Read more!

English | Telugu

ఆసియాలోనే ఆ ఘ‌న‌త సాధించిన మొద‌టి వ్య‌క్తి ఇళ‌య‌రాజా!

 

1993 జూలై 19.. ఆసియాలోని సంగీత ప్రియులంద‌రూ గ‌ర్వించిన రోజు. కార‌ణం.. ఆ రోజు ఎలిజ‌బెత్ రాణి ప్ర‌ధాన పోష‌కురాలిగా వ్య‌వ‌హ‌రిస్తున్న సుప్ర‌సిద్ధ రాయ‌ల్ ఫిల్హార్‌మోనిక్ ఆర్కెస్ట్రా (లండ‌న్‌) ప్ర‌పంచ ప్ర‌సిద్ధ సంగీత‌కారుడు జాన్ స్కాట్ సంగీత నిర్వ‌హ‌ణ‌లో ఇళ‌య‌రాజా రూపొందించిన 'సింఫ‌నీ' సంగీతాన్ని రికార్డు చేశారు. ఈ మ్యూజిక్ ఆల్బ‌మ్‌ను పిర‌మిడ్ ఇంట‌ర్నేష‌న‌ల్ విడుద‌ల చేసింది. దీంతో ప్ర‌పంచ ప్ర‌సిద్ధుల స్థాయిలో, పాశ్చాత్య-శాస్త్రీయ సంగీత పోక‌డ‌లో సింఫ‌నీని రూపొందించిన మొట్ట‌మొద‌టి ఆసియా సంగీత‌కారునిగా ఇళ‌య‌రాజా ఘ‌న‌త సాధించారు.

నాలుగున్న‌ర ద‌శాబ్దాల క్రితం త‌మిళ‌నాడులోని ప‌ణ్ణైపురం అనే కుగ్రామం నుంచి సంగీతం నేర్చుకోవ‌డానికి మ‌ద్రాసు వ‌చ్చి, ఒక‌వైపు ఆర్థిక ఇబ్బందులు అనుభ‌విస్తూనే, ప‌ట్టువిడువ‌కుండా సంగీత జ్ఞానాన్ని పెంపొందింప‌జేసుకుని, సంగీత ద‌ర్శ‌కుడై ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ అగ్ర‌స్థానానికి చేరుకున్న కృషీవ‌లుడు ఇళ‌య‌రాజా. మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా అగ్ర‌స్థాయికి చేరుకున్న‌ప్ప‌టికీ శాస్త్రీయ సంగీతంపై ఆయ‌న‌కున్న గౌర‌వ‌మ‌ర్యాద‌లు ఎంత‌మాత్ర‌మూ త‌గ్గ‌లేదు. అందుకే క‌ర్ణాట‌క సంగీతంలో ఇటు త‌మిళంలో, అటు సంస్కృతంలో ఏడు కృతులు కంపోజ్ చేశారు.

శోచ‌నీయ‌మైన విష‌యం ఏమంటే.. ఆసియాలోనే సింఫ‌నీని రూపొందించిన తొలి వ్య‌క్తిగా విశిష్ట గౌర‌వం ఆయ‌న ద‌క్కించుకుంటే.. ఆ విష‌యం జీర్ణించుకోలేని కొంత‌మంది సినీ ఇండ‌స్ట్రీలో ర‌క‌ర‌కాల వ‌దంతులు వ్యాపింప‌జేశారు. ఆయ‌న‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేశారు. దాంతో ఇళ‌య‌రాజా మిత్రులు, స‌న్నిహితులు అయిన ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్‌, భాగ్య‌రాజా, పి. వాసు, పంజు అరుణాచ‌లం లాంటి ప్ర‌ముఖులు ప్రెస్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి, ఇళ‌య‌రాజా సాధించిన ఘ‌న‌త‌కు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించారు. ఆయ‌న ఘ‌న‌విజ‌యాన్ని కొనియాడుతూ ఇళ‌య‌రాజాను స‌త్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఇళ‌య‌రాజా మాట్లాడుతూ, "ఇది నా ఒక్క‌డి విజ‌యం కాదు. ఇది సినీరంగం విజ‌యం. సంగీతాభిమానుల విజ‌యం. ఈ ఆనందాన్ని మీతో కాక మ‌రెవ‌రితో పంచుకోగ‌ల‌ను." అన్నారు గ‌ద్గ‌ద‌స్వ‌రంతో.