ సినిమా.. 'దుల్హ‌న్ వొహీ జో పియా మ‌న్ భాయే' (1977) పెద్ద హిట్‌. కొత్త‌మ్మాయి అయినా చాలా మంచి ఆర్టిస్ట్ అని రామేశ్వ‌రిని అంద‌రూ ప్ర‌శంసించారు. కొత్త‌లో చాలామందికి ఆమె తెలుగు ప్రాంతం నుంచి వ‌చ్చిన విష‌యం తెలీదు. హిందీ ఫీల్డులో టాలెంటుకే కానీ ప్రాంతీయ‌త‌కు గుర్తింపు ఉండ‌ద‌ని నిరూపించిన వారిలో రామేశ్వ‌రి ఒక‌రు. ఆ త‌ర్వాత సంవ‌త్స‌రం కె. విశ్వ‌నాథ్ డైరెక్ష‌న్‌లో చంద్ర‌మోహ‌న్ జోడీగా 'సీతామాల‌క్ష్మి' (1978) సినిమా చేసి, ఒకే ఒక్క సినిమాతో తెలుగువారి హృద‌యాల్లో చిర‌స్థాయి స్థానం సంపాదించారు. అంతే కాదు, ఉత్త‌మ న‌టిగా నంది అవార్డునూ అందుకున్నారు.

ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టిఐఐ) స్టూడెంట్ అయిన రామేశ్వ‌రి ఆ ఇన్‌స్టిట్యూట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ప‌ది నెల‌ల నుంచే హిందీ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ నుంచి ఆఫ‌ర్లు రావ‌డం మొద‌లుపెట్టాయి. న‌సీరుద్దీన్ షా ప‌క్క‌న‌ 'సున‌య‌న' చేస్తుండ‌గా ఆమె కంటికి దెబ్బ త‌గిలింది. దాని వ‌ల్ల 'అమ‌ర్ దీప్' అనే సినిమాలో నుంచి ఆమెను తీసేశారు. అప్పుడే 'ఆషా' అనే సినిమా చాన్స్ వ‌స్తే, కంటి ప‌రిస్థితి దృష్ట్యా దాన్ని వ‌ద్ద‌నుకున్నారు రామేశ్వ‌రి. కానీ ఆ సినిమా నిర్మాత ఆమె క‌న్ను బాగ‌య్యేదాకా వెయిట్ చేస్తాన‌ని చెప్పాడు. అందులో ఆమె జితేంద్ర స‌ర‌స‌న న‌టించారు.

ఆ త‌ర్వాత అగ్ని ప‌రీక్ష‌, ఆద‌త్ సే మ‌జ్‌బూర్‌, ఆస్ ఔర్ ప్యాస్‌, అంధేరా ఉజాలా, వ‌క్త్ వక్త్ కీ రాత్‌, ప్ర‌తిభ‌, ద్రోహి, రోష్నీ లాంటి సినిమాలు రామేశ్వ‌రికి ఎంతో పేరు తెచ్చాయి. ఈ కాలంలో వ‌చ్చిన ప‌లు తెలుగు సినిమా అవ‌కాశాల్ని ఆమె వ‌దులుకున్నారు. కార‌ణం.. మొద‌ట్నుంచీ ఆమె ధ్యాస హిందీ సినిమాల మీదే ఉండేది. ఆ కోరిక‌తోనే ఆమె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లారు. త‌న‌కు న‌చ్చిన‌, మంచివి అనుకున్న సినిమాల‌ను సెల‌క్ట్ చేసుకొని, అవి చేస్తూ వ‌చ్చారు.

ఆమె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో త‌న క్లాస్‌మేట్‌, ఫ్రెండ్ అయిన పంజాబీ న‌టుడు-నిర్మాత దీప‌క్ సేఠ్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్ద‌రు కొడుకులు.. భాస్క‌ర‌ప్ర‌తాప్ సేఠ్‌, ప్రేమ్ సేఠ్‌. పిల్ల‌లు పుట్టాక వారిని పెంప‌కం చూసుకోవ‌డం కోసం సినిమాల‌కు దూర‌మైన రామేశ్వ‌రి, తిరిగి 2002లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. 2003లో మ‌హేశ్‌కు త‌ల్లిగా 'నిజం' సినిమా చేశారు. అందులో ఆమె న‌ట‌న అంద‌రి ప్ర‌శంస‌లూ అందుకుంది. దానికంటే ముందు ఆమె చేసిన తెలుగు సినిమా 'చిన్నోడు పెద్దోడు' (1988). అందులో త‌న తొలి తెలుగు సినిమా క‌థానాయ‌కుడు చంద్ర‌మోహ‌న్ స‌ర‌స‌న న‌టించ‌డం గ‌మ‌నార్హం. తెలుగులో ఆమె హీరోయిన్‌గా చేసిన రెండు సినిమాల్లోనూ ఆయ‌నే హీరో!

'నిజం' త‌ర్వాత నీల‌కంఠ డైరెక్ట్ చేసిన 'నంద‌న‌వనం 120 కిమీ', నారా రోహిత్ సినిమా 'రౌడీ ఫెలో' సినిమాల్లో న‌టించారు రామేశ్వ‌రి. అప్ప‌ట్లోనే జీ తెలుగులో ప్ర‌సార‌మైన 'అమెరికా అమ్మాయి' సీరియ‌ల్‌లో హీరోయిన్ త‌ల్లిగా న‌టించారు.