Read more!

English | Telugu

ఇండస్ట్రీ చేరదీసింది.. అవకాశాలిచ్చింది.. చెడు వ్యసనాలు అతన్ని వెనక్కి లాగేశాయి! 

సినిమా రంగంలో నటులుగా రాణించడం, మంచి పేరు తెచ్చుకోవడం ఒక ఎత్తయితే, వచ్చిన ఆ మంచిపేరును నిలబెట్టుకోవడం మరో ఎత్తు. రంగుల ప్రపంచంగా కనిపించే సినిమా రంగంలో ఎంతో మంది నటీనటులు తమ భవిష్యత్తును నాశనం చేసుకొని చివరి రోజుల్లో దీనావస్థకు చేరుకున్నారు. అలాంటి వారిలో హీరో వారణాసి రామ్మోహన్‌రావు ఒకరు. అందరూ అతన్ని రామ్మోహన్‌ అని పిలిచేవారు. బాలీవుడ్‌ నటుడు దేవానంద్‌ పోలికలు రామ్మోహన్‌లో ఉండడంతో అతన్ని ఆంధ్రా దేవానంద్‌ అనేవారు. ‘తేనెమనసులు’ చిత్రంతో హీరోగా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ సినిమాతోనే సూపర్‌స్టార్‌ కృష్ణ కూడా ఎంట్రీ ఇచ్చారన్న విషయం తెలిసిందే. 

పాతతరం దర్శకనిర్మాతలు కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలంటే ఎంతో ఆలోచించేవారు. కొందరైతే అలాంటి సాహసానికి పూనుకునేవారు కాదు. అలాంటిది తను దర్శకత్వం వహించిన ‘తేనెమనసులు’ సినిమా ద్వారా 12 మంది ప్రధాన తారాగణాన్ని, 12 మంది సహనటీనటుల్ని పరిచయం చేశారు ఆదుర్తి సుబ్బారావు. వారిలో కృష్ణ, రామ్మోహన్‌ ఉన్నారు. నంద్యాలకు చెందిన రామ్మోహన్‌కి సినిమాల్లో నటించాలన్న ఆసక్తి అస్సలు లేదు. చిన్నతనంలో స్కూల్‌లో వేసిన ఒక నాటకంలో అతను లేడీ గెటప్‌లో నటించాడు. అది తప్ప అతనికి నటనలో అనుభవం లేదు. తన తండ్రి మరణంతో కుటుంబ భారాన్ని తనపై వేసుకొని బెంగుళూరులోని హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌లో టెక్నీషియన్‌గా జాబ్‌లో చేరారు. ఆ సమయంలోనే ‘తేనెమనసులు’ చిత్రం కోసం కొత్త నటీనటులు కావాలనే ప్రకటన వచ్చింది. ఆ సినిమా యూనిట్‌లో రామ్మోహన్‌కు పరిచయం ఉన్నవారు ఉన్నారు. వారు బలవంతంగా రామ్మోహన్‌ని ఈ సినిమా కోసం ఫోటోలు పంపించమన్నారు. ఆ తర్వాత స్క్రీన్‌ టెస్ట్‌ కోసం మద్రాస్‌ పిలిపించారు. తాను సెలెక్ట్‌ అవుతానని నమ్మకం లేకపోయినా స్నేహితుల బలవంతం మీద స్క్రీన్‌ టెస్ట్‌లో పాల్గొన్నాడు. ఆ తర్వాత తిరిగి బెంగుళూరు వెళ్లిపోయాడు. తను సెలెక్ట్‌ అయినట్టు మద్రాస్‌ నుంచి కబురు వచ్చింది. ఏదో ఒక చిన్న క్యారెక్టర్‌ కోసం తనను పిలిచి ఉంటారులే అనుకొని మద్రాస్‌ వచ్చాడు రామ్మోహన్‌. అక్కడికి వచ్చాక తను, కృష్ణ హీరోలుగా సెలెక్ట్‌ అయ్యామని తెలిసి ఆశ్చర్యపోయాడు. తన ఉద్యోగానికి సెలవు పెట్టి సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. గత అనుభవం లేకపోవడంతో డైలాగులు ఎలా పలకాలి, ఎలా నటించాలి వంటి విషయాల్లో కో డైరెక్టర్‌ కె.విశ్వనాథ్‌ అతనికి శిక్షణ ఇచ్చారు. 

