Read more!

English | Telugu

అలా చేసినందుకు దిల్‌రాజు నన్ను తిట్టారు : సుకుమార్‌

1998లో ఓ పెద్ద కళాశాలలో మేథమెటిక్స్‌ లెక్చరర్‌. జీతం నెలకు. రూ.75 వేలు పైమాటే. అప్పట్లో ఆ జీతం చాలా ఎక్కువనే చెప్పాలి. ఆ ఉద్యోగం రుచించలేదు. చిన్నతనం నుంచి సినిమా రంగంపై ఉన్న మక్కువ ఆ ఉద్యోగాన్ని స్థిరంగా చెయ్యనివ్వలేదు. తండ్రితో మాట్లాడి సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. మొదట ఎడిటర్‌ మోహన్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు. 2004లో అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన ‘ఆర్య’ చిత్రంతో దర్శకుడుగా తన కెరీర్‌ను స్టార్ట్‌ చేశాడు. అతనే.. ఇప్పుడు ఇండియాలోనే టాప్‌ డైరెక్టర్‌గా వెలుగొందుతున్న సుకుమార్‌.  

తొలి సినిమా సూపర్‌హిట్‌ అవ్వడంతో తనమీద తనకే ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ పెరిగిపోయింది. ఎవరు ఏం చెప్పినా వినకపోవడం అనే అలవాటు అబ్బింది. ఆ సమయంలోనే దిల్‌రాజుతో మనస్పర్థలు వచ్చాయి. తన రెండో చిత్రాన్ని మహేష్‌తోగానీ, అల్లు అర్జున్‌తోగానీ చేద్దామని డిసైడ్‌ అయ్యాడు సుకుమార్‌. ఈ విషయంలో నిర్మాత దిల్‌రాజు సహకరించకపోవడంతో దాన్ని తట్టుకోలేకపోయాడు. కోపంతో ఊగిపోయాడు. ఆ కోపంతోనే హీరో రామ్‌ దగ్గరకు వెళ్లి కథ చెప్పి రాత్రికి రాత్రే సినిమా కన్‌ఫర్మ్‌ చేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయమే తన రెండో సినిమాను స్టార్ట్‌ చేసేశాడు సుకుమార్‌. 

ఈ వ్యవహారం గురించి ఓ సందర్భంలో సుకుమార్‌ స్వయంగా తెలియజేస్తూ ‘నేను పరిశ్రమకు వచ్చిన తొలిరోజుల్లో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయాలు బొత్తిగా తెలిసేవి కావు. సొసైటీలోని వారంతా నాలాగే ఉంటారు అనుకునేవాడ్ని. నా తొలి సినిమా ‘ఆర్య’ పెద్ద హిట్‌ అవ్వడంతో ఇక మనకు తిరుగులేదు అనుకున్నాను. రెండో సినిమాగా బన్నితోనే ‘జగడం’ చెయ్యాలనుకున్నాను. ఫుల్‌ స్క్రిప్ట్‌ రెడీ అయిపోయింది. ఆ సమయంలోనే దిల్‌రాజుతో సమస్య వచ్చింది. అందుకే వెంటనే రామ్‌తో ‘జగడం’ స్టార్ట్‌ చేశాను. ఓపెనింగ్‌కి అల్లు అర్జున్‌ని, దిల్‌రాజుని పిలిచాను. అక్కడికి వచ్చిన తర్వాత రాజుగారు ‘నీకు బుద్ధుందా? ఏంటి ఇలా చేశావ్‌. కోపం వస్తే, కనీసం చెప్పకుండా సినిమాను ఓపెన్‌ చేసేస్తావా’ అని తిట్టారు. నేను అమాయకుడినని ఆయనకు తెలుసు. అయితే అలా చేయడం నా గొప్పతనం అనుకున్నాను. ‘మీరు కథలో ఆ మార్పు చేయాలి.. ఈ మార్పు చేయాలి’ అంటున్నారు అసలు కుదరదు అని చెప్పేశాను. మొదటి సినిమా హిట్‌ కావడంతో నా జడ్జిమెంట్‌ను ఎవరైనా తప్పు అని చెబితే కోపం వచ్చేసేది. వాస్తవానికి ‘జగడం’లో రామ్‌ చేసిన పాత్ర మహేష్‌ లేదా బన్ని చేస్తే బాగుండేది. తమ్ముడి పాత్రలో రామ్‌ నటించి ఉంటే సరిపోయేది.  అందుకే ‘జగడం’ ఫ్లాప్‌ అయింది. ఈ సినిమా నేర్పిన గుణపాఠంతో నాలోనూ మార్పు వచ్చింది. ఆరోజు నుంచి ఎవరేం చెప్పినా ఓపికగా వినడం అలవాటు చేసుకున్నాను’ అంటూ ‘ఆర్య’ వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ‘జగడం’ సినిమా ఫ్లాప్‌ అవ్వడం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాల గురించి వివరించారు సుకుమార్‌.