English | Telugu
తన ఓవర్ యాక్షన్‌తో నవ్వులు పంచే సంపూ జీవితంలోని చీకటి కోణాలు మీకు తెలుసా?
Updated : May 8, 2025
(మే 9 సంపూర్ణేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా..)
‘ధైర్యానికి భయమేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది’, ‘నేను కత్తి పట్టి నరకడం మొదలుపెడితే.. ముక్కలేరుకోడానికి ప్రొక్లైనర్లు రావాలి, రక్తం పారడానికి డ్రైనేజీలు తవ్వాలి’.. సాధారణంగా యాక్షన్ హీరోలు కూడా ఇలాంటి డైలాగులు చెప్పరు. కానీ, బర్నింగ్ స్టార్ చెబుతాడు.. అతనే సంపూ అలియాస్ సంపూర్ణేశ్‌బాబు. అతను చేసే సినిమాలన్నీ వెరైటీయే. టైటిల్ నుంచి సినిమాలోని సీన్స్‌గానీ, డైలాగ్స్‌గానీ అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. ఒకే ఒక్క సినిమాతో బర్నింగ్ స్టార్‌గా ఎదిగిన సంపూర్ణేశ్‌బాబు సినీ జీవితం ఎలా మొదలైంది, అతని వ్యక్తిగత జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు అనే విషయాలు తెలుసుకుందాం.
1972 మే 9న సిద్ధిపేట జిల్లా మెట్టపల్లిలో పేద విశ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు సంపూర్ణేశ్‌బాబు. ఆయన అసలు పేరు నరసింహాచారి. బంగారు, వెండి నగల తయారీ వీరి వృత్తి. అయితే చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో ఈ కుటుంబాన్ని పేదరికం వెంటాడింది. ఆ సమయంలోనే సంపు అన్నయ్య బంగారం పని నేర్చుకొని సిద్ధిపేటలో షాప్ పెట్టాడు. పదో తరగతి పూర్తి చేసిన తర్వాత సంపుకి కూడా పని నేర్పించి అతనితో కూడా ఒక షాప్ పెట్టించాడు. ఇది ఒక సైడ్ అయితే.. మరో సైడ్ అతనిలో ఒక కళాకారుడు ఉన్నాడు. చిన్నతనం నుంచి నాటకాలు వేయడం, సినిమాలు చూసి అందులోని నటుల్ని అనుకరించడం, డైలాగులు చెప్పడం వంటివి చేసేవాడు. సినిమాల్లో నటించాలన్నది అతని కోరిక. దాని కోసం సిల్వర్ సురేష్ అనే వ్యక్తి దగ్గర నటన నేర్చుకున్నాడు. సినిమాల్లో అవకాశాలు సంపాదించాలంటే హైదరాబాద్ వెళ్లాలి అని తెలుసుకున్న సంపు అక్కడికి వెళ్ళి అన్ని సినిమా ఆఫీసుల్లో తన ఫోటోలు ఇచ్చాడు.
అతనికి తొలి అవకాశం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ‘మహాత్మ’ చిత్రంలో వచ్చింది. అది కూడా చిన్న వేషం. అప్పుడప్పుడు చిన్న చిన్న వేషాలు వేస్తున్న సంపుకి సాయిరాజేష్ పరిచయమయ్యాడు. తను చేస్తున్న ‘హృదయ కాలేయం’ చిత్రంలో హీరోగా అవకాశం ఇస్తానని చెప్పాడు. అలా హీరోగా మొదటి సినిమా చేశాడు. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ట్రైలర్ చూసి చాలా బాగుంది అంటూ రాజమౌళి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఆ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించి చాలా పెద్ద హిట్ చేశారు. ఈ సినిమాలోని సంపూ డైలాగులు, ఓవర్ యాక్షన్ చూసి అందరూ బాగా నవ్వుకున్నారు. అలా ఒక్క సినిమాతోనే స్టార్ట్ స్టేటస్ సంపాదించుకొని బర్నింగ్ స్టార్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంట్ తీగ’ చిత్రంలో సన్నీ లియోన్‌కి భర్తగా నటించి మరింత పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పెసరట్టు, బందిపోటు, జ్యోతిలక్ష్మి, రాజా ది గ్రేట్, దేవదాస్, కథనం వంటి సినిమాల్లోనూ అతిథి పాత్రలు పోషించాడు. అలాగే వేర్ ఈజ్ విద్యాబాలన్, లచ్చిందేవికి ఓ లెక్కుంది, భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. హీరో సూర్య చేసిన సింగం సిరీస్‌కి సెటైర్‌గా మంచు విష్ణు నిర్మించిన ‘సింగం 123’ చిత్రంలో మరోసారి రెచ్చిపోయాడు సంపూ. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయి కాసుల వర్షం కురిపించింది. విశేషం ఏమిటంటే.. మంచు విష్ణు చేసిన ఏ సినిమాకీ అంతటి కలెక్షన్స్ రాలేదట. ఆ తర్వాత ‘కొబ్బరిమట్ట’లో త్రిపాత్రాభినయం చేసి అందర్నీ మెప్పించాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
సినిమా రంగంలో నటుడిగా మంచి పేరు తెచ్చుకొని ఒక స్థాయిలో ఉన్నప్పటికీ తన ఊరుని, తన గత జీవితాన్ని ఎప్పటికీ మర్చిపోడు సంపూ. ఎవరైనా ఆపదలో ఉంటే వారికి సహాయం చేయడం అన్నది అతనికి చిన్నతనం నుంచి ఉన్న అలవాటు. ఇప్పటికీ సాధారణ జీవితాన్ని గడిపేందుకే సంపూ ఇష్టపడతాడు. అంతకుముందు ఊరిలో ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తాడు. షూటింగ్‌లకు కూడా బస్సులో హైదరాబాద్ వస్తుంటాడు. 2009లో ప్రారంభమైన సంపూ సినీ కెరీర్‌లో కొన్ని సినిమాల్లో హీరోగా నటిస్తే, మరికొన్ని సినిమాల్లో అతిథి పాత్రలు, కీలక పాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన ‘సోదరా’ చిత్రంతో సంపూ మరోసారి సందడి చేశాడు.
