Read more!

English | Telugu

సావిత్రి.. మహానటే కాదు.. మహామనీషి అని రుజువు చేసిన సంఘటన!

సినిమా నిర్మాణం అనేది ఎంత ఖర్చుతో, మరెంతో శ్రమతో కూడుకున్న పని. ప్రేక్షకులకు ఓ మంచి సినిమా అందించి వారిని ఎంటర్‌టైన్‌ చెయ్యడమే ప్రధాన లక్ష్యంగా పాతతరం నిర్మాతలు ఉండేవారు. వ్యాపార ధోరణి కంటే ఒక మంచి ఉద్దేశమే వారికి ఉండేది. అయితే అలాంటి నిర్మాతలు సైతం ఎన్నో ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. అయితే పాతతరం నటీనటులు కూడా నిర్మాతల పట్ల ఎంతో ఉదారంగా ఉండేవారు. రెమ్యునరేషన్ల విషయంలో కూడా వారికి పెద్దగా పట్టింపు ఉండేది కాదు. నిర్మాత బాగుంటే మళ్ళీ సినిమా తీసే అవకాశం ఉంటుందన్న ఆలోచనతోనే నటీనటులు కూడా నిర్మాతకు సహకరించేవారు. అలాంటి ఓ సంఘటన 1972లో వచ్చిన ‘కన్నతల్లి’ సినిమా విషయంలో జరిగింది.

మంచి సినిమాలు నిర్మించి నిర్మాతగా మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కేవలం 20 సంవత్సరాల వయసులోనే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు రుద్రరాజు సీతారామరాజు. ఆయన తన తొలి ప్రయత్నంగా ‘కన్నతల్లి’ చిత్రాన్ని ప్రారంభించారు. టి.మాధవరావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు సీతారామరాజు. మహానటి సావిత్రి, శోభన్‌బాబు, చంద్రకళ, రాజబాబు, నాగభూషణం, ప్రభాకరరెడ్డి వంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలోని తారాగణం. షూటింగ్‌ ప్రారంభమైంది. అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం జరుగుతోంది  అనుకుంటున్న తరుణంలో అనుకోకుండా సావిత్రి అనారోగ్యానికి గురయ్యారు. దానివల్ల సినిమాలోని ప్రధాన తారాగణం అంతా పాల్గొనే 15 రోజుల మేజర్‌ షెడ్యూల్‌ ఆగిపోయింది. ఆ షెడ్యూల్‌లో చెయ్యాల్సి ఆర్టిస్టుల కాల్‌షీట్స్‌ మళ్ళీ ఒకేసారి దొరకాలంటే చాలా కష్టం. ఆ సమయంలో ఈ సినిమాతోపాటు మరో నాలుగు సినిమాల నిర్మాతలు కూడా ఇబ్బందులు పడ్డారు. 

తర్వాత కొన్నాళ్ళకు సావిత్రి కాస్త కోలుకున్న తర్వాత ఆమెను సీతారామరాజు కలిసి పరిస్థితి చెప్పారు. దానికామె మిగతా ఆర్టిస్టుల పరిస్థితి ఏమిటి అనేది కనుక్కొని తనకు చెప్పమని అన్నారు. అప్పుడు శోభన్‌బాబుని కలిసి విషయం చెప్పడంతో వేరే నిర్మాతలకు ఇచ్చిన డేట్స్‌ని ఎడ్జస్ట్‌ చెయ్యడం అంటే కొంచెం కష్టమే. సావిత్రిగారు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మేం కూడా సినిమాని పూర్తి చెయ్యడానికి కష్టపడతాం అని శోభన్‌బాబు చెప్పారు. మూడు రోజుల తర్వాత సావిత్రిని కలిసిన నిర్మాత విషయం చెప్పడంతో మీరు అధైర్య పడవద్దు. సినిమా పూర్తి చేద్దాం. కాకపోతే నేను 15 రోజుల్లో చెయ్యాల్సిన సీన్స్‌ను వారం రోజుల్లో కంప్లీట్‌ చేసేలా ప్లాన్‌ చేసుకోమని నిర్మాతకు చెప్పడంతో.. ఆమె సూచించిన విధంగానే చేసి మొత్తానికి షూటింగ్‌ పూర్తి చేశారు.

ఇక డబ్బింగ్‌ చెప్పాల్సిన టైమ్‌ వచ్చినపుడు సావిత్రి.. నిర్మాత సీతారామరాజును తన రెమ్యునరేషన్‌ గురించి అడిగారు. రూ.40 వేలకు మాట్లాడుకున్నామని, ఆల్రెడీ రూ.30 వేలు ఇచ్చానని, ఇంకా రూ.10 వేలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. దానికామె ‘మీరు ఆ పదివేలు ఇవ్వాల్సిన పనిలేదు. నేను డబ్బింగ్‌ కంప్లీట్‌ చేస్తాను’ అన్నారు.  చెప్పిన విధంగానే డబ్బింగ్‌ పూర్తి చేశారు. సాధారణంగా శోభన్‌బాబు తనకు రావాల్సిన రెమ్యునరేషన్‌ ఇస్తేనేగానీ డబ్బింగ్‌ చెప్పరు. కానీ, ఆ విషయాలేవీ మాట్లాడకుండా డబ్బింగ్‌ చెప్పేసి వెళ్లిపోయారు. సినిమా రిలీజ్‌కి ముందు నిర్మాత సీతారామరాజు ఆయనకు అమౌంట్‌ ఇవ్వడానికి వెళితే..‘మీరు ఫర్వాలేదా..’ అని అడిగారు. నిర్మాత ఇచ్చిన డబ్బును కూడా తీసుకోవడానికి 10 నిమిషాలు ఆలోచించి మరీ తీసుకున్నారు. అలాగే సినిమాలో నటించిన మిగతా ఆర్టిస్టులు కూడా ఎంతో కోఆపరేట్‌ చెయ్యడం వల్ల నిర్మాతకు కలిగే నష్టంలో కొంత తగ్గింది. అయితే సినిమా నిర్మాణ వ్యయం బాగా పెరిగిపోయింది. ఆ 15 రోజుల షెడ్యూల్‌ పూర్తి చేయడానికి 8 నెలలు పట్టింది. 1972 ఆగస్ట్‌ 26న ఈ సినిమా రిలీజ్‌ అయింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి సినిమాగా ‘కన్నతల్లి’కి పేరు వచ్చింది.