Read more!

English | Telugu

రాజేంద్రప్రసాద్‌కి ఒకేసారి 14 సినిమాలు ఇప్పించిన సూపర్‌స్టార్‌ కృష్ణ!

హాస్యనటుడిగా ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసి ఫుల్‌లెంగ్త్‌ కామెడీ సినిమాలతో ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తిన నటుడు రాజేంద్రప్రసాద్‌. మద్రాస్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో గోల్డ్‌  మెడల్‌ అందుకొని నటుడిగా తనను తాను ప్రూవ్‌ చేసుకోవాలనుకున్న క్రమంలో అతనికి అవకాశాలు రాలేదు. తిరిగి తిరిగి విసిగిపోయిన సమయంలో అతనికి ‘మేలుకొలుపు’ అనే సినిమాలో హీరోకి డబ్బింగ్‌ చెప్పే అవకాశం వచ్చింది. అది ఎలా వచ్చింది, ఆ తర్వాత నటుడిగా సినిమాలో నటించే ఛాన్స్‌ ఎలా వచ్చింది అనే విషయాలు రాజేంద్రప్రసాద్‌ మాటల్లోనే తెలుసుకుందాం. 

‘ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన నాకు సినిమాల్లో నటించే అవకాశాలు మాత్రం రాలేదు. ఎందుకంటే అప్పుడు నా వయసు అలాంటిది. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చెయ్యలేను, హీరోగా నటించడానికి నేను అంత మెచ్యూర్డ్‌ కాదు. పైగా చాలా సన్నగా ఉండేవాడిని. దాంతో ఎవరూ అవకాశాలు ఇచ్చేవారు కాదు. ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉన్నాను. ఊరి నుంచి తెచ్చుకున్న డబ్బులు అయిపోతున్నాయి. ఉన్నవాటితోనే సర్దుకోవాలి. అందుకే ప్రతిరోజూ ఒక అరటి పండు, పాలు తీసుకునేవాడిని. నేను తృప్తిగా భోజనం చేసి నెలరోజులైంది. అప్పుడు పుండరీకాక్షయ్యగారి ఇంటికి వెళ్ళాను. ఆ టైమ్‌లో లోపల పెద్ద డిస్కషన్‌ జరుగుతోంది. అందరూ బయటికి వచ్చారు. పెద్దాయన నన్ను చూసి ఒక్కసారిగా ‘మనం ప్రసాద్‌ని మర్చిపోయాం. మనకి వాయిస్‌ దొరికేసింది’ అని సంతోషంగా అన్నారు. నాకు ఏమీ అర్థం కాలేదు. 

విషయం ఏమిటంటే... ‘మేలుకొలుపు’ అనే సినిమాలో రాజాకృష్ణ అనే ఆర్టిస్టు నటించాడు. అతనికి 15 సంవత్సరాలు ఉంటాయి. అతనికి డబ్బింగ్‌ చెప్పించడానికి వాయిస్‌ ఎవ్వరిదీ సెట్‌ అవ్వడం లేదు. అదీ అక్కడి డిస్కషన్‌. సడన్‌గా నేను కనిపించేసరికి నన్ను డబ్బింగ్‌ థియేటర్‌కి తీసుకెళ్ళి ఓ పేపర్‌ ఇచ్చి మైక్‌ ముందు నిలబెట్టి ఆ కుర్రాడికి డబ్బింగ్‌ చెప్పమన్నారు. అసలే కొత్త, పైగా ఆకలి. నిలబడే ఓపిక కూడా లేదు. అయినా ధైర్యంగా ఆ షాట్‌ వరకు డబ్బింగ్‌ చెప్పేశాను. అక్కడ ఉన్నవారంతా ఫుల్‌ హ్యాపీ. సినిమా మొత్తానికి నువ్వే డబ్బింగ్‌ చెప్పాలి అన్నారు పుండరీకాక్షయ్యగారు. దానికి నేను ‘భోజనం పెట్టిస్తే చెప్తాను’ అన్నాను. అప్పుడు నా పరిస్థితి తెలిసి ఆయన ఇంటికి రావచ్చు కదా అని తిట్టారు. అలా మొదటి సినిమాకి డబ్బింగ్‌ పూర్తి చేశాను. ఇక ఆ తర్వాత వరసగా డబ్బింగ్‌ అవకాశాలు వచ్చాయి. అప్పట్లో మణిరత్నం మౌనరాగం సినిమాలో మోహన్‌కి వాయిస్‌ ఇచ్చాను. రామ్‌జీ, రాంకీ..లాంటి వారికి కూడా నాదే వాయిస్‌. డబ్బింగ్‌ సినిమాలకు సంబంధించి కొత్త ఆర్టిస్ట్‌ ఎవరైనా ఉంటే నాతోనే డబ్బింగ్‌ చెప్పించేవారు. అలా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా బిజీ అయిపోయాను. తర్వాత సినిమాలో నటించే అవకాశం కూడా అనుకోకుండానే వచ్చింది. కృష్ణగారు, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘రామరాజ్యంలో భీమరాజు’ సినిమా షూటింగ్‌ జరుగుతుండగా అందులో నటించాల్సిన ఒక ఆర్టిస్ట్‌ సడన్‌ నేను చెయ్యను అంటూ వెళ్లిపోయాడట. ఎందుకంటే ఆ సీన్‌లో శ్రీదేవి కాళ్ళు పట్టుకోవాలి. అలా చెయ్యడం ఇష్టంలేని ఆ ఆర్టిస్ట్‌ షూటింగ్‌ వదిలేసి వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఏం చెయ్యాలో తోచని స్థితిలో ఉన్నారు నిర్మాత వెంకన్నబాబు నన్ను వెతుక్కుంటూ వచ్చి ఆ సినిమా గురించి చెప్పారు. నేను డబ్బింగులు చెప్పుకుంటున్నాను. నేను నటించడం ఏమిటి అన్నాను. అలాకాదు, నువ్వు రావాల్సిందేనని పట్టుపట్టి కారు ఎక్కించారు. అలా ‘రామరాజ్యంలో భీమరాజు’ సినిమాలో తొలిసారి నటించాను. శ్రీదేవితో పెళ్లికి సిద్ధపడ్డ నా పక్కన చేరి కృష్ణగారు డైలాగులు చెప్పడం, అవి వింటూ రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ భయపడటం.. ఇదీ సీన్‌. షాట్‌ కంప్లీట్‌ అయింది. చాలా బాగా వచ్చింది. కృష్ణగారు నా పెర్‌ఫార్మెన్స్‌ చూసి తెగ నవ్వుకున్నారు. ఈ కుర్రాడెవరో చాలా బాగా చేస్తున్నాడు అన్నారు. అంతటితో ఆగకుండా ఆయన నటిస్తున్న 14 సినిమాల్లో అవకాశాలు ఇప్పించారు. అలా ఒక్కసారిగా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా బిజీ అయిపోయాను. అప్పుడు కృష్ణగారు నాలోని టాలెంట్‌ని గుర్తించి ఆ అవకాశాలు ఇప్పించకపోతే ఇప్పటికీ డబ్బింగులు చెప్పుకుంటూ వుండేవాడిని. ఈ విషయంలో కృష్ణగారు నాకు చేసిన మేలు ఎప్పటికీ మరచిపోలేను’ అంటూ వివరించారు.