Read more!

English | Telugu

ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ మధ్య దూరం పెరగడానికి గుమ్మడి ఒక కారణమని మీకు తెలుసా?

 

తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు రెండు కళ్ళు అంటూ ఉంటారు. అన్నదమ్ముల్లా ఎంతో అన్యోన్యంగా ఉండే వారిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఒకరినొకరు విమర్శించుకునే పరిస్థితి వచ్చింది. అలా ఎందుకు జరిగిందంటే.. చిత్ర పరిశ్రమ మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌ తరలి రావాలని అక్కినేని నాగేశ్వరరావు.. లేదు. పరిశ్రమ మద్రాస్‌లోనే ఉండాలి.. సినిమా పరిశ్రమ కోసమే ఎంతో డబ్బు వెచ్చించి స్టూడియోలు కట్టారు. పరిశ్రమ హైదరాబాద్‌ వెళ్లిపోతే అక్కడి వాళ్ళు ఇబ్బంది పడతారని ఎన్టీఆర్‌ అనేవారు. ఎలాగైతే ఎఎన్నార్‌ హైదరాద్‌ వచ్చేశారు. పరిశ్రమను హైదరాబాద్‌కి తెచ్చేందుకు అప్పటి ముఖ్యమంత్రికి వినతి పత్రం కూడా ఇచ్చారు. ఇది తెలిసిన ఎన్టీఆర్‌ ఆగ్రహించారు. తనని సంప్రదించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. వరదబాధితుల కోసం ఎన్టీఆర్‌ జోలె పట్టారు. ఆ సమయంలో తనకు చెప్పారా అని ఎఎన్నార్‌ ఎదురు ప్రశ్నించారు. అయితే ఈ వాగ్వాదం ప్రత్యక్షంగా జరిగేది కాదు. ఇద్దరికీ ఆప్తుడైన గుమ్మడి వెంకటేశ్వరరావు ఇద్దరి మధ్యా వారధిగా ఉండేవారు. అక్కడి మాటలు ఇక్కడికి, ఇక్కడి మాటలు అక్కడికి మోసేవారు. అలా వారి మధ్య దూరం మరింత పెరిగింది. దానికి గుమ్మడి కూడా ఒక కారణం అని భావించిన ఎన్టీఆర్‌.. ఆయన్ని దూరం పెట్టారు. ఓ నాలుగైదు సంవత్సరాలు అతనితో మాట్లాడలేదు. గుమ్మడి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తప్పనిసరిగా హాజరయ్యే ఎన్టీఆర్‌.. వారి అమ్మాయి పెళ్ళికి కూడా హాజరు కాలేదు. 

గుమ్మడిని అలా దూరం పెట్టడానికి అదొక్కటే కారణం కాదు. గతంలో కూడా ఎన్టీఆర్‌, గుమ్మడి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఎన్టీఆర్‌ ఇండస్ట్రీకి వచ్చి కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత సొంత బేనర్‌ పెట్టి ‘పిచ్చిపుల్లయ్య’, ‘తోడు దొంగలు’ వంటి సినిమాలను నిర్మించారు. ఆ సినిమాలకు మంచి పేరే వచ్చినా కమర్షియల్‌గా సక్సెస్‌ అవ్వలేదు. ఆ తర్వాత 1965లో గంగాధరరావు అనే నిర్మాత ‘కీలుబొమ్మలు’ అనే ఆఫ్‌ బీట్‌ సినిమా తీశారు. దానికి చాలా మంచి పేరు రావడమే కాకుండా ఉత్తమ చిత్రం కేటగిరిలో కాంస్య నంది అవార్డును పొందింది. అంతేకాదు, ఐర్లండ్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ఆ సినిమాను ప్రదర్శించారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎన్టీఆర్‌ కూడా పాల్గొన్నారు. అప్పుడు గుమ్మడి మాట్లాడుతూ గంగాధరరావుగారిని ఆదర్శంగా తీసుకొని మన నిర్మాతలు సినిమాలు తియ్యాలి అన్నారు. ముఖ్యంగా ఎన్‌.టి.రామారావుగారులాంటి వారు అని ప్రత్యేకంగా చెప్పడంతో ఆయనకు కోపం వచ్చింది. స్టేజ్‌ మీదే గుమ్మడికి కౌంటర్‌ ఇచ్చారు ఎన్టీఆర్‌. ఇప్పటికే రెండు సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నాం. మేం ఇంకా నష్టపోవాలని గుమ్మడి కోరుకుంటున్నట్టున్నారు. మీ దగ్గర డబ్బు ఉంటే అలాంటి సినిమాలు తియ్యండి అని సలహా ఇచ్చారు. దానికి ఏదో వివరణ ఇచ్చేందుకు గుమ్మడి ప్రయత్నించినా ఎన్టీఆర్‌ వినిపించుకోలేదు. 

ఇది జరిగిన చాలాకాలానికి చిత్ర పరిశ్రమను తరలించే విషయంలో ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ మధ్యలో గుమ్మడి ఇరుక్కున్నారు. ఒకసారి అనుకోకుండా ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ కలుసుకున్నారు. మంచి, చెడ్డ మాట్లాడుకున్నారు. ఆ క్రమంలో తమ ఇద్దరి మధ్య అగాధం పెరగడానికి కారణం గుమ్మడేనని తెలుసుకున్నారు. ఇద్దరూ శాంతించారు. ఆ తర్వాత గుమ్మడిపై కోపం తగ్గడంతో తను చేస్తున్న సినిమాలో అతిథి పాత్ర చేసేందుకు గుమ్మడిని పిలిచారు. ఆయన ఎంతో సంతోషంగా వెళ్లి ఆ సినిమాలో ఇచ్చిన వేషం వేశారు. అయితే సినీ పరిశ్రమ మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌ రాకుండా ఉండేందుకు ఎన్టీఆర్‌ ఎంతో ప్రయత్నించారు. కానీ, ఈ విషయంలో ఎఎన్నార్‌దే పైచేయిగా నిలిచింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ హైదరాబాద్‌లోనే స్టూడియో నిర్మించాల్సి వచ్చింది, ఇక్కడే షూటింగ్స్‌ చెయ్యాల్సి వచ్చింది. కొన్ని సంవత్సరాలకు ఎన్టీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌కు మధ్యవర్తిగా ఉండడం వల్ల గుమ్మడి ఎంతో ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత వారితో మాటలు కూడా పడాల్సి వచ్చింది.