English | Telugu
నటుడిగా సక్సెస్ అయిన శరత్‌బాబు.. వ్యక్తిగత జీవితంలో ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఇవే!
Updated : Jul 31, 2025
(జూలై 31 నటుడు శరత్‌బాబు జయంతి సందర్భంగా..)
అందం, అభినయం, మంచి ఎత్తు.. హీరోగా రాణించడానికి ఉండాల్సిన లక్షణాలు. ఇవి ఉన్నంత మాత్రాన హీరోగా సక్సెస్ అవుతారన్న గ్యారెంటీ కూడా లేదు. ఎందుకంటే.. ఇవన్నీ ఉన్నప్పటికీ ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలంటారు పెద్దలు. ఆ అదృష్టం అందరికీ ఉండకపోవచ్చు. హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత అది సాధ్యం కాకపోవడంతో తిరిగి వెనక్కి వెళ్లినవాళ్లు చాలా మంది ఉంటారు. అయితే కొందరు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా స్థిరపడిపోయారు. అలాంటి వారిలో విలక్షణ నటుడు శరత్‌బాబు గురించి చెప్పుకోవచ్చు. హీరోకి ఉండాల్సిన అన్ని లక్షణాలు అతనికి ఉన్నప్పటికీ సక్సెస్‌ఫుల్ హీరో అవ్వలేక చివరికి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు.
1951 జూలై 31న ఆంధ్రప్రదేశ్‌లోని ఆముదాలవలసలో జన్మించారు శరత్‌బాబు. అతని అసలు పేరు సత్యనారాయణ దీక్షితులు. అయితే అతన్ని సత్యంబాబు అని పిలిచేవారు. ఆరడుగుల ఎత్తు ఉండే శరత్‌బాబుకి పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే కోరిక ఉండేది. ఒకసారి పోలీస్ సెలెక్షన్స్‌కి కూడా వెళ్లారు. అయితే అతనికి కంటి సమస్య ఉన్న కారణంగా సెలెక్ట్ అవ్వలేదు. ఇదిలా ఉంటే.. మంచి అందగాడైన శరత్‌బాబును అందరూ హీరోలా ఉన్నావు అనేవారు. సినిమాల్లో అయితే రాణిస్తావు అని కూడా చెప్పేవారు. శరత్‌బాబు తల్లికి కూడా ఇదే అభిప్రాయం ఉండేది. అలా శరత్‌కి సినిమాల్లో నటించాలన్న ఆసక్తి కలిగింది. అదే సమయంలో ‘రామరాజ్యం’ చిత్రంలో కొత్తవారిని తీసుకుంటున్నారని తెలిసి.. ఆ సినిమా ఆఫీస్‌కి వెళ్లి డైరెక్టర్ బాబూరావును కలిశారు శరత్. హీరోలా ఉన్న అతన్ని చూసి సినిమాలో ఒక పాత్ర కోసం సెలెక్ట్ చేశారు.
శరత్‌బాబు చేసిన రెండో సినిమా ‘కన్నెవయసు’. రెండు సినిమాలు చేసినప్పటికీ అతనికి అవకాశాలు రాలేదు. 1970వ దశకం వచ్చేసరికి రమాప్రభ టాప్ కమెడియన్‌గా లెక్కకు మించిన సినిమాలు చేస్తున్నారు. అవకాశాల కోసం పరిశ్రమకు కొత్తగా వచ్చినవారికి తన ఇంటిలో వసతి కల్పించేవారు రమాప్రభ. అలా శరత్‌బాబు కూడా రమాప్రభ ఇంటిలో చేరారు. అలా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ సహజీవనం చేయడం ప్రారంభించారు. శరత్‌బాబు కంటే రమాప్రభ నాలుగేళ్ళు పెద్ద వారు. ఎన్నో సినిమాల్లో శరత్‌బాబుకి వేషాలు ఇప్పించారు రమాప్రభ. అతని ఎదుగుదలకు రమాప్రభే ప్రధాన కారణం అయ్యారు.
కె.బాలచందర్, సింగీతం శ్రీనివాసరావు వంటి దర్శకుల సినిమాల్లో నటించడం ద్వారా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు శరత్‌బాబు. మరోచరిత్ర, ఇది కథ కాదు, గుప్పెడు మనసు, తొలికోడి కూసింది వంటి సినిమాలో శరత్‌బాబుకి మంచి పాత్రలు ఇచ్చి బాలచందర్ ప్రోత్సహించారు. అమెరికా అమ్మాయి, పంతులమ్మ వంటి సినిమాల్లో అతనికి మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు సింగీతం శ్రీనివాసరావు. ఈ సినిమాలు శరత్‌బాబు కెరీర్‌కి ఎంతో ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత కె.విశ్వనాథ్ సాగరసంగమం, స్వాతిముత్యం, ఆపద్బాంధవుడు వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు ఇచ్చారు. శరత్‌బాబు నటించిన సినిమాల్లో సీతాకోక చిలక, సితార, స్వాతి, అన్వేషణ, సంసారం ఒక చదరంగం, స్రవంతి, సంసారం ఓ సంగీతం వంటి సినిమాల్లో తను చేసిన పాత్రల ద్వారా ప్రేక్షకుల్ని మెప్పించారు శరత్‌బాబు.
సీతాకోక చిలక, ఓ భార్య కథ, నీరాజనం చిత్రాల్లోని తన నటనకుగాను ఉత్తమ సహాయ నటుడిగా మూడు సార్లు నంది అవార్డు అందుకున్నారు శరత్‌బాబు. ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే.. 1973లో ప్రారంభమైన శరత్‌బాబు, రమాప్రభల సహజీవనం 1987తో ముగిసింది. తమది పెళ్లి కాదని, అవకాశవాద వివాహం అని రమాప్రభ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తన ఆస్తి కోసమే శరత్‌బాబు తన పంచన చేరాడని, తన ఆస్తుల్ని బలవంతంగా లాక్కున్నాడని ఆమె ఆరోపించారు. అయితే రమాప్రభ ఆరోపణలను శరత్‌బాబు ఖండిరచారు. బలవంతంగా ఆస్తులు లాక్కోవాల్సిన అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. రమాప్రభ నుంచి విడిపోయిన తర్వాత 1990లో తమిళ నటుడు నంబియార్ కుమార్తె స్నేహ నంబియార్‌ను వివాహం చేసుకున్నారు శరత్‌బాబు. 26 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. 2023 ఏప్రిల్‌లో అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరారు శరత్‌బాబు. నెలరోజుల పాటు ఆయనకు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించారు. చివరికి మే 22న 71 ఏళ్ళ వయసులో తుదిశ్వాస విడిచారు శరత్‌బాబు.