Read more!

English | Telugu

అన్నపూర్ణ స్టూడియోస్‌ను మోసం చేసి ‘శివ’తో డైరెక్టర్‌ అయిన రామ్‌గోపాల్‌వర్మ!

తెలుగు సినిమా గతిని మార్చిన సినిమా ‘శివ’. టాలీవుడ్‌ని కొత్త పుంతలు తొక్కించిన ‘శివ’. డైరెక్టర్‌ అనే వాడికి క్రేజ్‌ని తీసుకొచ్చిన ‘శివ’. తెలుగు సినిమాల్లో కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసిన ‘శివ’.. ఇలా రామ్‌గోపాల్‌వర్మ ఫస్ట్‌ టైమ్‌ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన ‘శివ’ సినిమా గురించి గత 35 సంవత్సరాలుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈ సినిమా సాధించిన ఘనవిజయం తెలుగు సినిమాకి ఒక కొత్త దారిని చూపించింది. టెక్నికల్‌ స్టాండర్డ్స్‌ గురించి సాధారణ ప్రేక్షకులు కూడా మాట్లాడుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించాడు వర్మ. ‘శివ’కి ముందు ‘రావుగారిల్లు’, ‘కలెక్టర్‌గారి అబ్బాయి’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాడు వర్మ. ఆ సమయంలోనే నాగార్జునతో సాన్నిహిత్యం ఏర్పడిరది. దర్శకుడిగా బ్రేక్‌ ఇస్తానని నాగార్జున పలుమార్లు వర్మతో చెప్పేవాడు. నాగార్జునతో త్వరగా సినిమా తీసెయ్యాలి.. రేపే షూటింగ్‌ మొదలు పెట్టెయ్యాలన్న ఉత్సాహం వర్మలో ఉండేది. కానీ, సరైన అవకాశం రాలేదు. అన్నపూర్ణ స్టూడియోస్‌ అధినేతలైన అక్కినేని వెంకట్‌, యార్లగడ్డ సురేంద్రలను మోసం చేయడం ద్వారా ‘శివ’ చిత్రం చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు వర్మ. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో తనే స్వయంగా తెలియజేశాడు. మరి ‘శివ’ సినిమా ఎలా మొదలైంది.. ఈ ప్రాజెక్ట్‌ కోసం వర్మ ఎలాంటి ఎత్తులు వేశాడు అనేది అతని మాటల్లోనే తెలుసుకుందాం.

‘రావుగారిల్లు, కలెక్టర్‌ గారి అబ్బాయి సినిమాలకు డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తుండడం వల్ల అక్కినేని నాగేశ్వరరావుగారు, నాగార్జున, వెంకట్‌, సురేంద్ర.. వీళ్ళతో చాలా క్లోజ్‌గా మూవ్‌ అయ్యేవాడిని. నేనంటే వాళ్ళకు మంచి ఇంప్రెషన్‌ ఉండేది. నాకు డైరెక్టర్‌గా బ్రేక్‌ ఇవ్వాలని ముగ్గురూ అనుకునేవారు. అయితే అది ఎప్పుడు, ఎన్నాళ్ళకు, ఎన్నేళ్ళకు అనేది తెలీదు. ఆ సమయంలో నేను ఒక అవకాశాన్ని క్రియేట్‌ చేసుకున్నాను. బి.గోపాల్‌ డైరెక్షన్‌లో నాగార్జున చేసిన కలెక్టర్‌గారి అబ్బాయి రిలీజ్‌ అయి హిట్‌ అయిపోయింది. ఆ సినిమా తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌కి కోదండరామిరెడ్డిగారి డేట్స్‌ ఉన్నాయి. నాగార్జునతో నెక్స్‌ట్‌ సినిమా చెయ్యాలి. దాని కోసం నేను, గణేష్‌ పాత్రో, కోదండరామిరెడ్డి కలిసి స్టోరీ డిస్కషన్స్‌లో పాల్గొన్నాం. అప్పటికి కోదండరామిరెడ్డిగారు చాలా బిజీ. స్టోరీ వినే టైమ్‌ కూడా ఆయనకు లేదు. ఆ టైమ్‌ మేమే స్టోరీ ఫైనల్‌ చేశాం. దాన్ని నాగేశ్వరరావుగారికి వినిపించాలి. దానికి నన్ను పంపారు. నేను హైదరాబాద్‌ వచ్చి మేం అనుకున్న కథని యాజ్‌ ఇటీజ్‌గా చెప్పకుండా అటు, ఇటు మార్చి చెప్పాను. నా ఇంటెన్షన్‌ ఏమిటంటే ఆయనకు స్టోరీ నచ్చకూడదు అని. నేను అనుకున్నట్టుగానే ఆయనకు స్టోరీ నచ్చలేదు. అయితే అప్పట్లో సెల్‌ఫోన్లు లేవు. ల్యాండ్‌ లైన్‌ నుంచి ఫోన్‌ చేసి కోదండరామిరెడ్డికి నాగేశ్వరరావుగారు చెప్పే అవకాశం లేదు. అందుకే స్టోరీ నచ్చలేదని చెప్పమని నన్ను చెన్నయ్‌ పంపారు. నేను వెళ్లి నాగేశ్వరరావుగారికి స్టోరీ నచ్చలేదని సురేంద్రకి చెప్పాను. దీంతో చేద్దామనుకున్న సినిమాకి కథ లేకుండా అయిపోయింది. నాగార్జున డేట్స్‌ రెండు నెలలు ఖాళీగా ఉన్నాయి. 

