Read more!

English | Telugu

ఆ కారణంతోనే మేనత్త కూతుర్ని కాదని బయటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న అక్కినేని!

నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు జీవితంలో జరిగిన కొన్ని విచిత్రమైన సంఘటనల్లో ఆయన పెళ్లి కూడా ఒకటి. అక్కినేని కుటుంబంలో చదువుకున్నవారు ఎవరూ లేరు. ఆయన సోదరులు కూడా చదువుకోలేదు. అప్పటికే పాతిక ఎకరాల భూమిని కలిగి వున్న ఆ కుటుంబంలో ఎఎన్నార్‌ చదువుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ, తమ కుటుంబంలో చదువుకున్నవారు లేరు కాబట్టి అక్కినేనిని కూడా చదివించడం వృధా అని భావించింది ఆయన తల్లి. చిన్న చిన్న నాటకాలు వేస్తూ పేరు తెచ్చుకుంటున్నాడు కాబట్టి అందులోనే పేరు తెచ్చుకుంటాడేమోనని నాటకాలను ప్రదర్శించే వ్యక్తికి ఎఎన్నార్‌ను అప్పగించారు. అలా మొదటి నాటకం ద్వారా అర్థ రూపాయి సంపాదించారు అక్కినేని.

ఆ తర్వాత విజయవాడ రైల్వే స్టేషన్‌లో  ఘంటసాల బలరామయ్య.. అక్కినేని చూడడం.. సినిమాల్లో అవకాశం ఇస్తాను రమ్మనడం జరిగిపోయింది. మద్రాస్‌ ప్రయాణానికి రెడీ అవుతున్న సమయంలో అక్కినేని తల్లికి ఒక ఆలోచన వచ్చింది. వెళ్లేది సినిమాల్లోకి, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో, తన బిడ్డ చెడు సావాసాలు పడతాడేమోనని భయపడి పెళ్లి చేసేసి పంపిస్తే మరో అమ్మాయి జోలికి వెళ్లడు అనుకుంది. అక్కినేని చిన్నతనం నుంచే అతని మేనత్త కూతుర్ని ఇచ్చి చెయ్యాలని అనుకున్నారు. తన అన్నయ్య కూతురే కావడంతో విషయం అతనికి చెప్పింది అక్కినేని తల్లి.  అప్పటికి ఎఎన్నార్‌ వయసు 19 సంవత్సరాలు, ఆ అమ్మాయి వయసు 15 సంవత్సరాలు. కొడుకు గురించి బాధ పడుతున్న తల్లిని చూసి ఆమె అన్నయ్య, అక్కినేని మేనమామ ఓ మాట అన్నాడు.. ‘అబ్బాయి తల్లివి అయి వుండి నువ్వే అంత భయపడితే.. సినిమా వాడికి పిల్లనివ్వాల్సిన నేనెంత ఆలోచించాలి’ అన్నాడు. ఆ సమయంలో అక్కినేని ‘అప్పుడే నాకు పెళ్లేంటి.. నేను జీవితంలో ఇంకా స్థిరపడలేదు. మద్రాసు వెళుతున్నాను.. అక్కడ అవకాశాలు వస్తాయో రావో కూడా నాకు తెలీదు. కాబట్టి ఇప్పట్లో నాకు పెళ్లి తలపెట్టకండి’ అన్నారు. అంతలోనే తల్లి తన గురించి మనసులో ఏమనుకుంటుందో గ్రహించిన అక్కినేని ‘నీ మీద ఒట్టువేసి చెబుతున్నాను. ఎలాంటి చెడ్డ పనులు అక్కడ నేను చేయను. నన్ను నమ్ము’ అని తల్లికి మాట ఇచ్చారు. 

1944లో ‘సీతారామ జననం’ చిత్రంతో పూర్తి స్థాయి కథానాయకుడిగా చిత్రపరిశ్రమలో ప్రవేశించారు అక్కినేని. ఆ తర్వాత మరో ఐదు సినిమాల్లో హీరోగా నటించిన తర్వాత 1949 ఫిబ్రవరి 18న అన్నపూర్ణను వివాహం చేసుకున్నారు. సినిమాల్లోకి వెళ్లాడన్న కారణంతోనే మేనమామ తన కూతుర్ని ఇచ్చి చేసేందుకు ఇష్టపడలేదట. అందుకే బయటి అమ్మాయిని చేసుకున్నారు అక్కినేని. విశేషం ఏమిటంటే అక్కినేని కెరీర్‌లో గొప్ప సినిమాగా చెప్పుకునే ‘కీలుగుర్రం’ చిత్రం 1949 ఫిబ్రవరి 19న విడుదలైంది. అంతకుముందు రోజే అక్కినేని వివాహం జరిగింది. 

తన కెరీర్‌లో 250కి పైగా సినిమాల్లో నటించినప్పటికీ తల్లికి ఇచ్చిన మాటను అక్కినేని మరచిపోలేదు. ఏరోజూ హీరోయిన్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు. ఎవరితోనూ ఎఫైర్లు పెట్టుకోలేదు. ‘సినిమాల్లో ఉన్నవారంతా చెడ్డవారు కాదు. ఒక్కరు తప్పు చేసినా సినిమా వాళ్ళందర్నీ తప్పుబడతారు. ఎందుకంటే ఈ ఫీల్డ్‌ అటువంటిది ’ అనేవారు డా.అక్కినేని నాగేశ్వరరావు.