Read more!

English | Telugu

'గ్యాంగ్ లీడ‌ర్' నావ‌ల్లే హిట్ట‌య్యింద‌ని నేను అన్న‌ట్లు గిట్ట‌నివాళ్లు ప్ర‌చారం చేశారు!

 

లేడీ అమితాబ్ విజ‌య‌శాంతికి బాగా పేరు తెచ్చిన సినిమాల్లో ప్ర‌తిఘ‌ట‌న‌, ఒసేయ్ రాముల‌మ్మా, క‌ర్త‌వ్యం.. ముందు వ‌రుస‌లో ఉంటాయి. ఈ సినిమాలంటే ఆమెకు చాలా చాలా ఇష్టం. ఇవి కాకుండా నేటి భార‌తం, ప‌డ‌మ‌టి సంధ్యారాగం, మొండిమొగుడు పెంకిపెళ్లాం, పోలీస్ లాక‌ప్‌, స్వ‌యంకృషి, రౌడీ ఇన్‌స్పెక్ట‌ర్ సినిమాల్లో మంచి పాత్ర‌లు చేశాన‌ని విజ‌య‌శాంతి చెప్పారు. హీరోల సినిమాల్లోనూ ఆమెకు మంచి పాత్ర‌లు ల‌భించాయి. 'గ్యాంగ్ లీడ‌ర్‌'లో అయితే ఆమె ఎవ‌రి మాటా విన‌ని క్యారెక్ట‌ర్ చేశారు.

"అరేబియ‌న్ హార్స్ లెక్క‌న ఆ పాత్ర‌ ప‌రిగెత్తుతూనే ఉంటుంది. డైరెక్ట‌ర్ విజ‌య‌బాపినీడు గారు దాన్ని కొంత డిజైన్ చేస్తే, మిగ‌తాది స్పాట్‌లో నేనే డిజైన్ చేసుకున్నా." అని ఆమె చెప్పారు. అప్ప‌ట్లో 'గ్యాంగ్ లీడ‌ర్' త‌న‌ వ‌ల్లే హిట్ట‌య్యింద‌ని విజ‌య‌శాంతి అన్న‌ట్లు ఇండ‌స్ట్రీలో బాగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే త‌నెప్పుడూ అలా అన‌లేద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. "గ్యాంగ్ లీడ‌ర్ నా వ‌ల్లే హిట్ట‌య్యింద‌ని నేనెప్పుడూ అన‌లేదు. అదెవ‌రో గిట్ట‌నివాళ్లు క్రియేట్ చేశారు. ఒక‌వేళ నేను అలా అనుంటే మ‌ళ్లీ మేం 'మెకానిక్ అల్లుడు' క‌లిసి చేసేవాళ్లం కాదు క‌దా." అని తెలిపారు విజ‌య‌శాంతి.

'గ్యాంగ్ లీడ‌ర్‌' సినిమాలో హీరో హీరోయిన్ల పాత్ర‌లు రెండూ స‌మాన‌మైన గొప్ప పాత్ర‌ల‌ని ఆమె అన్నారు. "ఒక విధంగా చెప్పాలంటే నాది డామినేటింగ్ క్యారెక్ట‌ర్‌. ఆ పాత్ర అలా కుదిరింది. చిరంజీవి కూడా బాగా స‌హ‌క‌రించారు." అని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు లేడీ సూప‌ర్‌స్టార్‌.