Read more!

English | Telugu

నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో మధ్యలోనే ఆగిపోయిన సినిమాలివే!

నటసింహ నందమూరి బాలకృష్ణ అంటే బాక్సాఫీస్‌ బొనాంజాగా పిలవబడే హీరో. కలెక్షన్ల పరంగా ఎన్నో రికార్డులు సృష్టించిన బాలకృష్ణ తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. సినిమా ఏవరేజ్‌ అని టాక్‌ తెచ్చుకున్నా కలెక్షన్లకు ఎలాంటి ఢోకా ఉండేది కాదు. ఇక బాలకృష్ణ సినిమాను తీసుకున్న బయ్యర్లు బాగా నష్టపోయిన సందర్భాలు తక్కువనే చెప్పాలి. బాలనటుడుగా, సహనటుడుగా 10కి పైగా సినిమాల్లో నటించిన బాలకృష్ణ సోలో హీరోగా నటించిన తొలి సినిమా 1984లో వచ్చిన ‘సాహసమే జీవితం’. దర్శకుడు పి.వాసు అతని మిత్రుడు భారతి కలిసి ఈ సినిమాను డైరెక్ట్‌ చేశారు. ఈ సినిమా మొదలుకొని నందమూరి అభిమానుల్ని అలరించే ఎన్నో సినిమాలు చేసిన బాలకృష్ణ కెరీర్‌లో ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయని కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆ సినిమాలేమిటో ఇప్పుడు చూద్దాం. 

1986లో జంధ్యాల దర్శకత్వంలో ‘నటరత్న’ అనే సినిమా చెయ్యాలని అనుకున్నారు. బాలకృష్ణ పుట్టినరోజున ఈ టైటిల్‌తో పేపర్‌లో ప్రకటన కూడా వచ్చింది. జంధ్యాలతో అంతకుముందు ‘రెండు రెళ్లు ఆరు’ చిత్రాన్ని నిర్మించిన జి.సుబ్బారావు ఈ చిత్రానికి నిర్మాత. ‘పడమటి సంధ్యారాగం’ సినిమాతోపాటు ‘నటరత్న’ చిత్రాన్ని కూడా అమెరికాలో షూట్‌ చెయ్యాలని ప్లాన్‌ చేశారు జంధ్యాల. అయితే వీసాలు రావడం ఆలస్యం అవడం వల్ల బాలకృష్ణ డేట్స్‌ అడ్జస్ట్‌ అవ్వలేదు. దీంతో సూపర్‌స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌బాబు ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి ‘చిన్నికృష్ణుడు’ అనే టైటిల్‌ను పెట్టారు. సినిమాటోగ్రాఫర్‌ ఎస్‌.గోపాలరెడ్డి తన మిత్రుడు సుధాకర్‌రెడ్డితో కలిసి జంధ్యాల దర్శకత్వంలో ‘బాబాయ్‌ అబ్బాయ్‌’ చిత్రాన్ని నిర్మించారు. బాలకృష్ణకు ఇది 20వ సినిమా. ఈ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత అతనితోనే ‘శపథమ్‌’ అనే సినిమా చెయ్యాలని అనుకున్నారు గోపాలరెడ్డి, సుధాకర్‌రెడ్డి. 3డి సినిమాలు కొత్తగా వస్తున్న రోజులు కావడంతో ఆ ఫార్మాట్‌పై ప్రేక్షకులు కూడా ఎక్కువ ఆసక్తి కనబరిచేవారు. ఆ ఫార్మాట్‌లోనే సినిమా చెయ్యాలనుకున్నారు. కథ సిద్ధమైంది. క్రాంతికుమార్‌ను దర్శకుడుగా అనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల క్లాప్‌ కొట్టకుండానే సినిమా ఆగిపోయింది. 

