Read more!

English | Telugu

నేను ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నప్పుడు అవకాశాలు తగ్గిపోవడానికి కారణం ఆ ఇద్దరు సింగర్సే

గానగంధర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం అంటే ఇష్టపడనివారు ఉండరు. ఆయన పాటను ఆస్వాదించని తెలుగు వారుండరు. దాదాపు 50 సంవత్సరాల పాటు తన గాన మాధుర్యంతో చిన్నవారి నుంచి పెద్ద వారి వరకు అందర్నీ అలరించిన బాలు దాదాపు 40 వేల పాటలు పాడి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. అయితే తను జీవితంలో ఎంతో నష్టపోయానని చెప్పేవారు. అది తన వ్యక్తిగత జీవితంలో, వృత్తిరీత్యా కూడా కొన్ని సందర్భాల్లో నష్టాల్ని చవి చూశారు బాలు. అవేమిటో ఒకసారి చూద్దాం..

1966లో నటుడు పద్మనాభం నిర్మించిన ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ అనే చిత్రంలో పి.సుశీల, రఘురామయ్య, పి.బి.శ్రీనివాస్‌లతో కలిసి ‘ఏమి ఈ వింత మోహం..’ అనే పాటను ఆలపించడం ద్వారా సినీ నేపథ్య గాయకుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు బాలసుబ్రహ్మణ్యం. అయితే 1969 నుంచి బాలుకి అవకాశాలు బాగా పెరిగాయి. ప్రతిరోజూ పాటలు పాడేవారు. అయితే ఆయనకు ఉన్న ఒకే ఒక చింత.. తనకు సంగీతం రాదు, అందులో థియరీ తనకు తెలియదు, కేవలం ప్రాక్టికల్‌గా పాడగలడు తప్ప ఎక్కడా సంగీతాన్ని అభ్యసించలేదు. అప్పటికి ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది సింగర్స్‌ సంగీతం నేర్చుకున్నవారు. తనకు అందులో ఓనమాలు కూడా రావు. కానీ, సింగర్‌గా అవకాశాలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఎన్ని పాటలు పాడినా తనకు సంగీతం రాదు అనే భావన ఆయనకు చనిపోయే వరకు ఉంది. సందర్భం వచ్చినపుడల్లా ఈ విషయాన్ని ప్రస్తావించేవారు బాలు. ఇక సినిమాల్లో అవకాశాలు పెరగడం వల్ల తన వ్యక్తిగత జీవితాన్ని నష్టపోయానని కూడా చాలాసార్లు చెప్పారు. తన పిల్లలు ఏం చదువుతున్నారో తెలీదు. తన భార్య కుటుంబాన్ని ఎలా నడిపించగలుగుతుందో తెలీదు. ఉదయం లేచిన దగ్గర నుంచి స్టూడియోల చుట్టూ తిరగడమే తన పనిగా ఉండేది. 

తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో సింగర్‌గా బిజీ అయిపోయిన ఎస్‌.పి.బాలుకి సడన్‌గా వి.రామకృష్ణ రూపంలో ఒక షాక్‌ తగిలింది. బాలు కంటే ఒక సంవత్సరమే వయసులో చిన్నవాడైన రామకృష్ణ ఇండస్ట్రీకి మాత్రం బాలు వచ్చిన 6 సంవత్సరాల తర్వాత వచ్చారు. ‘విచిత్రబంధం’ చిత్రంలోని ‘వయసే ఒక పూల తోట’ అనే పాటతో సినీ నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యారు. రామకృష్ణకు అపర ఘంటసాలగా పేరుండేది. ఘంటసాల అంతటి సింగర్‌ అవుతాడని అందరూ అనుకున్నారు. రామకృష్ణ రావడంతో బాలసుబ్రహ్మణ్యంకి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, శోభన్‌బాబు, కృష్ణంరాజు.. ఇలా ఇండస్ట్రీలోని నలుగురు టాప్‌ హీరోలకు రామకృష్ణే ప్లేబ్యాక్‌ పాడేవారు. బాలు మాత్రం హీరో కృష్ణకు మాత్రమే పరిమితమైపోయారు. ఆ సమయంలో బాలు బాధ వర్ణనాతీతం. 

మరో పక్క తమిళ్‌లో అప్పటికే బాలు సింగర్‌గా టాప్‌ పొజిషన్‌లో ఉన్నారు. ఎంజిఆర్‌కి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు చాలా పెద్ద హిట్‌ అయ్యేవి. అంతటి టాప్‌ పొజిషన్‌లో ఉన్న బాలుకి ఏసుదాస్‌ రెండో షాక్‌ ఇచ్చారు. బాలు ఇండస్ట్రీకి వచ్చేనాటికి ఏసుదాస్‌ నాలుగేళ్ళ సీనియర్‌. మంచి సంగీత విధ్వాంసుడు. అయినా తన పద్ధతిలో తాను పాటలు పాడుకుంటూ వెళ్తున్న బాలుకి ఏసుదాస్‌ షాక్‌ ఎలా తగిలిందంటే.. అప్పటివరకు ఎంజిఆర్‌కి పాటలు పాడుతున్న బాలుని తప్పించి ఏసుదాస్‌తో పాడిరచారు. ఆ వాయిస్‌ ఎంజిఆర్‌కి బాగా సూట్‌ అయిందని తమిళ ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. అలా అక్కడ కూడా బాలుకి దెబ్బ పడిరది. అయినా తనలోని టాలెంట్‌తో తనకంటూ ఒక ప్రత్యేకమైన బాణీని ఏర్పరుచుకుని అవకాశాల్ని బాగా పెంచుకున్నారు. 

ఇక తెలుగులో రామకృష్ణ వల్ల అవకాశాలు తగ్గినా టాలీవుడ్‌లోని టాప్‌ హీరోలంతా కమర్షియల్‌ సినిమాల్లో తమ జోరు చూపిస్తుండడంతో మళ్ళీ బాలుకి పూర్వ వైభవం వచ్చింది. అప్పటివరకు ఎన్టీఆర్‌కి, ఎఎన్నార్‌కి చాలా తక్కువ పాటలు పాడిన బాలు ఆ తర్వాత వారి విషయంలో తిరుగులేని సింగర్‌ అనిపించుకున్నారు. రామకృష్ణ ఇండస్ట్రీకి వచ్చిన కొంతకాలంలోనే మంచి సింగర్‌గా పేరు తెచ్చుకోవడమే కాకుండా చాలా తక్కువ టైమ్‌లో 5,000 పాటలను పూర్తి చేశారు. తన కెరీర్‌ ముందుకు సాగడంలో ఎదురైన అవరోధాల్ని దాటుకొని ముందుకు సాగిన ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం గానగంధర్వుడిగా అందరి మనసుల్లోనూ నిలిచిపోయారు.