Read more!

English | Telugu

ఎన్నో సూపర్‌హిట్స్‌ అందించిన అన్నపూర్ణ బేనర్‌ అక్కినేనిది కాదా?

చిరకాల మిత్రులు... సినిమా రంగంలో ఈ మాట మనం ఎక్కువగా వింటూ వుంటాం. సమాజంలో చిరకాల స్నేహితులు అనేవారు చాలా మంది వుంటారు. కానీ, సినిమా రంగంలో అలాంటి పేరు తెచ్చుకున్న స్నేహితుల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే ఈ చిరకాల మిత్రుల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఒకరు హీరో, మరొకరు నిర్మాత.. వీరిద్దరి ప్రయాణం దశాబ్దాలపాటు కొనసాగింది. వీరి నుంచి ఎన్నో అపురూపమైన, అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు పెద్ద విజయాల్ని అందుకున్నాయి. వారే నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ పిక్చర్స్‌ దుక్కిపాటి మధుసూదనరావు. వీరి కాంబినేషన్‌కి ఒక ప్రత్యేకత ఉంది. 

అన్నపూర్ణ పిక్చర్స్‌ అంటే అక్కినేని.. అక్కినేని అంటే అన్నపూర్ణ పిక్చర్స్‌.. ఈ బేనర్‌లో అక్కినేని ఎక్కువ సినిమాలు చేయడం వల్ల అది అక్కినేని సొంత బేనర్‌ అని, అన్నపూర్ణ.. అక్కినేని భార్య పేరు అనుకునేవారు. కానీ, అది దుక్కిపాటి మధుసూదనరావు తల్లిపేరు. వాస్తవానికి దుక్కిపాటి తల్లి పేరు గంగాజలం. ఆమె చనిపోయిన తర్వాత సవతి తల్లి అన్నపూర్ణ తల్లి కంటే ప్రేమగా దుక్కిపాటిని పెంచి పెద్ద చేసింది. ఆమెపై ఉన్న ప్రేమతోనే తన సంస్థకి అన్నపూర్ణ పిక్చర్స్‌ అనే పేరు పెట్టారు. ఆ సంస్థకు అక్కినేనిని ఛైర్మన్‌గా చేసి భాగస్వామ్యం ఇచ్చారు. 

గుడివాడ దగ్గర పెయ్యేరులో జన్మించిన మధుసూదనరావు.. మచిలీపట్నంలోని నోబుల్‌ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్‌ చేస్తూనే ఎక్సెల్షియర్‌ అనే నాటక సంస్థ స్థాపించారు. ఆత్రేయ, బుధ్ధరాజు, అక్కినేని అందులో సభ్యులుగా ఉండేవారు. అక్కినేని అప్పటికే 1941లో ‘ధర్మపత్ని’ చిత్రంలో చిన్న పాత్రలో నటించి వెనక్కి వచ్చేశారు. ఆ తర్వాత నాటకాల్లో స్త్రీ పాత్రలు వేస్తున్న సమయంలో ఘంటసాల బలరామయ్య ‘సీతారామ జననం’తో బ్రేక్‌ ఇచ్చారు. అక్కినేని తప్పకుండా పెద్ద హీరో అవుతాడని నమ్మినవారిలో దుక్కిపాటి మొదటివారు. అందుకే అప్పటి నుంచి అన్ని విషయాల్లోనూ అక్కినేని వెన్నుదన్నుగా నిలిచారు. అక్కినేని హీరోగా ఎదిగేందుకు ఎన్నో రకాలుగా కృషి చేశారు. తన అన్నపూర్ణ పిక్చర్స్‌ బేనర్‌లో చేసిన సినిమాలన్నీ దాదాపు అక్కినేనితోనే నిర్మించారంటే వారి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉండేదో అర్థం చేసుకోవచ్చు. దుక్కిపాటి మధుసూదనరావు నిర్మాతగానే కాకుండా మంచి కథకుడుగా పేరు తెచ్చుకున్నారు. ఒక మంచి కథను అంతకంటే మంచి స్క్రీన్‌ప్లేతో దాన్ని డెవలప్‌ చేయడంలో సిద్ధహస్తుడనే పేరు తెచ్చుకున్నారు దుక్కిపాటి.  