బాలకృష్ణతో ‘అశోకచక్రవర్తి’ చిత్రాన్ని నిర్మించిన కోగంటి హరికృష్ణ మళ్ళీ అతనితోనే ‘బాలకృష్ణుడు’ అనే చిత్రాన్ని ఎనౌన్స్‌ చేశారు. అశోకచక్రవర్తి చిత్రానికి దర్శకత్వం వహించిన ఎస్‌.ఎస్‌.రవిచంద్రే ఈ సినిమాకి కూడా దర్శకుడు. కథ సిద్ధం చేశారు. అశోకచక్రవర్తి, ధ్రువనక్షత్రం చిత్రాల కథ ఇంచుమించు ఒకటే. అయితే ఈ రెండు సినిమాలూ ఒకేరోజు విడుదల కావడంతో ఆగ్రహించిన బాలకృష్ణ ‘బాలకృష్ణుడు’ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. 2002లో బాలకృష్ణతో వి.సముద్ర దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్‌ ఓ చిత్రాన్ని ప్రారంభించారు. దేశభక్తి నేపథ్యంలో లవ్‌, సెంటిమెంట్‌, యాక్షన్‌ వంటి ఎలిమెంట్స్‌తో తయారు చేసిన కథ. ఇందులో బాలకృష్ణ కమాండో పాత్ర. పరుచూరి బ్రదర్స్‌ మాటలు రాశారు. మార్చి 8న అక్కినేని నాగేశ్వరరావు క్లాప్‌తో ఈ సినిమా ప్రారంభమైంది. కొద్దిరోజులు షూటింగ్‌ జరుపుకున్న ఈ సినిమా కూడా ఆగిపోయింది. 

భార్గవ్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ గోపాలరెడ్డికి, బాలకృష్ణకి మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు వచ్చాయి. మాతో పెట్టుకోకు తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే బాలకృష్ణతో భారీ లెవల్‌లో ఓ జానపద చిత్రాన్ని ప్రారంభించారు గోపాలరెడ్డి. ఈ సినిమాకి విక్రమసింహ భూపతి అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో మహారాజుగా, యోధుడుగా రెండు పాత్రలు పోషించారు బాలకృష్ణ. రోజా, పూజాభాత్రా ఈ సినిమాలో హీరోయిన్లు. ఈ సినిమా షూటింగ్‌ సగానికి పైగా పూర్తయిన తర్వాత బాలకృష్ణ, గోపాలరెడ్డి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ఈ సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది. ఆ తర్వాత గోపాలరెడ్డి జీవితంలో అంధకారం అలుముకుంది. మొదట అతని భార్య, ఆ తర్వాత గోపాలరెడ్డి, ఆ తర్వాత ఆయన కుమారుడు భార్గవ్‌ చిన్న వయసులోనే చనిపోయారు. 

పౌరాణిక చిత్రాలన్నా, పౌరాణిక పాత్రలన్నా బాలకృష్ణకు ఎంతో మక్కువ అని అందరికీ తెలిసిందే. తండ్రి ఎన్‌టి రామారావు నటించిన ‘నర్తనశాల’ చిత్రాన్ని అదే పేరుతో తన దర్శకత్వంలో తియ్యాలని నిర్ణయించుకున్నారు బాలకృష్ణ. తను అర్జునుడుగా, సౌందర్య ద్రౌపదిగా నటించారు. వారం రోజులపాటు ఈ సినిమా షూటింగ్‌ జరిగింది. ఆ తర్వాత బాలకృష్ణకు యాక్సిడెంట్‌ అవ్వడం, సౌందర్య విమాన ప్రమాదంలో మరణించడంతో ఈ సినిమా ఆగిపోయింది. అంతవరకు తీసిన సన్నివేశాలను ఎడిట్‌ చేసి 16 ఏళ్ళ తర్వాత దాన్ని ఒక షార్ట్‌ ఫిలింగా విడుదల చేశారు బాలకృష్ణ.

నందమూరి బాలకృష్ణ, బి.గోపాల్‌ కాంబినేషన్‌లో లారీ డ్రైవర్‌, రౌడీ ఇన్‌స్పెక్టర్‌, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి బ్లాక్‌బస్టర్స్‌ వచ్చాయి. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లోనే వచ్చిన పలనాటి బ్రహ్మనాయుడు డిజాస్టర్‌ అయింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం కాలేదు. 2011లో బాలకృష్ణ పుట్టినరోజున బి.గోపాల్‌ దర్శకత్వంలో ‘హర హర మహాదేవ’ మొదలైంది. ఈ చిత్రానికి బెల్లంకొండ సురేష్‌ నిర్మాత. ఈ సినిమా ప్రారంభం రోజున అక్కడ పెట్టిన వినైల్స్‌  పెద్ద దుమారాన్ని రేపాయి. బాలకృష్ణ అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఎందుకంటే ఆరోజుల్లోనే విడుదలైన కమల్‌హాసన్‌ సినిమా ‘దశావతారం’ చిత్రంలోని కమల్‌హాసన్‌ ఫోటోలను తీసుకొని దానికి బాలకృష్ణ తలను అడ్జస్ట్‌ చేసి పోస్టర్లు చేయడంతో పెద్ద గొడవే జరిగింది. చివరికి రెగ్యులర్‌ షూటింగ్‌కి వెళ్ళకుండానే ఈ సినిమా ఆగిపోయింది.