Read more!

English | Telugu

ఒకే కథతో తెలుగులో నాలుగు, తమిళ్‌లో ఒకటి, హిందీలో రెండు సినిమాలు.. నిజంగా విచిత్రమే!

ఒక కథతో తీసిన సినిమా సూపర్‌హిట్‌ అయితే దాన్ని ఇతర భాషల్లో రీమేక్‌ చేయడం మనం చూస్తుంటాం. అలా కాకుండా ఒకే కథతో పలుమార్లు సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఇండస్ట్రీలో ఉన్నాయి. అలాంటి వాటిలో ‘ఎంగ చిన్న రస’ చిత్రం ఒకటి. కన్నడ రచయిత బి.పుట్టస్వామయ్య రచించిన ‘అర్థాంగి’ అనే నవల ప్రేరణతో కె.భాగ్యరాజా తయారు చేసిన కథతో తమిళ్‌లో రూపొందింది ‘ఎంగచిన్న రస’. ఈ చిత్రానికి కె.భాగ్యరాజా దర్శకత్వం వహించారు. భాగ్యరాజా, రాధ జంటగా నటించారు. ఈ సినిమా తమిళ్‌లో పెద్ద హిట్‌ సినిమాగా నిలిచింది. ఈ చిత్రాన్ని ‘చిన్నరాజా’ పేరుతో తెలుగులోకి డబ్‌ చేశారు. తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. ఈ కథతో హిందీలో అనిల్‌కపూర్‌, మాధురి దీక్షిత్‌ జంటగా ‘బేటా’ పేరుతో రూపొందింది. అక్కడ కూడా ఈ సినిమా సూపర్‌హిట్‌ అయింది. ఆ తర్వాత ‘బేటా’ చిత్రం రైట్స్‌ తీసుకొని తెలుగులో వెంకటేష్‌, మీనా జంటగా ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో ‘అబ్బాయిగారు’ పేరుతో రూపొందించారు. తెలుగులో కూడా ఈ సినిమా ఘనవిజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులు ‘చిన్నరాజా’ చిత్రాన్ని చూసి పెద్ద హిట్‌ చేసినప్పటికీ అదే కథతో రూపొందిన ‘అబ్బాయిగారు’ చిత్రాన్ని కూడా పెద్ద హిట్‌ చేశారు. ఇదే కథతో కన్నడలో ‘అన్నయ్య’ పేరుతో డి.రాజేంద్రబాబు దర్శకత్వంలో రూపొందింది. కన్నడలో కూడా సూపర్‌ హిట్‌ అయ్యింది. ఇలా ఒకే కథతో రూపొందిన ఈ సినిమాలన్నీ విజయం సాధించడం విశేషం. 

అలాంటి ఓ విచిత్రం మరో సినిమా విషయంలోనూ జరిగింది. అదే వి.మధుసూదనరావు దర్శకత్వంలో రూపొందిన ‘ప్రేమలు పెళ్ళిళ్ళు’ చిత్రం. మాదిరెడ్డి సులోచన కథతో ఈ చిత్రం రూపొందింది. ఎఎన్నార్‌, జయలలిత, శారద ప్రధాన పాత్రల్లో నటించారు.  పెళ్ళయిన తర్వాత భర్తను వదిలేసి వెళ్ళిపోతుంది భార్య. అదీ కథలోని ప్రధానాంశం. ఎఎన్నార్‌లాంటి హీరోని భార్య వదిలేసి వెళ్ళిపోవడం అనే పాయింట్‌ జనానికి నచ్చలేదు. దీంతో సినిమా ఫ్లాప్‌ అయింది. ఆ తర్వాత ఇదే కథను ప్రేరణగా తీసుకొని రైట్స్‌ తీసుకోకుండా హిందీలో ‘అప్నా అప్నా’ అనే సినిమా చేశారు. ఆ పాయింట్‌ని హిందీలో బాగా రిసీవ్‌ చేసుకున్నారు. సినిమా పెద్ద హిట్‌ అయింది. ఆ సినిమా రైట్స్‌ తీసుకొని అట్లూరి పూర్ణచంద్రరావు తెలుగులో శోభన్‌బాబు, శ్రీదేవి, జయసుధ ప్రధాన పాత్రల్లో ‘ఇల్లాలు’ అనే సినిమా తీశారు. అది చాలా పెద్ద హిట్‌ అయింది. ఈ కథనే కొద్దిగా మార్పులు చేసి పంజు అరుణాచలం తమిళ్‌లో రజినీకాంత్‌తో తీశారు. ఆ సినిమా రైట్స్‌ తీసుకొని రాశి మూవీస్‌ నరసింహారావు ‘బావామరదళ్లు’ పేరుతో తెలుగులో రీమేక్‌ చేశారు. సూపర్‌ డూపర్‌హిట్‌ అయింది. ఇదే సినిమాని నిర్మాత ఎం.అర్జునరాజు.. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘సుహాగన్‌’ పేరుతో హిందీలో చేశారు. అక్కడ కూడా సూపర్‌హిట్‌ అయ్యింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు ఎస్‌.వి.కృష్ణారెడ్డి ‘బావామరదళ్ళు’ రైట్స్‌ తీసుకొని రాజశేఖర్‌, రమ్యకృష్ణ జంటగా ‘దీర్ఘ సుమంగళీభవ’ అనే సినిమా తీశారు. ఈ సినిమాకి కూడా మంచి పేరు వచ్చింది. 

ఇలా ఒక కథను తీసుకొని పలు భాషల్లో పలు మార్లు సినిమాలు చేసినా దాదాపు అన్ని భాషల్లో సినిమా సూపర్‌హిట్‌ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. విచిత్రం ఏమిటంటే మాదిరెడ్డి సులోచన రాసిన కథ భాష భాషకీ మార్పులు చెందుతూ వెళ్లింది. అలా ఒకే కథతో తెలుగులో నాలుగు సినిమాలు, తమిళ్‌లో ఒక సినిమా, హిందీలో రెండు సినిమాలు రూపొందాయి. నిజానికి ఇది మాదిరెడ్డి సులోచన కథే అయినా ఎన్నో మార్పులు చెందిన కారణంగా భాష భాషకూ రచయితల పేర్లు మారుతూ వచ్చాయి. సినిమా ఇండస్ట్రీలో ఇలా ఒకే కథతో.. తీసిన భాషల్లోనే మళ్లీ మళ్లీ సినిమాలు తీయడం అనేది బహుశా ఎప్పుడూ జరిగి ఉండదు.