Read more!

English | Telugu

దర్శకనిర్మాతలు వెంటపడి మరీ చేయించిన ఆ క్యారెక్టర్‌ జయచిత్ర కెరీర్‌లోనే ది బెస్ట్‌ అయ్యింది!

నటీనటులకు కొన్ని క్యారెక్టర్స్‌ అనుకోకుండా లభిస్తాయి. ఆ క్యారెక్టర్స్‌ చేసిన తర్వాత వారి కోసమే అలాంటి క్యారెక్టర్స్‌ క్రియేట్‌ చేశారా అనిపిస్తుంది. వందల సినిమాల్లో నటించినా కొన్ని క్యారెక్టర్స్‌ ఆయా నటీనటులకు జీవితాంతం గుర్తుండిపోతాయి. ప్రేక్షకుల మనసుల్లో కూడా ఆ క్యారెక్టర్‌ నిలిచిపోతుంది. అలాంటి ఓ అద్భుతమైన క్యారెక్టర్‌ జయచిత్ర కెరీర్‌లో ఆమెకు లభించింది. వెంకటేష్‌, మీనా జంటగా ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో రాశి మూవీస్‌ నరసింహారావు నిర్మించిన చిత్రం ‘అబ్బాయిగారు’. ఈ చిత్రంలో జయచిత్ర చేసిన నాగమణి క్యారెక్టర్‌ ప్రతి ఒక్కరికీ గుర్తుంటుంది. 

1975లో శోభన్‌బాబు హీరోగా నటించిన సోగ్గాడు చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది జయచిత్ర. అంతకుముందే తమిళ్‌లో 40 సినిమాలకుపైగా నటించి అక్కడ బిజీ హీరోయిన్‌ అయిపోయింది. తమిళ్‌లో, తెలుగులో హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించినా ఎప్పుడూ నెగెటివ్‌ క్యారెక్టర్‌ చెయ్యని జయచిత్రకు ‘అబ్బాయిగారు’ చిత్రంలో నెగెటివ్‌ క్యారెక్టర్‌ చేసే అవకాశం వచ్చింది. 

మొదట ఈ సినిమా గురించి నిర్మాత నరసింహారావు.. జయచిత్రను సంప్రదించి తమ సినిమాలోని క్యారెక్టర్‌ చెయ్యాల్సిందిగా అడిగారు. విని ఊరుకున్న జయచిత్ర ఆ తర్వాత దాని గురించి మరచిపోయారు. తెలుగులో జయచిత్రను హీరోయిన్‌గా పరిచయం చేసిన రామానాయుడు ఫోన్‌ చేసి ‘నరసింహారావు సినిమాలో క్యారెక్టర్‌ చెయ్యమంటే బెట్టు చేస్తున్నావట. చాలా మంచి క్యారెక్టర్‌. చేస్తే బాగుంటుంది’ అని చెప్పారు. ఆయన చెప్పిన మాట కూడా విని చేస్తాననిగానీ, చెయ్యను అని గానీ చెప్పలేదు. మరొకరోజు మురళీమోహన్‌ ఫోన్‌ చేసి అదే మాట చెప్పారు. ఇంతమంది చెబుతున్నారంటే ఆ క్యారెక్టర్‌లో ఏదో విశేషం ఉందని భావించిన జయచిత్ర సినిమా చెయ్యడానికి ఒప్పుకుంది. ఇవివి చెప్పిన కథ అంతా విన్న ఆమెకు క్లైమాక్స్‌ బాగా కనెక్ట్‌ అయిందట. దాని కోసం సినిమా చేస్తానని అన్నారు. 

అలా మొదలైన ‘అబ్బాయిగారు’లో జయచిత్ర క్యారెక్టర్‌ సినిమాకే హైలైట్‌ అయిపోయింది. సినిమా చాలా పెద్ద హిట్‌ అయ్యింది, నాగమణి క్యారెక్టర్‌ పోషించిన జయచిత్రకు చాలా మంచి పేరు వచ్చింది. వాణిశ్రీ, జమున వంటి సీనియర్‌ హీరోయిన్లు జయచిత్రను ప్రత్యేకంగా అభినందించారు. జయచిత్ర తప్ప ఆ క్యారెక్టర్‌లో మరొకరు సూట్‌ అవ్వరన్న ఉద్దేశంతో ఆమెతోనే చెయ్యాలని వెయిట్‌ చేసి ఆమె ఓకే అన్న తర్వాతే సినిమా స్టార్ట్‌ చేశామని ఓ సందర్భంలో ఇవివి చెప్పారు. అలా కొన్ని క్యారెక్టర్స్‌ కొంత మంది ఆర్టిస్టుల కోసమే అన్నట్టు ఉంటాయని జయచిత్ర చేసిన క్యారెక్టర్‌ చూస్తే అర్థమవుతుంది.