సినిమా పూర్తయి విడుదలైంది. రామ్మోహన్‌కి మంచి పేరు వచ్చింది. కృష్ణ కంటే రామ్మోహన్‌కే ఎక్కువ మార్కులు పడ్డాయి. కృష్ణ అసలు హీరోగా పనికిరాడని అంతా అనుకున్నారు. వీరిద్దరితోనూ ఆదుర్తి సుబ్బారావు రెండో సినిమా ‘కన్నె మనసులు’ తీశారు. రామ్మోహన్‌ నటించిన మూడో చిత్రం ‘రంగుల రాట్నం’. ఈ చిత్రంలో అతనికి నెగెటివ్‌ రోల్‌ ఇచ్చారు దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి. చంద్రమోహన్‌ ఈ సినిమాతోనే హీరోగా పరిచయమయ్యాడు. రామ్మోహన్‌, చంద్రమోహన్‌ ఒకే రూమ్‌లో ఉండేవారు. అప్పటికే కృష్ణ, రామ్మోహన్‌ మంచి స్నేహితులు. అందుకే రామ్మోహన్‌ని కలిసేందుకు రూమ్‌కి వచ్చేవారు కృష్ణ. అలా ముగ్గురూ స్నేహితులయ్యారు. ఎక్కడికి వెళ్లాలన్నా ముగ్గురూ కలిసే  వెళ్ళేవారు. 

ఆ తర్వాత ‘ప్రైవేట్‌ మాస్టారు’, ‘లక్ష్మీ నివాసం’, ‘ఉపాయంలో అపాయం’, ‘అన్నదమ్ములు’ వంటి సినిమాల్లో నటించారు రామ్మోహన్‌. ఇక్కడ ఓ విశేషం ఉంది. అదేమిటంటే.. ఈ సినిమాలన్నింటిలో కృష్ణ మరో హీరోగా నటించడం. ఆ తర్వాత ‘రతీమన్మథ’ చిత్రంలో రామ్మోహన్‌ నారదుడి పాత్ర పోషించారు. అది పౌరాణిక చిత్రం కావడంతో డైలాగులు చెప్పేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు రామ్మోహన్‌. అది గమనించిన ఎస్‌.వి.రంగారావు అతనికి డైలాగులు ఎలా చెప్పాలో నేర్పించారు. నటనలో ఎలాంటి అనుభవం లేకపోయినా పెద్దల సూచనలు, సలహాలతో హీరోగా ముందుకు సాగారు రామ్మోహన్‌. ఆ సమయంలోనే అతని జీవితం మలుపు తిరిగింది. వ్యసనాలకు బానిసయ్యాడు. అది అతని కెరీర్‌పై ప్రభావం చూపింది. తన సహచరుడైన కృష్ణ సినిమాల్లో దూసుకుపోతుంటే రామ్మోహన్‌ మాత్రం ముందుకు వెళ్లలేకపోయాడు. శోభన్‌బాబు, హరనాథ్‌ వంటి హీరోల ధాటికి తట్టుకోలేకపోవడం, తన కెరీర్‌పై దృష్టి పెట్టకపోవడం వంటి అంశాలు రామ్మోహన్‌ వెనకబడిపోవడానికి కారణాలయ్యాయి. అతనికి సినిమాలు తగ్గిపోయినపుడు తను నిర్మించే  సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చారు కృష్ణ. అంతేకాదు, ఆర్థికంగా కూడా రామ్మోహన్‌ను ఎన్నోసార్లు ఆదుకున్నారు. అలా 18 సంవత్సరాలు చెన్నయ్‌లోనే ఉన్నారు రామ్మోహన్‌. దాదాపు 40 సినిమాల్లో నటించిన ఆయన 1982లో తన స్నేహితులతో కలిసి ఒక సినిమా నిర్మించి మళ్ళీ నటుడిగా కొనసాగాలని అనుకున్నారు. కానీ, ఆ ప్రాజెక్ట్‌ ముందుకు వెళ్ళలేదు. నటనలో ఓనమాలు రాని తనను ఇండస్ట్రీ చేరదీసిందని, అవకాశాలు ఇచ్చిందని, తనే తప్పటడుగు వేశానని అనేక సందర్భాల్లో రామ్మోహన్‌ చెప్పారు. 1979లో వచ్చిన ‘కోరికలే గుర్రాలైతే’ అతని చివరి సినిమా. ఒంటరి తనం, అనారోగ్యం కారణంగా 2005లో రామ్మోహన్‌ కన్ను మూశారు.