English | Telugu

హీరోల కొడుకులు స్టార్‌ హీరోలు అవ్వడం వెనుక అసలు సీక్రెట్‌ ఇదే!

బిజినెస్‌, రాజకీయం, సినిమా.. ఇలా ఏ రంగంలోనైనా వారసత్వం అనేది తప్పకుండా ఉంటుంది. అయితే బిజినెస్‌కిగానీ, రాజకీయానికిగానీ అందచందాలతో పనిలేదు. తెలివితేటలు, ఆ రంగంలో రాణించడానికి కావాల్సిన కొన్ని లక్షణాలు ఉంటే సరిపోతుంది. ఆయా రంగాల్లో ఉన్నత స్థాయికి వెళతారు. కానీ, సినిమా రంగం విషయానికి అది పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ అందంతోపాటు టాలెంట్‌ కావాలి. ప్రేక్షకుల్ని ఆకట్టుకునేంత ఛరిష్మా ఉండాలి. ఇలాంటి లక్షణాలు హీరోలుగా ఎదగాలనుకునే చాలా మందిలో ఉంటాయి. కానీ, కొందరికే సినిమాల్లో రాణించే అవకాశం వస్తుంది, అలా కాకుండా ఇప్పుడు స్టార్‌ హీరోలుగా కొనసాగుతున్న కొందరి విషయంలో వారసత్వమే ఎక్కువగా పనిచేస్తుందనే విషయాన్ని దివంగత డా. దాసరి నారాయణరావు ఒక ఇంటర్వ్యూలో వెల్లడిరచారు. సినిమాల్లో వారసత్వాన్ని సమర్థిస్తారా? అని అడిగిన ప్రశ్నకు ఆయన ఏం సమాధానం చెప్పారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

‘సినిమాల్లో వారసత్వం గురించి చెప్పాలంటే ఆది కొంత వరకు మాత్రమే పనిచేస్తుంది. అంటే మొదటి సినిమా, రెండో సినిమా వరకే. ఆ హీరో తండ్రి పెద్ద హీరో కాబట్టి అతనికి ఉన్న ఫాలోయింగ్‌ వల్ల వీరి సినిమాలు కూడా చూస్తారన్న నమ్మకం ఆయా హీరోలకు ఉండవచ్చు. అయితే అది వారిని హీరోలుగా ఇంట్రడ్యూస్‌ చెయ్యడం వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక సినిమా, రెండు సినిమాలతో ఆపేయడం లేదు. వారికి సినిమా తీసే శక్తి ఉంది కాబట్టి వరసగా సినిమాలు చేసేస్తున్నారు. అంటే ఆయా హీరోలు నిర్మాతలుగా వ్యవహరించకపోయినా వారి ఇన్‌ఫ్లుయెన్స్‌తో నిర్మాతలు వారి కొడుకులతో సినిమాలు చేస్తున్నారు. అలా వరసగా సినిమాలు చేసి ఆ హీరో ఫేస్‌ని ప్రేక్షకులకు బాగా అలవాటు చేసేస్తున్నారు. వారి ఫేస్‌ ఎలా ఉన్నా ప్రేక్షకులకు ఆదరించడం తప్పడం లేదు. ఇప్పుడు స్టార్‌ హీరోలుగా చెప్పుకుంటున్న వారసులు ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి హీరోలు నిలదొక్కుకోవాలంటే మినిమం 10 సంవత్సరాలు పడుతుంది. నా శిష్యుడు మోహన్‌బాబు విషయాన్నే తీసుకుంటే అతను నటుడిగా మంచి పేరు తెచ్చుకోవడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టడం లేదుగానీ టాలెంట్‌ ఉన్న ఎంతో మంది ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేక ఇండస్ట్రీలో రాణించలేకపోతున్నారు, ఈ హీరోలకు బ్యాక్‌గ్రౌండ్‌ ఉంది కాబట్టి స్టార్‌ హీరోలు కాగలిగారు అనేది మాత్రమే చెప్పదలుచుకున్నాను. ‘మీ అబ్బాయికి కూడా హీరోకి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి కదా.. మరి మీరెందుకు ఆయా హీరోల్లా కొడుకుని హీరోగా నిలబెట్టలేకపోయారు’ అని చాలా మంది అడిగారు. నేను ఆ విషయంలో మా అబ్బాయికి సపోర్ట్‌ చెయ్యలేదనే చెప్పాలి. మా అబ్బాయి పాయింట్‌ ఆఫ్‌ వ్యూ నుంచి చూస్తే నేను చేసింది తప్పే. అతనిలో టాలెంట్‌ ఉంది. హీరోగా సక్సెస్‌ సాధించాలనే కసి కూడా ఉంది. నేను అతన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాను. ఇప్పుడున్న హీరోలు నిలదొక్కుకొని స్టార్‌ హీరోలుగా వెలుగుతున్నారంటే వారి తండ్రి హీరో కావడం, వెనక ఉండి వారిని ముందుకు నడిపించడమే అసలు సీక్రెట్‌’ అంటూ వివరించారు డా. దాసరి నారాయణరావు.