English | Telugu
రౌడీ స్టార్ మాస్టర్ ప్లాన్.. ఇక థియేటర్లలో మోత మోగాల్సిందేనా?
Updated : May 8, 2025
(మే 9 విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా..)
చిత్ర పరిశ్రమలో ఎవరి అండా లేకుండా నెగ్గుకు రావడం అనేది చాలా కష్టం. ముఖ్యంగా ఈరోజుల్లో మరీ కష్టం. అలా స్వయంకృషితో తనను తాను ప్రూవ్ చేసుకొని స్టార్ హీరోగా నిలబడిన వారిలో మొదటిగా చిరంజీవి పేరే చెబుతారు. ఇటీవలి కాలంలో చిరంజీవి తరహాలో ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరో హోదా తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ. మొదట చిన్నా చితకా పాత్రలు చేసి ఆ తర్వాత పెళ్లిచూపులు చిత్రంతో హీరోగా మారారు. అర్జున్‌రెడ్డి చిత్రంతో ఓవర్‌నైట్ స్టార్ హీరో అయిపోయారు. ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా యూత్‌లో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హీరోగా తనకంటూ ఓ స్పెషాలిటీని క్రియేట్ చేసుకున్న విజయ్.. ఇటీవల చేసిన కొన్ని సినిమాలతో నిరాశ పరిచినప్పటికీ అతనికి యూత్‌లో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఏ హీరోకీ సాధ్యం కాని విధంగా చాలా తక్కువ సమయంలో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. తన సినిమాలతో ఇంత క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి, సినిమా రంగంలోకి ఎలా ప్రవేశించారు అనే విషయాలు తెలుసుకుందాం.
1989 మే 9న గోవర్థనరావు, మాధవి దంపతులకు హైదరాబాద్‌లో జన్మించారు దేవరకొండ విజయ్ సాయి. పుట్టపర్తిలో శ్రీసత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఇంటర్, బి.కాం చేశారు. విజయ్ తండ్రి గోవర్థనరావు మొదట నటుడిగా స్థిరపడాలని అనుకున్నారు. కానీ, అవకాశాలు రాకపోవడంతో టీవీ సీరియల్స్‌కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. విజయ్ కూడా తండ్రిలాగే నటుడు కావాలనుకుని డిగ్రీ పూర్తయిన తర్వాత అదే విషయాన్ని తండ్రికి చెప్పారు. ఆయన కూడా ఒప్పుకోవడంతో సూత్రధార్ అనే నాటక సమాజంలో 3 నెలల వర్క్ షాప్‌లో పాల్గొన్నారు విజయ్. హైదరాబాద్ థియేటర్ సర్క్యూట్ లో ఎన్నో నాటకాల్లో నటించారు. ఆ తర్వాత సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టారు. దర్శకుడు రవిబాబు ‘నువ్విలా’ చిత్రం కోసం ఆడిషన్స్ తీసుకుంటున్నారని తెలిసి అక్కడికి వెళ్లారు విజయ్. ఆ సినిమాలో చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. అది అతనికి గుర్తింపు తీసుకురాలేదు. ఆ తర్వాత ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో కూడా అంతగా ప్రాధాన్యం లేని క్యారెక్టర్ చేశారు. ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాగ్ అశ్విన్‌తో విజయ్‌కి పరిచయం ఏర్పడిరది. ఆ స్నేహం కొద్దీ తను రూపొందిస్తున్న ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలో ఓ కీలక పాత్ర ఇచ్చారు నాగ్ అశ్విన్. ఈ సినిమా విజయ్‌కి మంచి పేరు తెచ్చింది. ఈ సినిమాను అశ్వినీదత్ కుమార్తెలు నిర్మించారు. అప్పటి నుంచి దత్ ఫ్యామిలీతో విజయ్‌కి మంచి అనుబంధం ఏర్పడిరది. ఆ తర్వాత నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘మహానటి’ చిత్రంలో ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ చేశారు.
‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలో విజయ్ నటన చూసి.. తరుణ్ భాస్కర్ తను రూపొందిస్తున్న ‘పెళ్లిచూపులు’ చిత్రంలో హీరోగా అవకాశం ఇచ్చారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన మొదటి సినిమా ఇదే. అప్పటికే సందీప్‌రెడ్డితో విజయ్‌కి మంచి స్నేహం ఉంది. అతను ‘అర్జున్‌రెడ్డి’ కథ రెడీ చేసుకొని మొదట అల్లు అర్జున్‌కి వినిపించాడు. కానీ, అతనికి కథ నచ్చలేదు. ఆ తర్వాత మరో ఇద్దరు హీరోలను కూడా సందీప్ కలిశారు. వారు కూడా రిజెక్ట్ చెయ్యడంతో విజయ్ దేవరకొండతోనే ఆ సినిమా చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. పెళ్లిచూపులు షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ‘అర్జున్‌రెడ్డి’ షూటింగ్ కూడా జరిగింది. ఆ సినిమా విడుదలయ్యే నాటికి 40 శాతం షూటింగ్ పూర్తి చేశారు సందీప్. అదే సమయంలో మహానటి, ద్వారక, ఏం మంత్రం వేశావే సినిమాలు కూడా షూటింగ్ జరుగుతున్నాయి. మొదట ద్వారక చిత్రం విడుదలై ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ సమయంలోనే అర్జున్‌రెడ్డి షూటింగ్ పూర్తి చేసుకొని సెన్సార్‌కి వెళ్లింది. సెన్సార్‌లో కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో రిలీజ్ ఆలస్యమైంది. ఈలోగా తమిళ్‌లో ‘నోటా’ చిత్రం చేశారు విజయ్. అలాగే రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ‘టాక్సీవాలా’ ప్రారంభమైంది.
సెన్సార్ సమస్యల నుంచి బయటపడి ‘ఎ’ సర్టిఫికెట్‌తో ‘అర్జున్‌రెడ్డి’ విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయారు విజయ్ దేవరకొండ. ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత కంటే కొనుక్కున్న బయ్యర్లకే ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఇది. ఈ సినిమా తర్వాత 2018లో విజయ్ నటించిన ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో గీత గోవిందం మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే టాక్సీవాలా సూపర్‌హిట్ అయింది. నోటా, ఏం మంత్రం వేశావే చిత్రాలు నిరాశపరిచాయి. 2019 నుంచి విజయ్ దేవరకొండ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపలేకపోయాయి. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్.. వంటి సినిమాలు ఆశించిన ఫలితాల్ని ఇవ్వలేకపోయాయి. ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ చిత్రంలో విజయ్ చేసిన అర్జునుడి క్యారెక్టర్‌కి మంచి పేరు వచ్చింది. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.
అర్జున్‌రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో విజయ్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. తన కుటుంబానికి నచ్చని పనిచేసినపుడు విజయ్‌ని రౌడీ అనేవారు. దాంతో తన అభిమానుల్ని కూడా విజయ్ అలాగే పిలుస్తారు. 2018లో రౌడీ వేర్‌ను ప్రారంభించి వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. అంతేకాదు, మహబూబ్‌నగర్‌లో తన మొదటి మల్టీప్లెక్స్ థియేటర్‌ను నిర్మించారు విజయ్. సినిమాలు, వ్యాపారాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా విస్తృతంగా చేస్తారు విజయ్. 2019లో ది దేవరకొండ ఫౌండేషన్ అనే పేరుతో లాభాపేక్ష లేని ఒక సంస్థను స్థాపించారు. కరోనా సమయంలో 17 వేల కుటుంబాలకు నిత్యావసరాలు అందించింది ఈ సంస్థ. అలాగే ‘ఖుషి’ సక్సెస్ మీట్‌లో ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున 100 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు.
ఒక్క సినిమాతోనే స్టార్ హీరో ఇమేజ్ సంపాదించుకున్న విజయ్‌కి ఈమధ్యకాలంలో సరైన విజయాలు దక్కడం లేదు. దానికి కారణం ఎంపిక చేసుకుంటున్న కథలు, దర్శకులు అనే విమర్శ విజయ్‌పై ఉంది. దాంతో ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. వరస పరాజయాల నుంచి హిట్ ట్రాక్‌లోకి వచ్చేందుకు పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘కింగ్‌డమ్’ మే 30న విడుదల కాబోతోంది. ఇది కాక తనకు ‘టాక్సీవాలా’ వంటి సూపర్‌హిట్ ఇచ్చిన రాహుల్ సంకృత్యాన్‌తో ఒక సినిమా, ‘రాజావారు రాణీగారు’ చిత్ర దర్శకుడు రవికిరణ్ కోలా కాంబినేషన్‌లో ఒక సినిమా చేస్తున్నారు విజయ్ దేవరకొండ. అంతేకాదు, ‘పెళ్లిచూపులు’ చిత్రంతో హీరోగా తొలి అవకాశం ఇచ్చిన తరుణ్ భాస్కర్‌తో కూడా ఒక సినిమా కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.
