English | Telugu

స్టార్‌ హీరోయిన్‌ అయినప్పటికీ.. సాయిపల్లవి లక్ష్యం మాత్రం అదే!

స్టార్‌ హీరోయిన్‌ అయినప్పటికీ.. సాయిపల్లవి లక్ష్యం మాత్రం అదే!

(మే 9 సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా..)

‘భానుమతి.. ఒక్కటే పీస్‌.. హైబ్రిడ్‌ పిల్ల..’... ‘ఫిదా’ సినిమాలో సాయిపల్లవి పదే పదే చెప్పే డైలాగ్‌. ఇది ఆ సినిమాలోని క్యారెక్టర్‌కే కాదు, నిజ జీవితంలో కూడా ఒక్కటే పీస్‌ అనే పదం ఆమెకు వర్తిస్తుందనిపిస్తుంది. ఎందుకంటే టాలెంట్‌ పరంగాగానీ, వ్యక్తిత్వపరంగా గానీ సినిమా ఇండస్ట్రీలో అలాంటి హీరోయిన్‌ మరొకరు కనిపించరు. నిజంగానే ‘ఒక్కటే పీస్‌’. హీరోయిన్‌ అంటే స్కిన్‌ షో చెయ్యాలి, గ్లామరస్‌గా కనిపించాలి, కుర్రకారుకి పిచ్చెక్కించాలి.. ఇలాంటి ఆలోచనలు ఆమె దరిదాపుల్లోకి కూడా రావు. ఇవేవీ లేకుండా కేవలం తన పెర్‌ఫార్మెన్స్‌తోనే లెక్కకు మించిన అభిమానుల్ని సంపాదించుకున్న హీరోయిన్‌ సాయిపల్లవి. తనతో సినిమా చెయ్యాలంటే.. కొన్ని కండిషన్స్‌ పెడుతుంది. వాటికి ఒప్పుకుంటేనే సినిమా చేస్తుంది. ఎంత రెమ్యునరేషన్‌ ఇచ్చినా తనకు నచ్చని సినిమా చెయ్యనే చెయ్యదు. అంతేకాదు, షూటింగ్‌లో, సినిమా ఫంక్షన్స్‌లో హీరోలకు, దర్శకనిర్మాతలకు భజన చేయడం అనేదానికి ఆమె పూర్తి వ్యతిరేకం. అది శుద్ధ టైమ్‌ వేస్ట్‌ అని ఆమె భావన. అందుకే షూటింగ్‌లో కూడా ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడదు. దీంతో సాయిపల్లవికి పొగరు అనీ, ఎవరినీ లెక్క చేయదని ప్రచారం జరిగింది. ‘నా గురించి ఎవరేం అనుకున్నా.. నాకు ఫర్వాలేదు. నాకు నచ్చినట్టుగా నేనుంటాను. కావాలంటే నన్ను తిట్టుకోండి’ అంటూ డైరెక్ట్‌గా చెప్పే సాయిపల్లవికి సౌత్‌లో హీరోయిన్‌గా ఎంత క్రేజ్‌ ఉందో అందరికీ తెలిసిందే. జార్జియాలో మెడిసన్‌ పూర్తి చేసిన సాయిపల్లవి సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చింది? హీరోయిన్‌గా అవకాశాలు ఎలా అందిపుచ్చుకుంది? చాలా తక్కువ టైమ్‌లో స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి ఎలా ఎదిగింది అనే ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం.

1992 మే 9న తమిళనాడులోని నీలగిరి జిల్లా కోటగిరిలో సెంతామరై కన్నన్‌, రాధ కన్నన్‌ దంపతులకు జన్మించారు పల్లవి. ఆమెకు ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు పూజ. తండ్రి సెంట్రల్‌ ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేశారు. తల్లి రాధ.. సత్యసాయిబాబా భక్తురాలు. దీంతో పల్లవి పేరుకు సాయి అనేది చేర్చారు. కోయంబత్తూరులోని అవిలా కాన్వెంట్‌ స్కూల్‌లో సాయిపల్లవి, పూజ ప్రాథమిక విద్యతోపాటు ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. సాయిపల్లవి ఎవరి దగ్గరా డాన్స్‌ నేర్చుకోలేదు. చిన్నతనం నుంచి టీవీలో వచ్చే పాటలు చూస్తూ స్టెప్స్‌ వేసేది. తల్లి రాధకు డాన్స్‌ అంటే చాలా ఇష్టం. దాంతో కూతుర్ని ఈ విషయంలో ఎంతో ప్రోత్సహించేవారు. అలా ఐదో తరగతి చదువుతున్నప్పుడు స్కూల్‌ ఫంక్షన్‌లో ఒక పాటకు డాన్స్‌ చేసింది. అది చూసిన ఓ తమిళ దర్శకుడు తను చేస్తున్న ‘కస్తూరిమాన్‌’ చిత్రంలో మీరా జాస్మిన్‌ స్నేహితురాలి క్యారెక్టర్‌ ఇచ్చారు. అయితే అది చాలా చిన్న క్యారెక్టర్‌. ఆ తర్వాత 13 ఏళ్ళ వయసులో జీవా దర్శకత్వంలో వచ్చిన ‘ధాం ధూం’ అనే చిత్రంలో కంగనా రనౌత్‌ స్నేహితురాలిగా నటించింది. 

