Read more!

English | Telugu

‘పదహారేళ్ళ వయసు’ క్లైమాక్స్‌ విషయంలో దర్శకుడు, నిర్మాత మధ్య వివాదం.. చివరికి ఏమైంది?

కొన్ని సినిమాలను ఎవర్‌గ్రీన్‌ అంటారు. అలాంటి ఎవర్‌గ్రీన్‌ సినిమాల్లో తమిళ్‌లో సూపర్‌ హిట్‌ అయిన ‘16 వయతినిలే’ ఒకటి. ప్రముఖ దర్శకుడు భారతీరాజాకు ఇది తొలి సినిమా కావడం విశేషం. తొలి సినిమాతోనే ఉత్తమ దర్శకుడుగా తమిళనాడు స్టేట్‌ అవార్డు అందుకున్నారు భారతీరాజా. కమల్‌హాసన్‌, రజినీకాంత్‌, శ్రీదేవిలతో ఆయన చేసిన ఈ సినిమా ఒక చరిత్ర సృష్టించింది. తెలుగులో ‘పదహారేళ్ళ వయసు’గా, హిందీలో ‘సోల్వా సావన్‌’గా రీమేక్‌ చేశారు. హిందీ వెర్షన్‌ని కూడా భారతీరాజేయే రూపొందించారు. తెలగు వెర్షన్‌ని మాత్రం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు డైరెక్ట్‌ చేశారు. తెలుగు వెర్షన్‌ నిర్మాణం వెనుక ఎన్నో విశేషాలు ఉన్నాయి. అవేమిటో ఒకసారి చూద్దాం. 

‘16 వయతినిలే’ చిత్రానికి నిర్మాత ఎస్‌.ఎ.రాజ్‌కన్ను. అతను ఓ లారీ ఓనర్‌. సినిమా మీద ఇంట్రెస్ట్‌తో రూ.6 లక్షల బడ్జెట్‌లో అతని లారీని కూడా అమ్మేసి సినిమా చేశాడు. ఆ తర్వాత రిలీజ్‌ చెయ్యడానికి డబ్బు లేక కేవలం 6 థియేటర్లలోనే సినిమాను రిలీజ్‌ చేశారు. మొదటి రెండు వారాలు సినిమాకి ఎలాంటి టాక్‌ లేదు. మూడో వారం నుంచి కలెక్షన్లు పుంజుకున్నాయి. ఆ సినిమాని తెలుగులో రీమేక్‌ చేస్తే అద్భుతంగా ఉంటుందని భావించిన మిద్దే రామారావు రీమేక్‌ రైట్స్‌ కోసం ప్రయత్నించారు. ఆరోజుల్లో ఎలాంటి సినిమాకైనా రీమేక్‌ రైట్స్‌కి 30, 40 వేల కంటే ఎక్కువ ఇచ్చేవారు కాదు. కానీ, ఈ సినిమాకి మాత్రం లక్షన్నర డిమాండ్‌ చేశారు. నిర్మాత లక్ష ఇస్తానన్నాడు. చివరికి రూ.1,17,500కి రైట్స్‌ తీసుకున్నారు. ఒక్కసారిగా అంత రేటు పెట్టి రైట్స్‌ తీసుకుంటే మిగతా వారు కూడా పెంచేస్తారు అని కొందరు నిర్మాతలు గొడవ చేశారు. అవేవీ పట్టించుకోని మిద్దే రామారావు తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 

