English | Telugu

‘అల్లు అంటే హాస్యపు జల్లు’.. 50 ఏళ్లు ఆ జల్లులో సేద తీరిన తెలుగు ప్రేక్షకులు!

(జూలై 31 అల్లు రామలింగయ్య వర్థంతి సందర్భంగా..)

ఎంతో మంది హాస్యనటులు ఉన్నా.. అల్లు రామలింగయ్య హాస్యానికి ఉన్న ప్రత్యేకత వేరు. తన కెరీర్‌లో చేసిన వందల సినిమాల్లోని హాస్య పాత్రలన్నీ ఎంతో విభిన్నంగా, విలక్షణంగా ఉంటాయి. ఎవరినీ అనుకరించకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నారు అల్లు. ఆయన బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ డెలివరీ.. ఇలా అన్నీ ఆయన ప్రత్యేకతలే. అందుకే ‘అల్లు అంటే హాస్యపు జల్లు’.. అంటూ తెలుగు ప్రేక్షకులు ఎంతో అభిమానంగా ప్రశంసించేవారు. నిజ జీవితంలో ఆయన్ని పరిశీలిస్తే.. సినిమాల్లో హాస్యాన్ని అంత బాగా పండిస్తున్న అల్లు రామలింగయ్య ఇతనేనా అనుకుంటారు. ఎందుకంటే సినిమాల్లో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించే ఆయన నిజజీవితంలో ఎంతో హుందాగా ఉండేవారు. ఎక్కువగా మాట్లాడేవారు కాదు. 1950లో ‘పుట్టిల్లు’ చిత్రంతో నటుడిగా చిత్రరంగ ప్రవేశం చేసిన అల్లు రామలింగయ్య చివరి చిత్రం 2003లో వచ్చిన ‘కళ్యాణరాముడు’. 53 ఏళ్ళ కెరీర్‌లో 1000కి పైగా సినిమాల్లో నటించిన అల్లు రామలింగయ్య సినీ, జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం.

1922 అక్టోబర్‌ 1న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు అల్లు రామలింగయ్య. వీరి తాత అల్లు సుబ్బారాయుడు హయాంలో చాలా ఆస్తులు ఉండేవి. అతని దానగుణం వల్ల ఆస్తులు కరిగిపోయాయి. తర్వాత ఆయన కుమారుడు అల్లు వెంకయ్య వ్యవసాయం చేసి ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. వెంకయ్య, సత్తెమ్మ దంపతులకు ఏడుగురు సంతానం. వారిలో అల్లు రామలింగయ్యకు చదువుకంటే ఇతర వ్యాపకాలు ఎక్కువ. వ్యవసాయమైనా చెయ్యమని తండ్రి చెబితే.. అది కూడా చేసేవారు కాదు. ఎప్పుడూ ఆకతాయిగా తిరుగుతూ, అందర్నీ అనుకరిస్తూ నవ్విస్తుండేవారు. అలా నాటకాల్లో నటించాలనే కోరిక పుట్టింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత ‘భక్త ప్రహ్లాద’ నాటకంలో బృహస్పతి వేషం లభించింది. మూడు రూపాయలు ఆ నాటక కాంట్రాక్టరుకు ఎదురిచ్చేలా మాట్లాడుకొని ఆ పాత్రను దక్కించుకున్నారు. ఆ తర్వాత తన ఇంట్లోనే బియ్యాన్ని దొంగిలించి, వాటిని అమ్మి ఆ కాంట్రాక్టరు అప్పు తీర్చారు. ఆ నాటకం తర్వాత ప్రజా నాట్యమండలిలో చేరి ఎన్నో నాటకాల్లో వివిధ పాత్రలు పోషించారు. నాటకాల్లో నటిస్తున్న సమయంలోనే మహాత్మాగాంధీ పిలుపు మేరకు క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్ళారు. ఆరోజుల్లోనే హోమియో వైద్యం నేర్చుకొని వీలు చిక్కినప్పుడల్లా ప్రజలకు ఉచితంగా వైద్యం చేసేవారు.