ఇదిలా ఉంటే ఒక టీవీ ఛానల్‌ నిర్వహిస్తున్న డాన్స్‌ షోకి సాయిపల్లవిని తీసుకెళ్లారు ఆమె తల్లి. దానిలో సాయిపల్లవి సెలెక్ట్‌ అయింది. అయితే ఇవన్నీ చేయడం తండ్రికి నచ్చేది కాదు. అయినా ఆమె ఇష్టాన్ని మాత్రం కాదనేవారు కాదు. సినిమాలు, డాన్స్‌ షోల వల్ల చదువు డిస్ట్రబ్‌ అవుతుందని భావించిన కన్నన్‌... ఆమెను మెడిసన్‌ చేసేందుకు జార్జియా పంపించారు. నాలుగు సంవత్సరాలు చదివి ఎంబిబిఎస్‌ పట్టా పుచ్చుకున్నారు సాయిపల్లవి. ఇండియా వచ్చిన తర్వాత ప్రాక్టీస్‌ పెడదామని అనుకున్నారు. గైనకాలజిస్ట్‌గా వైద్య సేవలు అందించాలన్నది ఆమె కోరిక. జార్జియాలో మెడిసన్‌ చేస్తున్న సమయంలోనే సెలవుల్లో ఇండియాకి వచ్చింది. ఆ సమయంలో మలయాళ చిత్రం ‘ప్రేమమ్‌’లో ఒక ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ కోసం సాయిపల్లవిని అప్రోచ్‌ అయ్యారు దర్శకనిర్మాతలు. సాయిపల్లవి తల్లికి కూడా ఆ ఆఫర్‌ నచ్చింది. అయితే సెలవుల్లో మాత్రమే సినిమా చేయగలనని ఆ సినిమా దర్శకనిర్మాతలకు చెప్పారు. దానికి తగ్గట్టుగానే సెలవులు పూర్తయ్యేలోపు సాయిపల్లవికి సంబంధించిన సీన్స్‌ అన్నీ షూట్‌ చేసుకున్నారు డైరెక్టర్‌. ‘ప్రేమమ్‌’ చిత్రం 2015లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమా తర్వాత మలయాళంలోనే దుల్కర్‌ సల్మాన్‌తో కలిసి ‘కలి’ చిత్రంలో నటించారు సాయిపల్లవి. 2016 విడుదలైన ఈ సినిమా కూడా సూపర్‌హిట్‌ అయింది. 

అదే సమయంలో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ‘ఫిదా’ చిత్రంలో హీరోయిన్‌గా సాయిపల్లవిని ఎంపిక చేశారు. ఆమె నటించిన తొలి తెలుగు సినిమా ఇదే. 2017లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయారు సాయిపల్లవి. ముఖ్యంగా ఈ చిత్రంలో సాయిపల్లవి డాన్స్‌కి విపరీతమైన పేరు వచ్చింది. ఆ తర్వాత తెలుగులో చేసిన ఎంసిఎ, పడిపడి లేచె మనసు, లవ్‌స్టోరీ, విరాటపర్వం, తండేల్‌ వంటి సినిమాల్లో ఆమె పెర్‌ఫార్మెన్స్‌కు ఆడియన్స్‌ ఫిదా అయిపోయారు. అలాగే తమిళ్‌లో చేసిన మారి2 సాయిపల్లవికి చాలా మంచి పేరు తెచ్చింది. ఆ సినిమాలోని ‘రౌడీ బేబీ..’ పాటకు ఆమె వేసిన స్టెప్స్‌ నెక్స్‌ట్‌ లెవల్‌ అన్నట్టుగా ఉంటాయి. ఈ పాటకు కోట్లలో వ్యూస్‌ రావడం విశేషం. అలాగే తెలుగులో అనువాదమైన కణం, గార్గి, అమరన్‌ వంటి సినిమాలు నటిగా ఆమెకు మంచి పేరు తెచ్చాయి. ప్రస్తుతం హిందీలో పురాణ ఇతిహాస చిత్రం ‘రామాయణ’లో సీతగా నటిస్తున్నారు సాయిపల్లవి. 

సాయిపల్లవి వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమె సోదరి పూజ కన్నన్‌ కూడా ‘కారా’ అనే షార్ట్‌ ఫిలిం ద్వారా నటిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత స్టంట్‌ సిల్వ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘చితిరై సెవ్వానం’ ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేశారు. ఆమె నటించిన ఏకైక సినిమా ఇది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. సాయిపల్లవి విషయానికి వస్తే.. తనకు నచ్చిన కథలు వచ్చినప్పుడే సినిమాలు చేస్తానంటోంది. సౌత్‌లో ఇప్పటివరకు నటిగా తనపై ఉన్న ఇంప్రెషన్‌ని కాపాడుకునేందుకు తన వంతు కృషి చేస్తోంది. సినిమాల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులేస్తోంది. తనకు నచ్చిన కథ వచ్చినపుడే సినిమా చేస్తానని చెబుతోంది. ప్రస్తుతం తనకు వచ్చిన స్టార్‌డమ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నానని, అవకాశం ఉన్నంత వరకు సినిమాల్లో నటిస్తానంటోంది. ఆ తర్వాత డాక్టర్‌గా ప్రాక్టీస్‌ ప్రారంభించి గైనకాలజిస్ట్‌గా స్థిరపడాలని తన కోరిక అని చెబుతోంది సాయిపల్లవి.