దర్శకుడుగా కె.రాఘవేంద్రరావును ఎంపిక చేసుకున్నారు. అప్పటికే ‘అడవి రాముడు’ వంటి సిల్వర్‌ జూబ్లీ సినిమా చేసిన ఆయన ఇలాంటి చిన్న సినిమా చేయడానికి ఒప్పుకోవడం గొప్ప విశేషంగానే చెప్పుకోవచ్చు. ఆయనకు రూ.55 వేలు రెమ్యునరేషన్‌ ఫిక్స్‌ చేశారు. ఆ తర్వాత తమిళ్‌లో హీరోయిన్‌గా నటించిన శ్రీదేవినే తెలుగులోనూ తీసుకున్నారు. మొదట ఆమెకు రూ.1 లక్ష రెమ్యునరేషన్‌ అడిగారు శ్రీదేవి తల్లి. చివరికి రూ.30 వేలకి ఫైనల్‌ చేసుకున్నారు. ఇక తమిళ్‌లో కమల్‌హాసన్‌ చేసిన క్యారెక్టర్‌ని తెలుగులో చంద్రమోహన్‌ చేశారు. అతని రెమ్యునరేషన్‌ రూ.12,500. రజినీకాంత్‌ క్యారెక్టర్‌ను మోహన్‌బాబు చేశారు. అతని రెమ్యునరేషన్‌ రూ.10,000. శ్రీదేవి తల్లిగా నిర్మలను తీసుకున్నారు. ఆమె రెమ్యునరేషన్‌ రూ.5 వేలు. ఇలా అన్నీ సెట్‌ చేసుకొని కోటిపల్లిలో షూటింగ్‌ స్టార్ట్‌ చేశారు. మూడో షెడ్యూల్‌లో క్లైమాక్స్‌ చిత్రీకరించాల్సి ఉంది. ఇప్పుడు చిక్కంతా అక్కడే వచ్చింది. 

తమిళ్‌ వెర్షన్‌ క్లైమాక్స్‌లో హత్య కేసులో జైలుకెళ్ళిన హీరో తిరిగి ఎప్పుడొస్తాడో తెలీదు. అప్పటివరకు తాను ఎదురుచూస్తానంటుంది హీరోయిన్‌. హీరో తిరిగి వచ్చాడా లేదా అనేది క్లారిటీ ఇవ్వకుండా సినిమాని ఎండ్‌ చేశారు. తెలుగులో కూడా అలాగే చేద్దామని రాఘవేంద్రరావు అంటే.. అలా కాదు, హ్యాపీ ఎండిరగ్‌ ఉండాలని నిర్మాత పట్టుపట్టారు. క్లైమాక్స్‌ని మార్చి చేస్తే చెడ్డ పేరు వస్తుందేమోనని రాఘవేంద్రరావు భయపడ్డారు. నిర్మాత మాత్రం హ్యాపీ ఎండిరగే కావాలన్నారు. అది రాఘవేంద్రరావుకి ఇష్టం లేదు. అప్పుడు నిర్మాత ఓ ఆలోచన చేశాడు. రెండు క్లైమాక్స్‌లు తీద్దాం. ఏది బాగుంటే దాన్నే ఉంచుదాం అని డైరెక్టర్‌తో చెప్పారు. దానికి రాఘవేంద్రరావు సినిమా మీది, మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అని నిర్మాతకే వదిలేశారు. సినిమా సెన్సార్‌కి వెళ్లింది. అప్పుడు సెన్సార్‌ సభ్యులకు హ్యాపీ ఎండిరగ్‌ని కూడా చూపించారు. అయితే వారంతా హ్యాపీ ఎండిరగ్‌కే ఓటేశారు. అది జరిగిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలోని వారి కోసం దాదాపు 20 ప్రొజెక్షన్స్‌ వేశారు. అందరూ హ్యాపీ ఎండిరగ్‌ కావాలని అడిగారు. అందరూ కోరినట్టుగానే సినిమాని హ్యాపీ ఎండిరగ్‌తో రిలీజ్‌ చేశారు. మొదటి మూడు వారాలు కలెక్షన్లు లేవు. నాలుగో వారం నుంచి పుంజుకొని రోజు రోజుకీ కలెక్షన్లు పెరుగుతూ వెళ్లాయి. అలా ‘పదహారేళ్ళ వయసు’ ఒక ప్రభంజనం సృష్టించింది. సిల్వర్‌ జూబ్లీ దాటిపోయినా సినిమా రన్‌ అవుతూనే ఉంది. ఈ సినిమా 200 రోజుల ఫంక్షన్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. 275 రోజుల ఫంక్షన్‌ను మద్రాస్‌లో చేశారు. ‘పదహారేళ్ళ వయసు’ చిత్రంలో నటించిన చంద్రమోహన్‌, శ్రీదేవి, మోహన్‌బాబులకు చాలా మంచి పేరు వచ్చింది. దర్శకుడు కె.రాఘవేంద్రరావు కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌లా నిలిచిపోయింది.