1952లో గరికపాటి రాజారావు నిర్మించిన ‘పుట్టిల్లు’ అల్లు రామలింగయ్య తొలిచిత్రం. ఈ సినిమా ఆర్థికంగా విజయం సాధించకపోయినా.. అల్లు రామలింగయ్యకి అనేక అవకాశాలు తెచ్చిపెట్టింది. మరీ ముఖ్యంగా.. అప్పటి అగ్ర తారలు ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌లతో కలిసి ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించారు అల్లు. ‘పరివర్తన’, ‘చక్రపాణి’, ‘వద్దంటే డబ్బు’, ‘దొంగ రాముడు’, ‘సంతానం’, ‘మిస్సమ్మ’, ‘మాయాబజార్‌’, ‘భాగ్యరేఖ’, ‘తోడికోడళ్ళు’, ‘పెళ్ళినాటి ప్రమాణాలు’, ‘ఆడపెత్తనం’, ‘అప్పు చేసి పప్పు కూడు’, ‘మంచి మనసుకు మంచి రోజులు’, ‘ఇల్లరికం’.. ఇలా 1950వ దశకంలో లెక్కకు మించిన సినిమాలు చేసిన అల్లు ఆ తర్వాతి కాలంలో కామెడీ పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయారు. కేవలం హాస్య పాత్రలతోనే సరిపెట్టుకోకుండా సెంటిమెంట్‌ క్యారెక్టర్లు, విలన్‌ పాత్రలు, కామెడీ విలన్‌ పాత్రలతో అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించారు అల్లు రామలింగయ్య. ముఖ్యంగా రావుగోపాలరావు కాంబినేషన్‌లో చేసిన సినిమాలన్నీ సూపర్‌హిట్‌ అవ్వడమే కాకుండా కమెడియన్‌గా అల్లుకి మంచి పేరు తెచ్చాయి.

నటుడిగానే కాదు, నిర్మాతగా కూడా తన అభిరుచి ఏమిటో చాటి చెప్పారు. గీతా ఆర్ట్స్‌ బేనర్‌ను స్థాపించి కుమారుడు అల్లు అరవింద్‌ను నిర్మాతగా ప్రోత్సహించారు. గీతా ఆర్ట్స్‌లో వచ్చే ప్రతి సినిమాకీ సమర్పకుడిగా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు అల్లు రామలింగయ్య. ఆ తర్వాత కుమారుడు అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్‌లో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలను నిర్మించి స్టార్‌ ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. మెగాస్టార్‌ చిరంజీవిని అల్లుడుగా చేసుకోవడం, మనవడు అల్లు అర్జున్‌ హీరోగా మంచి పేరు తెచ్చుకోవడం తనకు సంతృప్తినిచ్చిన అంశాలని అల్లు రామలింగయ్య చెప్పేవారు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరో అనిపించుకున్న అల్లు అర్జున్‌ ఏ రేంజ్‌లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

50 ఏళ్ళ సినిమా కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన అల్లు రామలింగయ్య సినిమా రంగానికి చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1990లో పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. 1998లో ఫిలింఫేర్‌ లైఫ్‌ టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌ అవార్డు, 2001లో రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. 2013లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలైన 50 తపాలా బిళ్ళల్లో ఒకటి అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం విడుదల చేశారు. కొన్ని దశాబ్దాలపాటు ప్రేక్షకులపై హాస్యపు జల్లు కురిపించి వారి మనసుల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు అల్లు రామలింగయ్య. అల్లు రామలింగయ్యకు 1,116 సినిమాలు చెయ్యాలనే కోరిక ఉండేది. కానీ, 1030 సినిమాలు మాత్రమే చెయ్యగలిగారు. 2004లో వచ్చిన జై చిత్రం ఆయన చివరి సినిమా. ఆ తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో 2004 జూలై 31న తుదిశ్వాస విడిచారు తెలుగు వారి హాస్యపు జల్లు అల్లు రామలింగయ్య.