అన్నపూర్ణ పిక్చర్స్‌ బేనర్‌పై తొలి ప్రయత్నంగా నిర్మించిన సినిమా ‘దొంగరాముడు’. 1955లో ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఇదే బేనర్‌లో తోడికోడళ్ళు, మాంగల్యబలం, వెలుగునీడలు, ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్‌ చక్రవర్తి, ఆత్మగౌరవం, పూలరంగడు, విచిత్రబంధం, ప్రేమలేఖలు, రాధాకృష్ణ, పెళ్లీడు పిల్లలు, అమెరికా అబ్బాయి వంటి అద్భుతమైన చిత్రాలెన్నో దుక్కిపాటి నిర్మించారు. నిర్మాతగా రాణించాలనే వారికి సినిమాలపై మంచి అవగాహన ఉండాలి. తనకంటూ ఒక అభిరుచి ఉండాలి. అలా ఉన్నప్పుడే ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించగలుగుతారు. దుక్కిపాటి అభిరుచి, అక్కినేని అభినయం వెరసి.. అద్భుతమైన సినిమాలను ఆవిష్కరించే అవకాశం ఇద్దరికీ లభించింది. కళాతపస్వి కె.విశ్వనాథ్‌కి దర్శకుడుగా ‘ఆత్మగౌరవం’ చిత్రంతో తొలి అవకాశం ఇచ్చారు దుక్కిపాటి. 

కథ, కథనాల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకునేవారో.. పాటల విషయంలోనూ అదే పద్ధతిని అనుసరించేవారు. తమ బేనర్‌లో వచ్చే సినిమాల్లోని పాటలు మధురంగా ఉండేందుకు పాటల రచయితలకు, సంగీత దర్శకులకు ఎంతో స్వేచ్ఛనిచ్చేవారు. వారి నుంచి మంచి పాటలు రావడానికి ఎంతో కృషి చేసేవారు. ‘పాడవేల రాధికా..’, ‘పాడెద నీ నామమే గోపాలా..’, ‘పాడమని నన్నడగ తగునా..’, ‘నీవు రావు నిదుర రాదు..’, ‘మదిలో వీణలు మ్రోగే..’ వంటి పాటలు ఆబాల గోపాలన్నీ అలరించాయి. ఈ పాటలన్నీ పి.సుశీల ఆలపించడం విశేషం. 

అన్నపూర్ణ పిక్చర్స్‌ అనే సంస్థ నుంచి సినిమా వస్తోందంటే.. అప్పట్లో ఒక సంచలనం. ఆ సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఎదురుచూసేవారు. ఆ సంస్థలో సినిమాలు చెయ్యాలని నటీనటులు ఉవ్విళ్ళూరే వారు. ఎందుకంటే ఆ బేనర్‌లో ఒక్క సినిమా చేసినా ఎంతో పేరు వచ్చేది. అలాంటి కథాంశాలను ఎంపిక చేసుకోవడంలో సంస్థకు అంత మంచి పేరు వుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలుగు సినిమాలకు వివిధ శాఖల్లో అవార్డులు అందించేందుకు నిర్ణయం తీసుకుంది. అలా 1964లో విడుదలైన ‘డాక్టర్‌ చక్రవర్తి’ మొట్టమొదటి నంది అవార్డును అందుకుంది. ఉత్తమ చిత్రంగా బంగారు నందిని గెలుచుకుందీ చిత్రం.  అన్నపూర్ణ బేనర్‌లో నిర్మించిన తోడి కోడళ్లు, మాంగల్య బలం, డాక్టర్‌ చక్రవర్తి జాతీయ అవార్డులను గెలుచుకున్నాయి. అలాగే ఆత్మ గౌరవం, ఆత్మీయులు,  అమాయకురాలు చిత్రాలు నంది అవార్డులు సాధించాయి. అంతేకాదు నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చేసిన సేవను గుర్తించి రఘుపతి వెంకయ్య అవార్డును అందించింది ప్రభుత్వం. 

చదువుకునే రోజుల నుంచే అక్కినేని, దుక్కిపాటి మధ్య స్నేహం మొదలైంది. కలిసి నాటకాలు వేశారు, కలిసి సినిమాలు తీశారు. ఒకరు హీరోగా, ఒకరు నిర్మాతగా ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. చివరి శ్వాస వరకు తమ స్నేహంలో ఎలాంటి అపశృతులకు, అపార్థాలకు తావు ఇవ్వలేదు అక్కినేని, దుక్కిపాటి. అక్కినేని కెరీర్‌ ప్రారంభం నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు చేయడానికి మూల కారణం దుక్కిపాటి. సొంత అన్నదమ్ముల కంటే మిన్నగా తమ స్నేహాన్ని కొనసాగించిన అక్కినేని, దుక్కిపాటి ధన్యులనే చెప్పాలి.