English | Telugu

శివశంకర్‌ మాస్టర్‌కి ఛాలెంజ్‌గా మారిన ఆ రెండు పాటలు.. ఒకటి 32 రోజులు పట్టింది, మరొకటి 22 రోజులు!

కొన్ని సినిమాలు సూపర్‌హిట్‌ అవుతాయి, ఆడియో పరంగా చూస్తే వీక్‌గా ఉంటుంది. అలా కాకుండా కొన్ని సినిమాలు, అందులోని పాటలు కూడా ప్రేక్షకాదరణ పొందుతాయి. కొన్ని పాటలు తెరపై చూసినపుడు ఎంతో మధురానుభూతిని కలిగిస్తాయి. పాటల కోసమే సినిమాను మళ్ళీ మళ్ళీ చూసేవారు. అప్పట్లో పాటలను ఎంతో ఈజీగా చిత్రీకరించేవారు. ఒక పాటను ఒక్క పూటలో షూట్‌ చేసినవారు కూడా ఉన్నారు. ఆ తర్వాతి రోజుల్లో పిక్చరైజేషన్‌ పరంగా పాటలకు ప్రాధాన్యం పెరిగింది. పాటల చిత్రీకరణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మొదలుపెట్టారు. సాధారణంగా ఉండే డ్యూయెట్‌లను సైతం ఎక్కువ రోజులు చిత్రీకరిస్తున్నారు. అలా కాకుండా కొన్ని సినిమాల్లో స్పెషల్‌ ప్యాట్రన్‌ సాంగ్స్‌ ఉంటాయి. వాటిని షూట్‌ చెయ్యడానికి ఒక కాన్సెప్ట్‌ అనుకుంటారు. దాని ప్రకారమే పాటను తియ్యాల్సి ఉంటుంది. అలాంటి పాట కోసం ఎక్కువ రోజులు కేటాయించాల్సి ఉంటుంది. అలాంటి అనుభవం శివశంకర్‌ మాస్టర్‌ కెరీర్‌లో జరిగింది. ‘అరుంధతి’ చిత్రంలోని ‘భూ భూ భుజంగ..’ పాటను 32 రోజులు తియ్యాల్సి వచ్చింది. అలాగే ‘మగధీర’ చిత్రంలోని ‘ధీర ధీర’ సాంగ్‌ను చిత్రీకరించేందుకు 22 రోజులు పట్టింది.

అనుష్క ప్రధాన పాత్రలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘అరుంధతి’ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో పశుపతిగా నటించిన సోనూ సూద్‌కి చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా క్లైమాకన్సలో హీరోయిన్‌తో బలవంతంగా డాన్స్‌ చేయిస్తాడు పశుపతి. ఈ పాట చిత్రీకరణ శివశంకర్‌ మాస్టర్‌కి ఒక ఛాలెంజ్‌గా మారింది. పాట ఏ ప్యాట్రన్‌లో వుండాలో దర్శకుడు కోడి రామకృష్ణ, నిర్మాత శ్యామ్‌ప్రసాదనరెడ్డి ఒక ఊహాచిత్రాన్ని గీయించి శివశంకర్‌ మాస్టర్‌కి ఇచ్చారు. మామూలు పాటలకు డాన్స్‌ చేయడం కూడా రాని అనుష్కతో ఇలాంటి పాటకు డాన్స్‌ చేంయించాలంటే ఎంతో కష్టంతో కూడుకునన్న పని. అయితే శివశంకర్‌ ఎంతో ఓపికగా అనుష్కకు కొన్ని నృత్యరీతులు, భంగిమలు నేర్పించారు. అలా చాలాకాలం ప్రాక్టీస్‌ చాలా రోజులు కొనసాగింది. ప్రాక్టీస్‌ పూర్తయిన తర్వాత ఆ పాటకు సంబంధించిన కాస్ట్యూమ్స్‌ వేసి చూసుకోవడానికే దాదాపు 10 రోజులు పట్టంది. ఇక దర్శకనిర్మాతలు కోరిన ప్యాట్రన్‌లో పాటను పూర్తి చేయడానికి మొత్తం శివశంకర్‌ మాస్టర్‌కి 32 రోజులు పట్టింది.

ఇక ‘మగధీర’ చిత్రంలోని ‘ధీర ధీర..’ పాట చిత్రీకరణకు 22 రోజులు పట్టింది. సాధారణంగా రాజమౌళి సినిమాల్లోని పాటలు కూడా కొంత డిఫరెంట్‌గానే కనిపిస్తాయి. ఈ పాటను కూడా కొత్తగా ఉండేలా చూడమని శివశంకర్‌ని అడిగారు రాజమౌళి. ఒక పాటను పూర్తి చేయడానికి రెండు మూడు రోజులు టైమ్‌ తీసుకునే శివశంకర్‌ ‘ధీర ధీర’ పాటను కంప్లీట్‌ చెయ్యడానికి 22 రోజులు పట్టింది. ఈ పాటను కొంత భాగం రాజస్థాన్‌లో తీశారు. మరో ప్రాంతంలో ఉప్పు మాత్రమే ఉంటుంది. అక్కడ కొంతభాగం చిత్రీకరించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో సెట్‌ వేసి డాన్సర్లతోపాటు రామ్‌చరణ్‌, కాజల్‌లపై 15 రోజులపాటు ఈ పాటను తీశారు. ఇదే పాటకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా శివశంకర్‌ మాస్టర్‌కి జాతీయ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.