English | Telugu

‘చరిత్ర సృష్టించాలన్నా మేమే.. రికార్డులు సాధించాలన్నా మేమే..’

‘చరిత్ర సృష్టించాలన్నా మేమే.. రికార్డులు సాధించాలన్నా మేమే..’

‘చరిత్ర సృష్టించాలన్నా మేమే.. రికార్డులు సాధించాలన్నా మేమే..’ అంటూ ఎంతో ఆవేశపూరితంగా నటసింహ నందమూరి బాలకృష్ణ మాట్లాడడం మనం చూశాం. అయితే ఆయన మాటలు అక్షరాలా నిజం అనేది నటరత్న ఎన్‌.టి.రామారావు కెరీర్‌ చూసినా, ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ కెరీర్‌ చూసినా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరికీ సాధ్యం కాని ఎన్నో పాత్రలు పోషించడంలో నందమూరి తారక రామారావు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘిక చిత్రాల్లో ఎన్టీఆర్‌ చేసిన వైవిధ్యమైన పాత్రలు ఇప్పటికీ తెలుగు వారి కళ్ళముందు కదలాడుతూ ఉంటాయి. పురాణ పురుషులైన రాముడు, కృష్ణుడు మనకు ఎన్టీఆర్‌లోనే కనిపిస్తారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎంతో మంది ఇళ్ళల్లో రాముడుగా, కృష్ణుడిగా ఎన్టీఆర్‌ ఫోటోలే కనిపిస్తాయి. తెలుగు ప్రజలపై అంతటి ముద్ర వేసిన ఎన్టీఆర్‌ తెలుగు చిత్రసీమలో తిరుగులేని కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాగే ఆయన నటవారసుడిగా నందమూరి బాలకృష్ణ కూడా మరో హీరోకి సాధ్యం కాని ఎన్నో పాత్రలు పోషించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఈతరం హీరోల్లో పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లో నటించగల సత్తా తనకే ఉందని నందమూరి బాలకృష్ణ నిరూపించుకున్నారు. సాధారణంగా పాతతరం హీరోలు సంవత్సరానికి నాలుగైదు సినిమాల్లో నటిస్తూ ఉండేవారు. కొందరు హీరోలు కొన్ని సినిమాలు చేయకూడదు అనే నిబంధన పెట్టుకునేవారు. కానీ, ఎన్టీఆర్‌ ఈ విషయంలో పూర్తి భిన్నంగా ఆలోచించేవారు. మనం ఏ సినిమా అయినా చెయ్యాలి, ఎలాంటి క్యారెక్టర్‌లోనైనా ఒదిగిపోవాలి, ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలి. ఇదే ఆలోచనతో తన దగ్గరకు వచ్చిన నిర్మాతల్ని నిరాశపరచకుండా అన్ని సినిమాలూ చేసేవారు. అలా సంవత్సరానికి లెక్కకు మించిన సినిమాలు చేశారు. 

1964లో ఏకంగా 16 సినిమాల్లో హీరోగా నటించి రికార్డు సృష్టించారు ఎన్టీఆర్‌. అంతేకాదు, 1965లో ఎన్టీఆర్‌ నటించిన 8 సినిమాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. ఈ రికార్డును ఇంతవరకు ఎవరూ అధిగమించలేకపోయారు. అలాగే 64 సంవత్సరాల క్రితం మరో రికార్డును కూడా క్రియేట్‌ చేశారు నటరత్న ఎన్టీఆర్‌. ఆయన కథానాయకుడిగా నటించిన రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్‌ అయి శతదినోత్సవ చిత్రాలుగా నిలిచాయి. 1961 మే 5న ఎన్టీఆర్‌, అంజలీదేవి జంటగా ఎస్‌.రజినీకాంత్‌ దర్శకత్వంలో శ్రీకాంత్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ‘సతీ సులోచన(ఇంద్రజిత్‌)’, ఎన్టీఆర్‌, దేవిక జంటగా ఎ.వి.శేషగిరిరావు రూపొందించిన ‘పెండ్లి పిలుపు’ చిత్రాలు విడుదలయ్యాయి. ‘సతీ సులోచన’ ఆరు కేంద్రాల్లో వందరోజులు ప్రదర్శించగా, ‘పెండ్లి పిలుపు’ చిత్రం రెండు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఈ రెండు సినిమాలూ విజయవాడ, రాజమండ్రి కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. ఇలాంటి అరుదైన రికార్డును భారతీయ సినిమాల్లో సాధించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కింది.

నటరత్న ఎన్‌.టి.రామారావు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నందమూరి బాలకృష్ణకు కూడా ఇలాంటి అరుదైన రికార్డు ఉండడం మరో విశేషంగా చెప్పొచ్చు. బాలకృష్ణ హీరోగా, రమ్యకృష్ణ, రవీనా టాండన్‌ హీరోయిన్లుగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వి.బి.రాజేంద్రప్రసాద్‌ నిర్మించిన ‘బంగారు బుల్లోడు’, బాలకృష్ణ, విజయశాంతి జంటగా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.శ్రీనివాసప్రసాద్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘నిప్పురవ్వ’ చిత్రాలు 1993 సెప్టెంబర్‌ 3న విడుదలై ఘనవిజయం సాధించాయి. ఎన్టీఆర్‌ తర్వాత వచ్చిన హీరోల్లో ఇలా ఒకేరోజు వారు నటించిన రెండు సినిమాలు రిలీజ్‌ అవ్వడం అనేది జరగలేదు. ఆ ఘనత బాలకృష్ణకు దక్కింది. తండ్రి తరహాలోనే బాలకృష్ణ నటించిన రెండు సినిమాలు విడుదలై శతదినోత్సవ చిత్రాలు నిలవడం ఒక రికార్డుగా చెప్పుకోవాలి. ‘సతీ సులోచన’, ‘పెండ్లి పిలుపు’ చిత్రాల మాదిరిగానే.. ‘బంగారు బుల్లోడు’, ‘నిప్పురవ్వ’ చిత్రాలు కూడా విజయవాడ, రాజమండ్రిలలో శతదినోత్సవం జరుపుకోవడం కూడా ఎన్టీఆర్‌ నుంచి వారసత్వంగా రావడం నందమూరి బాలకృష్ణకు లభించిన గొప్ప వరంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి రికార్డును సృష్టించిన ఘనత నందమూరి వంశానికి మాత్రమే దక్కడం మరో విశేషం. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్‌ నటించిన రెండు సినిమాలు విడుదలైన మే 5కి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే.. నటరత్న ఎన్టీఆర్‌ మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌ వివాహం 2011 మే 5న జరిగింది. ఇలా మే 5 అనే తేదీ తాతమనవళ్లకు ప్రత్యేకమైన రోజు కావడం నందమూరి అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించే అంశం.