ఇదే మంచి టైమ్‌ అని భావించిన నేను. నాగార్జున దగ్గరికి వెళ్ళి నాగేశ్వరరావుగారికి కథ నచ్చలేదన్న విషయాన్ని చెప్పి.. ఎలాగూ నాకు బ్రేక్‌ ఇద్దామనుకుంటున్నావు కదా.. నా కథ ఆల్రెడీ విన్నావు. నీ డేట్స్‌ కూడా ఖాళీగా ఉన్నాయి. నాతోనే సినిమా చెయ్యొచ్చు కదా అని అడిగాను. అప్పుడే సురేంద్ర కూడా వచ్చాడు. రాముతో సినిమా చేసేద్దాం అని నాగ్‌ అనడంతో, ఆయన కూడా సరే అన్నారు.  సురేంద్ర, నాగార్జున ఇద్దరూ ఒప్పుకున్నారు. మిగిలింది వెంకట్‌. అతన్ని కూడా ఒప్పిస్తే.. సినిమా పట్టాలెక్కేసినట్టే. వెంకట్‌కి కూడా నామీద మంచి ఇంప్రెషనే ఉంది. ఆరోజు వెంకట్‌ లేరు. రాత్రికి గానీ రాలేదు. వచ్చిన తర్వాత నాతో సినిమా చేసేందుకు నాగార్జున, సురేంద్ర డిసైడ్‌ అయ్యారని చెప్పాను. అయినా సినిమా చెయ్యాలనుకున్నప్పుడు ముగ్గురూ కలిసి డెసిషన్‌ తీసుకోవాలి కాబట్టి ఆ ముగ్గుర్ని ఒకచోట చేర్చి నా ప్రాజెక్ట్‌ గురించి చెప్పాను. అందరూ ఓకే అన్నారు. అదే టైమ్‌లో కోదండరామిరెడ్డిగారికి సినిమా లేదనే విషయాన్ని చెప్పమని సురేంద్రకి చెప్పాను. ప్రస్తుతం కథ ఓకే కాలేదు కాబట్టి తర్వాత చేద్దాం అని కోదండరామిరెడ్డిగారికి చెప్పాడు సురేంద్ర. ఆయన కూడా సరేనన్నారు. అలా ‘శివ’ సినిమా స్టార్ట్‌ అయింది. అయితే మోసం చేయడం ద్వారా ఈ అవకాశం వచ్చిందని అందరూ అనుకోవచ్చు. కానీ, నేను ఆడిరది మైండ్‌ గేమ్‌.. దాన్ని లౌక్యం అనీ.. రకరకాలుగా అంటారు. కానీ, నాకు అది తప్ప వేరే దారిలేదు. ఎందుకంటే వారికి స్టోరీ చెప్పేసి కూర్చుంటే సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందో తెలీదు. మూడేళ్ళు, నాలుగేళ్ళు పట్టొచ్చు. అప్పటికి ట్రెండ్‌ మారిపోవచ్చు. ఆ టైమ్‌లో నేను అలాంటి డెసిషన్‌ తీసుకోకపోతే ‘శివ’ అనే సినిమాయే వచ్చి ఉండేది కాదు.   ఇన్ని కారణాల దృష్ట్యా సినిమా చేసే అవకాశాన్ని నేనే క్రియేట్‌ చేసుకున్నాను’ అంటూ వివరించారు రామ్‌గోపాల్‌వర్మ.