Read more!

English | Telugu

మేం ముగ్గురం అన్నదమ్ములం అని రామారావుగారు చెప్పడం నన్ను కదిలించింది : కాంతారావు

పాత తరం హీరోల్లో నటరత్న నందమూరి తారక రామారావుని క్రమశిక్షణకు, మంచితనానికి మారు పేరుగా చెబుతారు. దర్శకనిర్మాతల పట్ల, తోటి నటీనటుల పట్ల ఆయన కనబరిచే ప్రేమానురాగాలు ఎంత గొప్పగా ఉంటాయనే విషయాన్ని గతంలో ఎంతో మంది ప్రస్తావించారు. అలాంటి ఓ ఆసక్తికరమైన సంఘటన అలనాటి కథానాయకుడు కాంతారావు విషయంలోనూ జరిగింది. కాంతారావు చివరి రోజుల్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలియజేశారు. ఆ సంఘటన గురించి ఆయన మాటల్లోనే..

‘భారతీయ సంస్కృతికి అద్దం పట్టే గొప్ప పౌరాణిక చిత్రం ‘లవకుశ’. ఈ చిత్రంలో రామారావుగారు శ్రీరాముడిగా, అంజలీదేవిగారు సీతగా, నేను లక్ష్మణుడిగా నటించాము. అయితే అప్పటికి ఇంకా షూటింగ్‌ ప్రారంభం కాలేదు. కొన్ని రోజుల తర్వాత షూటింగ్‌ ప్రారంభించే సమయానికి నాకు ఇస్నోఫీలియా వచ్చింది. దాంతో నా పర్సనాలిటీ బాగా వీక్‌ అయిపోయింది. షూటింగ్‌ ప్రారంభమైంది. అప్పుడు షాట్‌లో నటిస్తున్న వారందరికీ వారి క్యారెక్టర్ల పేరుతో డైలాగ్‌ పేపర్స్‌ ఇచ్చారు. నాకు మాత్రం కాంతారావు అని పేరు రాసి డైలాగ్‌ పేపర్‌ ఇచ్చారు. అలా ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. నేను చెప్పాల్సిన డైలాగ్‌ చెప్పి షాట్‌ పూర్తి చేశాను. ఆ తర్వాత అసిస్టెంట్‌ డైరెక్టర్‌ని ఈ విషయం గురించి అడిగాను. ‘ముందు అనుకున్న లక్ష్మణుడి పాత్ర నుంచి మిమ్మల్ని తప్పించి మీకు శత్రుఘ్నుడి పాత్ర ఇవ్వబోతున్నారు. మీ పర్సనాలిటీ తగ్గిందని వారు భావిస్తున్నారు’ అని చెప్పారాయన.  

‘ఆ సాయంత్రం రామారావుగారి దగ్గరకు వచ్చి జరిగిన విషయం చెప్పాను. వెంటనే తన తమ్ముడిని పిలిచి ‘శంకర్‌రెడ్డిగారికి ఫోన్‌ చేసి నా మాటగా చెప్పండి.. ఏ వేషానికి బుక్‌ చేసుకున్నారో ఆ వేషమే ఇవ్వమనండి. అలా వీల్లేకపోతే వారికి ఇచ్చిన అడ్వాన్స్‌ని ఇతర సినిమాలోకి మార్చుకోమని చెప్పండి. అంతేగానీ, ఆర్టిస్టుని అవమానపరచొద్దు’ అంటూ ఆయన చాలా పెద్ద మాట అన్నారు. అదేమిటంటే.. ‘మేం ఇద్దరు అన్నదమ్ములం కాము. ముగ్గురు అన్నదమ్ములం అని ఆయనకి చెప్పండి’ అన్నారు. అది నా జీవితంలో మరపురాని సంఘటన. ఎందుకంటే రామారావుగారికి నా యందు ఉన్న ఆప్యాయత, ఆ ప్రేమ అంత గొప్పది. ఇద్దరం కాదు, ముగ్గురం అన్నదమ్ములం అని చెప్పడంలోని ఆయన గొప్పతనం నన్ను కదిలించి వేసింది’ అన్నారు.