Read more!

English | Telugu

హీరోయిన్‌గా జీవితను వద్దన్న రాజశేఖర్‌.. అప్పుడు ఆ దర్శకనిర్మాతలు ఏం చేశారో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఎవరూ ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. అది హీరోల విషయంలోనే జరిగితే మరింత ఆశ్చర్యంగా ఉంటుంది. అలాంటి ఓ ఘటన డా.రాజశేఖర్‌ విషయంలో జరిగింది. రాజశేఖర్‌ తమిళ నటుడు అయినప్పటికీ తెలుగు సినిమాలే ఆయనకు ఎక్కువ పేరు తెచ్చాయి. తమిళ్‌లో సినిమాలు చేస్తున్న సమయంలో ఒక సినిమాలో హీరోయిన్‌గా జీవితను ఎంపిక చేశారు. అప్పటికి వీరిద్దరూ కలిసి నటించలేదు. జీవిత డీగ్లామర్‌గా ఉండడంతో తన పక్కన హీరోయిన్‌గా సరిపోదని భావించిన రాజశేఖర్‌.. ఈ సినిమాలో హీరోయిన్‌ బబ్లీగా ఉంటే బాగుంటుందని, జీవిత దానికి విరుద్ధంగా ఉందని దర్శకనిర్మాతలతో వాదించాడట. వెంటనే హీరోయిన్‌ని మార్చమని చెప్పాడు రాజశేఖర్‌. అతను చెప్పినదంతా విన్న తర్వాత అలాగేనని చెప్పారు దర్శకనిర్మాతలు.

మరో నాలుగు రోజుల్లో  ఆ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అవ్వాల్సి ఉంది. కానీ, చిత్ర యూనిట్‌ నుంచి ఎలాంటి కబురు లేదు. దీంతో ఆ సినిమా ఆఫీస్‌కి ఫోన్‌ చేశారు రాజశేఖర్‌. కానీ, ఎవ్వరూ లిఫ్ట్‌ చెయ్యలేదు. ఆ తర్వాత పదిరోజులకు ఆ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయింది. అయితే అందులో హీరో రాజశేఖర్‌ కాదు. వేరే హీరోతో ఆ సినిమా మొదలుపెట్టేశారు. హీరోయిన్‌ని మార్చమని అడిగినందుకు హీరోనే మార్చేశారు ఆ దర్శకనిర్మాతలు. ఆ తర్వాత రాజశేఖర్‌, జీవిత తెలుగు ఇండస్ట్రీకి రావడం, ఇద్దరూ కలిసి సూపర్‌హిట్‌ సినిమాలు చేసి హిట్‌ పెయిర్‌ అనిపించుకోవడం అందరికీ తెలిసిందే. ఇద్దరూ కలిసి నటిస్తున్న క్రమంలోనే ప్రేమలో పడి పెళ్ళి చేసుకొని అన్యోన్యమైన జంటగా పేరు తెచ్చుకున్నారు రాజశేఖర్‌, జీవిత.