English | Telugu
వరప్రసాద్.. నూతన్‌ప్రసాద్‌గా మారడం వెనుక అసలు కథ ఇదే!
Updated : Dec 12, 2025
(డిసెంబర్ 12 నూతన్‌ప్రసాద్ జయంతి సందర్భంగా..)
‘దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు..’ అంటూ ఒక డిఫరెంట్ మాడ్యులేషన్‌తో నూతన్‌ప్రసాద్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ పాపులరే. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్.. ఇలా అన్ని విషయాల్లోనూ తనదైన ప్రత్యేక బాణీ కలిగిన నటుడు నూతన్‌ప్రసాద్. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందిన ఆయన సినీ జీవితం పరిపూర్ణంగా సాగలేదు. కేవలం 16 సంవత్సరాలు మాత్రమే పూర్తి స్థాయి నటుడిగా కొనసాగారు. షూటింగ్‌లో జరిగిన ఓ ప్రమాదం కారణంగా నూతన్‌ప్రసాద్ వీల్ చైర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.
నూతన్‌ప్రసాద్ అసలు పేరు వరప్రసాద్. 1945 డిసెంబర్ 12న కృష్ణాజిల్లా కైకలూరులో జన్మించారు. చదువుకునే రోజుల నుంచే కళల పట్ల ఆయనకు ఎంతో మక్కువ ఉండేది. తరచూ నాటకాలు వేస్తూ తన నటనతో అందర్నీ ఆకట్టుకునేవారు. దాంతో సినిమాల్లోకి వెళ్తే నటుడుగా మరింత పేరు తెచ్చుకోవచ్చు అనే అభిప్రాయంతో 1970 ప్రాంతంలో మద్రాస్ చేరుకున్నారు. అక్కడ కూడా నాటకాలు వేస్తూనే సినిమా ప్రయత్నాలు చేసేవారు. అలా 1973లో అక్కినేని నాగేశ్వరరావు, బాపు కాంబినేషన్‌లో వచ్చిన ‘అందాల రాముడు’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా నటుడిగా మంచి పేరు తెచ్చినప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదు.
రెండు సంవత్సరాలు ఖాళీగా ఉన్న నూతన్‌ప్రసాద్‌కు 1975లో మళ్లీ బాపు దర్శకత్వంలోనే నటించే అవకాశం వచ్చింది. అదే ‘ముత్యాల ముగ్గు’. నిత్య పెళ్లికొడుకుగా ఒక నెగెటివ్ క్యారెక్టర్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయినప్పటికీ ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. ఆ బాధతో మద్యానికి బానిసయ్యారు. అలా మూడు సంవత్సరాలపాటు ఎలాంటి సినిమా ప్రయత్నాలు చెయ్యకుండా తాగుతూనే ఉన్నారు. రాత్రి, పగలు అదే పనిగా తాగడం వల్ల తనకు ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చాయేమోనని హాస్పిటల్‌కి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు నూతన్‌ప్రసాద్. తనకు ఏదైనా జబ్బు ఉంది అని డాక్టర్ చెబితే మద్యాన్ని కంటిన్యూ చేసి త్వరగా చనిపోవాలి, ఏ జబ్బూ లేదని తేలితే మద్యాన్ని వదిలేసి కెరీర్‌పై దృష్టి పెట్టాలి అనుకున్నారు. అన్ని టెస్టులూ చేసిన డాక్టర్ అతనికి ఎలాంటి జబ్బూ లేదని తేల్చాడు.
తాగుడు మానెయ్యాలని ఆ క్షణమే నిర్ణయించుకొని దాన్ని కఠినంగా అమలు చేశారు నూతన్‌ప్రసాద్. పాత జీవితానికి స్వస్తి పలికి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నారు కాబట్టి వరప్రసాద్ అనే పేరులో ‘వర’ స్థానంలో ‘నూతన్’ చేర్చారు. అలా 1978లో వచ్చిన ‘చలిచీమలు’ చిత్రంతో అందరికీ నూతన్‌ప్రసాద్‌గా పరిచయమయ్యారు. 1981 వరకు కొన్ని సినిమాల్లో నటించిన ఆయన 1982 నుంచి బిజీ ఆర్టిస్టు అయిపోయారు. సంవత్సరానికి 10 సినిమాలకు తక్కువ కాకుండా చేసేవారు. 1985లో అత్యధికంగా 22 సినిమాల్లో నటించారు. తను చేసే ప్రతి క్యారెక్టర్‌లోనూ తనదైన ముద్ర కనిపించేలా చూసుకునేవారు.
‘పట్నం వచ్చిన పతివ్రతలు’ చిత్రంలోని ‘దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు’ అనే డైలాగ్, ‘ఇంటింటి రామాయణం’ చిత్రంలో కామెడీగా సాగే హరికథ, బాపు దర్శకత్వంలో వచ్చిన ‘రాజాధిరాజు’ చిత్రంలోని సైతాన్ క్యారెక్టర్‌లో ఆయన నటన,‘కొత్తా దేవుడండీ.. కొంగొత్తా దేవుడండీ..’ అంటూ పాడే కామెడీ సాంగ్ ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. తన కెరీర్‌లో ఇలాంటి గుర్తుండిపోయే క్యారెక్టర్లు చాలా చేశారు నూతన్‌ప్రసాద్. ఎన్టీఆర్, ఎఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి హీరోల నుంచి నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోల వరకు అందరితోనూ కలిసి నటించారు.
రాజేంద్రప్రసాద్‌తో కలిసి ‘బామ్మబాట బంగారు బాట’ చిత్రం చేస్తున్న సమయంలో జరిగిన ప్రమాదం వల్ల నూతన్‌ప్రసాద్ వెన్నెముకకు బలమైన గాయమైంది. దాంతో ఆయన వీల్‌చైర్‌కి పరిమితం కావాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆ తర్వాత కూడా సినిమాల్లో నటించారు. అందాల రాముడు నుంచి బామ్మబాట బంగారు బాట వరకు 100కు పైగా చిత్రాల్లో నటించిన నూతన్‌ప్రసాద్.. ఆ తర్వాత 40కిపైగా సినిమాల్లో వీల్ చైర్‌లో ఉండి నటించడం ఆయన మనోధైర్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తన కెరీర్‌లో ఉత్తమ విలన్‌గా రెండు సార్లు, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రెండు సార్లు నంది అవార్డులు అందుకున్నారు. 2005లో ఎన్.టి.ఆర్. నేషనల్ అవార్డుతో నూతన్‌ప్రసాద్‌ను సత్కరించారు. ఆయన నటించిన చివరి చిత్రం కన్నడలో వచ్చిన ‘శ్రీమతి’. చాలా కాలం అనారోగ్యంతో బాధపడిన నూతన్‌ప్రసాద్.. 2011 మార్చి 30న తుదిశ్వాస విడిచారు.