Read more!

English | Telugu

క్రైమ్‌ సినిమాతో విజయనిర్మలను డైరెక్టర్‌ని చెయ్యాలనుకున్న కృష్ణ.. కానీ,!

విజయనిర్మల.. నటి, నిర్మాత, దర్శకురాలు. చిత్ర పరిశ్రమలో ఎవ్వరికీ దక్కని గౌరవాన్ని తను దర్శకత్వం వహించిన సినిమాలతో ఆమె పొందారు. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా 2002లో గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో ఆమె స్థానం సంపాదించారు. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిగా డా.దాసరి నారాయణరావు పేరున గిన్నిస్‌ రికార్డు ఉన్న విషయం తెలిసిందే. ఈ విభాగంలో గిన్నిస్‌ రికార్డు సాధించినవారు ఇద్దరూ తెలుగువారే కావడం మనకెంతో గర్వకారణం. ఫిబ్రవరి 20 విజయనిర్మల జయంతి. ఈ సందర్భంగా ఆమె సినీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాల గురించి తెలుసుకుందాం.

బాల్యం నుంచే కళలపై మక్కువ

మూడేళ్ళ చిరుప్రాయంలోనే విజయనిర్మల నాట్యాన్ని అభ్యసించడం ప్రారంభించారు. ఆమె మేనత్త కూతురైన రావు బాలసరస్వతీదేవి ప్రోత్సాహంతో నృత్యం నేర్చుకొని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. దర్శకుడు పి.పుల్లయ్య రూపొందించే తమిళ చిత్రం ‘మత్స్యరేఖ’ చిత్రంలో నటించేందుకు బాలనటి కోసం అన్వేషిస్తున్న సమయంలో రావు బాలసరస్వతి తన మేనకోడలు విజయనిర్మల గురించి డైరెక్టర్‌ పుల్లయ్యకు చెప్పారు. అలా ఆమెకు ‘మత్స్యరేఖ’ తొలి చిత్రం. ఈ సినిమాలో ఏడ్చే సన్నివేశం ఒకటి ఉంది. కానీ, ఆమె ఏడవకుండా నవ్వుతూ ఉండడంతో పుల్లయ్య ఆమెను తిట్టారు. వెంటనే ఏడుపు మొదలుపెట్టింది. దాన్నే షూట్‌ చేసి సినిమాలో వాడారు. ఈ సినిమాలో విజయనిర్మల బాగా చేసిందని పేరు రావడంతో ఆ తర్వాత కొన్ని తమిళ్‌ సినిమాలు, ఒక బెంగాలీ సినిమాలో కూడా ఆమె బాలనటిగా చేసింది. 1957లో వచ్చిన ‘పాండురంగ మహత్మ్యం’ చిత్రంతో తెలుగు సినిమా రంగానికి పరిచయమయ్యారు. ‘పాండురంగ మహత్మ్యం’ చిత్రంలో బాలకృష్ణుడిగా నటించిందామె. ‘జయ కృష్ణా ముకుందా మురారి..’ పాట ఎంత ప్రజాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో విజయనిర్మల కృష్ణుడిగా మెప్పించి అందర్నీ ఆకట్టుకుంది. బాలనటిగా ఆమెకు ఇది చివరి సినిమా. ఆ తర్వాత భరత నాట్యం నేర్చుకుంటూ చదువుపై దృష్టి పెట్టారామె. 

మొట్టమొదటి దెయ్యం కథ ‘భార్గవి నిలయం’

1964లో ప్రేమ్‌నజీర్‌ హీరోగా ఎ.విన్సెంట్‌ దర్శకత్వంలో మలయాళంలో రూపొందిన ‘భార్గవి నిలయం’ విజయనిర్మలకు హీరోయిన్‌గా మొదటి సినిమా. దెయ్యం కథాంశంతో సినిమాలు రూపొందించడం ఈ సినిమాతోనే మొదలైంది. ఈ సినిమా తర్వాత బి.ఎన్‌.రెడ్డి రూపొందించిన ‘రంగులరాట్నం’ చిత్రంలో రెండో హీరోయిన్‌గా విజయనిర్మల నటించారు. అయితే స్క్రీన్‌మీద తన పేరును నీరజగా వేయించుకున్నారు. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే ఓ తమిళ్‌ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘షావుకారు’ చిత్రాన్ని తమిళ్‌లో రీమేక్‌ చేస్తున్నారు. ఆ సినిమాలో ఎస్వీరంగారావు కాంబినేషన్‌లో మొదటి రోజు షూటింగ్‌. ఆయన విజయనిర్మలను చూసి నాలో సగం కూడా లేదు. ఈమెతో నా కాంబినేషన్‌ ఏమిటి.. వెంటనే అమ్మాయిని మార్చండి అని డైరెక్టర్‌ మీద అరిచారు. ఆ గొడవతో ఆరోజు షూటింగ్‌ జరగలేదు. రెండు రోజుల తర్వాత ఎస్వీ రంగారావుని ఆ పాత్ర నుంచి తప్పించి మరో నటుడితో ఆ సినిమా చేశారు. విజయనిర్మలనే హీరోయిన్‌గా కొనసాగించారు. ఈమె అసలు పేరు నిర్మల. అయితే విజయ సంస్థతో ఆమెకు ఎక్కువ అనుబంధం ఉండడం, అప్పటికే నిర్మల అనే మరో నటి ఉండడంతో తన పేరును విజయనిర్మలగా మార్చుకున్నారు. 
దర్శకత్వం వైపు అడుగులు.. బాపు బాటలో విజయనిర్మల!

