English | Telugu

‘శంకరాభరణం’లో శంకరశాస్త్రి పాత్ర పోషించి జన్మ ధన్యం చేసుకున్న జె.వి.సోమయాజులు!

(జూలై 30 జె.వి.సోమయాజులు జయంతి సందర్భంగా..)

జె.వి.సోమయాజులు.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ‘శంకరాభరణం’ చిత్రంలోని శంకరశాస్త్రి. ఆ పాత్రకు జీవం పోసి శంకరశాస్త్రిగానే ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. యాక్షన్‌ సినిమాలు రాజ్యమేలుతున్న రోజుల్లో ‘శంకరాభరణం’ వంటి సంగీత, నృత్య ప్రధాన చిత్రాన్ని రూపొందించి తెలుగు సినిమా దశ, దిశ మార్చిన కళాతపస్వి కె.విశ్వనాథ్‌.. శంకరశాస్త్రి పాత్రతో ప్రేక్షకుల మనసులపై గాఢమైన ముద్ర వేశారు. కె.విశ్వనాథ్‌ ఊహల్లో ఉన్న పాత్రకు జీవం పోసి శంకరశాస్త్రి అనే సంగీత విద్వాంసుడు నిజంగా ఉంటే ఇలాగే ఉంటాడా అనేంతగా ఆ పాత్రను పోషించి అన్నివర్గాల ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు జె.వి.సోమయాజులు. 25 సంవత్సరాల కెరీర్‌లో తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 150 సినిమాల్లో నటించినప్పటికీ ఆయన్ని అందరూ శంకరశాస్త్రిగానే చూశారు, గౌరవించారు.

1928 జూలై 30న శ్రీకాకుళం జిల్లాలోని లుకలాం గ్రామంలో వెంకటశివరావు, శారదాంబ దంపతులకు జన్మించారు జొన్నలగడ్డ వెంకట సోమయాజులు. ఈయన సోదరుడు జె.వి.రమణమూర్తి ప్రముఖ సినీ నటుడు. వీరి విద్యాభ్యాసం విజయనగరంలో జరిగింది. చదువుకునే రోజుల నుంచే నాటకాల పట్ల ఎంతో మక్కువ పెంచుకున్నారు. 1946 నుంచే నాటకాలు ప్రదర్శించడం ప్రారంభించారు. సోదరుడితో కలిసి ‘కన్యాశుల్కం’ నాటకాన్ని విరివిగా ప్రదర్శించేవారు. ఈ నాటకం తొలి ప్రదర్శన 1953 ఏప్రిల్‌ 20న జరిగింది. 45 సంవత్సరాల్లో సోమయాజులు, రమణమూర్తి కలిసి ‘కన్యాశుల్కం’ నాటకాన్ని 500 సార్లు ప్రదర్శించారు. ఈ నాటకంలో రామప్ప పంతులు పాత్రకు సోమయాజులు ఎంతో ప్రసిద్ధి. 1957లో జె.వి.రమణమూర్తికి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అయితే సోమయాజులు మాత్రం నాటకాలు ప్రదర్శించడంలోనే ఎక్కువ సంతృప్తి చెందేవారు. అందుకే సినిమాల జోలికి వెళ్ళలేదు.

ఓ పక్క నాటకాలు వేస్తూనే చదువులోనూ రాణించారు సోమయాజులు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత రెవిన్యూ శాఖలో ఉద్యోగం సంపాదించుకున్నారు. తన విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ అంచెలంచెలుగా ఎదిగి డిప్యూటీ కలెక్టర్‌ స్థాయికి చేరుకున్నారు. ఉద్యోగం చేస్తున్నప్పటికీ నాటకాల ప్రదర్శనను మాత్రం విడిచిపెట్టలేదు. 1979లో మహబూబ్‌నగర్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో కళాతపస్వి కె.విశ్వనాథ్‌ నుంచి పిలుపు వచ్చింది. తను రూపొందిస్తున్న ‘శంకరాభరణం’ చిత్రంలో శంకరశాస్త్రి పాత్ర కోసం సోమయాజులుకి స్క్రీన్‌ టెస్ట్‌ చేసి, గెటప్‌ వేసి చూశారు. విశ్వనాథ్‌ పూర్తి సంతృప్తి చెందారు. అలా ‘శంకరాభరణం’ చిత్రంలో ఎంపికయ్యారు సోమయాజులు. నిజానికి అంతకుముందే ‘రారా కృష్ణయ్య’ అనే సినిమాలో ఒక ప్రధాన పాత్రలో ఆయన నటించారు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో గుర్తింపు తీసుకురాలేదు.

1980 ఫిబ్రవరి 2న విడుదలైన ‘శంకరాభరణం’ ఘనవిజయం సాధించడంతో శంకరశాస్త్రి పాత్ర పోషించిన జె.వి.సోమయాజులు పేరు మారుమోగిపోయింది. ఎన్నో సంవత్సరాలు లెక్కకు మించిన నాటకాల్లో నటించినా రాని పేరు ఒక్క సినిమాతో సోమయాజులుకి వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయనకు వరస అవకాశాలు వచ్చాయి. ఆయన కెరీర్‌లో దాదాపు 150 సినిమాల్లో నటించారు. అందులో త్యాగయ్య, సప్తపది, వంశవృక్షం వంటి సినిమాల్లో నటించినప్పటికీ శంకరాభరణం స్థాయిలో ఆ సినిమాలు విజయవంతం కాలేదు. ఆ తర్వాతి కాలంలో బుల్లితెరపై కూడా నటుడిగా కనిపించారు సోమయాజులు. ఎన్ని సినిమాలు చేసినా తనకు పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా శంకరాభరణం అని చెప్పేవారు.

డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రభుత్వ అనుమతి లేకుండా సినిమాల్లో నటిస్తున్నారని ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డికి సోమయాజులుపై కొందరు ఫిర్యాదు చేశారు. దాన్ని పరిశీలించిన చెన్నారెడ్డి.. సాంస్కృతిక శాఖను ఏర్పాటు చేసి దానికి తొలి డైరెక్టర్‌గా సోమయాజులును నియమించారు. 1984లో ఎన్‌.టి.రామారావు ప్రభుత్వం ఉద్యోగుల వయో పరిమితిని 55కి తగ్గించడంతో సోమయాజులు రిటైర్‌ అవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం సోమయాజులుని ఆదరించి తమ కళాశాలలోని రంగస్థల కళల శాఖకు అధిపతిగా నియమించింది. ఆ బాధ్యతలు నిర్వహిస్తూనే సినిమాల్లో, నాటకాల్లో విభిన్న పాత్రలు పోషించారు. నటనకు పదవీ విరమణ లేదనీ, చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉండాలని చెప్పేవారు సోమయాజులు. చివరి రోజుల్లో ఆరోగ్యం సహకరించకపోయినా నటిస్తూనే ఉన్నారు. 2004 ఏప్రిల్‌ 24న 76 ఏళ్ళ వయసులో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు జె.వి.సోమయాజులు.