Read more!

English | Telugu

'అడ‌వి సింహాలు' షూటింగ్‌లో దుర్ఘ‌ట‌న‌.. సిలిండ‌ర్ పేలి ఒక‌రి త‌ల తెగింది!

 

వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై చ‌ల‌సాని అశ్వినీద‌త్ నిర్మించిన హిట్ ఫిల్మ్ 'అడ‌వి సింహాలు' (1983). కృష్ణ‌-శ్రీ‌దేవి, కృష్ణంరాజు-జ‌యప్ర‌ద రెండు జంట‌లుగా న‌టించిన ఈ సినిమాకు దర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క్షేమ‌మా ప్రియ‌త‌మా, హేయ్ హేయ్ గంట‌కొట్టిందా, అగ్గిపుల్ల భ‌గ్గుమంట‌ది, పిల్ల నచ్చింది, గూటిలోకి చేరేది ఎప్పుడు.. పాట‌లు బాగా పాపుల‌ర్ అయ్యాయి. అయితే ఈ సినిమా షూటింగ్ వైజాగ్ బీచ్‌లో జ‌రిగిన‌ప్పుడు ఓ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. అందులో ఒక‌రి ప్రాణంపోగా, అక్క‌డున్న పిల్ల‌లు తృటిలో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్నారు.

ఆ రోజు వైజాగ్ బీచ్‌లో కృష్ణ‌, కృష్ణంరాజు, శ్రీ‌దేవి, జ‌య‌ప్ర‌ద‌ల‌పై 'పిల్ల న‌చ్చింది' పాట‌ను చిత్రీక‌రించేందుకు ఏర్పాట్లు చేశారు. అక్క‌డ కొన్ని వంద‌ల రంగురంగుల బెలూన్ల‌కు సిలిండ‌ర్‌తో గ్యాస్ ఎక్కిస్తూ నిర్విరామంగా ప‌నిచేస్తున్నాడు ఓ వ్య‌క్తి. రంగురంగుల బెలూన్ల‌వ‌డంతో బీచ్‌లో ఉన్న పిల్ల‌లంతా వింత‌గా చూస్తూ అత‌ని చుట్టూ మూగారు. 

ఇంత‌లో అక్క‌డ‌కు ఓ కారు వ‌స్తోంది. అందులో కృష్ణంరాజు, జ‌య‌ప్ర‌ద ఉన్నారంటూ ఎవ‌రో కేక‌వేశారు. మ‌రుక్ష‌ణంలో పిల్ల‌లంతా కొంచెం దూరంగా ఉన్న ఆ కారువైపు ప‌రుగులు తీశారు. అంతే! అంత‌దాకా బెలూన్ల‌కు గ్యాస్ నింపుతున్న సిలిండ‌ర్ ఒక్క‌సారిగా ఢామ్మంటూ పేలిపోయింది. అక్క‌డ ప‌నిచేస్తున్న‌త‌ని త‌ల తెగి గాలిలో ఎగిరింది.

ఒక్క‌సారిగా ఏం జ‌రిగిందో అర్థంకాక స్థాణువులైపోయారు అక్క‌డున్న‌వారంతా. ఆ త‌ర్వాత భీతావ‌హులై వ‌ణికిపోయారు. ఒక్క క్ష‌ణం ముందు దాకా అక్క‌డున్న పిల్ల‌లు కారు ద‌గ్గ‌ర‌కు ప‌రుగెత్తుకొని వెళ్ల‌డంతో ఒక ఘోర విషాదం త‌ప్పిపోయింది. లేక‌పోతే త‌ల‌చుకోడానికే భ‌య‌ప‌డే దుర్ఘ‌ట‌న చోటు చేసుకునేది.