ఆ తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సాక్షి’ చిత్రంలో కృష్ణతో కలిసి నటించారు విజయనిర్మల. ఆ సమయంలో బాపు వేసిన బొమ్మలు, ఆయన డైరెక్ట్‌ చేసే విధానం ఆమెకు బాగా నచ్చడంతో తను కూడా డైరెక్టర్‌ అవ్వాలని అనుకుంది. ఇదే విషయం కృష్ణతో చెబితే ఇప్పుడే కెరీర్‌లో నిలదొక్కుకుంటున్నావు. డైరెక్టర్‌గా సక్సెస్‌ అవ్వకపోతే ఆ తర్వాత డైరెక్టర్‌గా, నటిగా రెండిరటిలోనూ అవకాశాలు కోల్పోతావు. అందుకే కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత డైరెక్షన్‌ చెయ్యమని కృష్ణ సలహా ఇచ్చారు. ఆ తర్వాత నాలుగైదు సంవత్సరాలు నటిగానే కొనసాగింది విజయనిర్మల. 100 సినిమాలు పూర్తి చేసింది. అప్పుడు డైరెక్షన్‌ చెయ్యాలనుకుంది. తెలుగులో అయితే బడ్జెట్‌ ఎక్కువ అవుతుందని మలయాళంలో చెయ్యమని కృష్ణ చెప్పారు. కొత్త దర్శకురాలు కావడంతో నిర్మాతలెవరూ ముందుకు రాలేదు. దాంతో తనే సొంతంగా సంగం మూవీస్‌ పేరుతో ఓ బేనర్‌ను స్థాపించి ‘కవిత’ అనే సినిమాను తీశారు. మూడు లక్షల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకి దర్శకురాలిగా ఆమెకు మంచి పేరు రావడంతో తెలుగులో కూడా డైరెక్ట్‌ చెయ్యాలని నిర్ణయించుకుంది. యద్దనపూడి సులోచనా రాణి నవల ‘మీనా’తో తెలుగులో దర్శకురాలిగా పరిచయమయ్యారు. ఈ సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. ఇక అక్కడి నుంచి డైరెక్టర్‌గా వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఆమెకు రాలేదు. ఆమె కెరీర్‌లో మొత్తం 44 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇందులో ఒకటి తమిళ్‌, ఒకటి మలయాళం ఉన్నాయి. మిగిలిన 42 తెలుగు సినిమాల్లో 22 సినిమాలు బయటి బేనర్‌లో చేశారు. 20 సినిమాలు సొంత బేనర్‌లో తీశారు. అందులో ఎక్కువ సినిమాల్లో హీరో కృష్ణ నటించారు. 

క్రైమ్‌ సినిమాతో విజయనిర్మలను డైరెక్టర్‌ని చెయ్యాలనుకున్న కృష్ణ

నిజానికి ‘మీనా’తో కాకుండా ఓ క్రైమ్‌ స్టోరీతో విజయనిర్మలను తెలుగులో డైరెక్టర్‌గా పరిచయం చేయాలనుకున్నారు కృష్ణ. ఆయన అడగడంతో ఒక సీక్రెట్‌ ఏజెంట్‌ స్టోరీని రాశారు ఆరుద్ర. ఆ స్టోరీని కృష్ణ, ఆయన సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావుకు వినిపించారు. అందరికీ కథ నచ్చింది. దాంతో డైలాగ్స్‌ కూడా రాయమనీ, ఆ కథతో విజయనిర్మల డైరెక్టర్‌ అవుతుందనీ అన్నారు కృష్ణ. అయితే ఆ అభిప్రాయంతో విభేదించారు ఆరుద్ర. క్రైమ్‌ స్టోరీతో డైరెక్టర్‌గా పరిచయమై, హిట్టయితే అలాంటి స్టోరీలనే ఆమె బాగా తీస్తుందనే ముద్ర పడుతుందనీ, అలా కాకుండా ఒక ఫ్యామిలీ స్టోరీతో డైరెక్టర్‌ అయితే ఆమె కెరీర్‌ రాణిస్తుందనీ ఆయన సూచించారు. ఇది సూచన మాత్రమేననీ, మీ ఇద్దరూ కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకోండి అని కూడా ఆరుద్ర చెప్పారు. ఆయన సూచన మేరకు ఆ క్రైమ్‌ స్టోరీని పక్కన పెట్టి ‘మీనా’ చిత్రాన్ని రూపొందించారు విజయనిర్మల. 

తెలుగు సినిమాకి విజయనిర్మల చేసిన సేవలకుగాను 2008లో రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు. దిగ్గజ నటుడు శివాజీ గణేషన్‌ను డైరెక్ట్‌ చేసిన ఏకైక మహిళా దర్శకురాలు.  ఆరేళ్ళ వయసులో తమిళ చిత్రం మత్స్యరేఖతో నటిగా పరిచయమైన విజయనిర్మల  తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో 200కి పైగా సినిమాల్లో నటించారు.