Read more!

English | Telugu

కేవలం 5 సెంటర్స్‌లో రిలీజ్‌ అయి.. కోట్లు కలెక్ట్‌ చేసి రికార్డు సృష్టించిన సినిమా!

ఒక సినిమా చెయ్యాలనుకోవడం, దానికోసం ఒక మంచి కథను సిద్ధం చేసుకోవడం, దాన్ని ఎవరితో చెయ్యాలి అని డిసైడ్‌ చేసుకోవడం ఒక ఎత్తయితే, దాన్ని ఒక హీరోకి వినిపించి అతనితో ఓకే అనిపించుకోవడం మరో ఎత్తు. కొంతమంది హీరోలు రిజెక్ట్‌ చేసిన కథను మరో హీరోతో చేసినపుడు సూపర్‌హిట్‌ అయిన సందర్భాలు సినిమా ఇండస్ట్రీలో కోకొల్లలుగా ఉన్నాయని చెప్పొచ్చు. ఒక సూపర్‌హిట్‌ సినిమా వెనుక ఇలాంటి విశేషాలు చాలా ఉంటాయి. అలాంటి ఓ అనుభవం సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల కెరీర్‌లో జరిగింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలేసి సినిమా మీద ప్యాషన్‌తో, ఏదో సాధించాలి అనే తపనతో ఇండస్ట్రీకి వచ్చారు శేఖర్‌ కమ్ముల. తన కుటుంబం, స్నేహితుల సపోర్ట్‌తో ‘డాలర్‌ డ్రీమ్స్‌’ అనే సినిమాను తీసి అందరి చేత శభాష్‌ అనిపించుకున్నారు. ఈ చిత్రానికిగాను ఉత్తమ నూతన దర్శకుడుగా శేఖర్‌ కమ్ములకు జాతీయ అవార్డు లభించింది. 

ఇక తన రెండో ప్రయత్నంగా ‘ఆనంద్‌’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఎంతో కృషి చేయాల్సి వచ్చింది. ఈ స్క్రిప్డును తీసుకొని అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో.. ఇంకా కొందరు హీరోల చుట్టూ తిరిగాడు శేఖర్‌ కమ్ముల. కానీ, ఆ స్క్రిప్ట్‌ ఎవ్వరికీ నచ్చలేదు. తను ఏం తియ్యాలనుకుంటున్నాడో వారికి అర్థం కావడం లేదు అని భావించిన శేఖర్‌ తనే సొంతంగా ‘ఆనంద్‌’ చిత్రాన్ని నిర్మించడానికి సన్నద్ధమయ్యాడు. ఎన్‌ఎఫ్‌డిసితో కలిసి సినిమాను ప్రారంభించాడు. ఎన్‌ఎఫ్‌డిసికి రూ.40 లక్షలు మాత్రమే పరిమితి ఉంది. కొన్నాళ్ళకే ఆ డబ్బు అయిపోయింది. ఆ తర్వాత తన ఫ్రెండ్స్‌ సాయంతో మొత్తానికి సినిమాను పూర్తి చేశాడు. అంతకుముందు డాలర్‌ డ్రీమ్స్‌ వంటి అవార్డు సినిమా తీసి ఉండడం వల్ల ‘ఆనంద్‌’ చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో తనే సొంతంగా రిలీజ్‌ చెయ్యాలని భావించి అప్పటికి ఒకే రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 5 థియేటర్లలో మాత్రమే సినిమాను రిలీజ్‌ చేశాడు. రిలీజ్‌ అయిన రెండో రోజు నుంచే లోకల్‌గా ఉండే డిస్ట్రిబ్యూటర్స్‌ తమకు కూడా సినిమా ఇవ్వమని ఆఫీస్‌కి వచ్చి చుట్టుమూగారు. ఆ సమయంలో బిజినెస్‌పరంగా అంత అవగాహన లేని శేఖర్‌ కమ్ముల వారు ఎంత ఇస్తే అంతే తీసుకొని సినిమాను ఇచ్చేశాడు. కేవలం కొన్ని రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లు విపరీతంగా పెరిగాయి. సినిమా చాలా పెద్ద హిట్‌ అయిపోయింది. ఈ సినిమాను కొనుక్కున్న వారు ఎక్కువ లాభపడ్డారు.  శేఖర్‌ కమ్ములకు సినిమా బడ్జెట్‌ 2 కోట్ల 30 లక్షలు పోను కోటి రూపాయలు లాభం వచ్చింది. ‘ఆనంద్‌’ చిత్రం రిలీజ్‌ అయినరోజే ‘శంకర్‌దాదా ఎంబిబిఎస్‌’ కూడా రిలీజ్‌ అయింది. మెగాస్టార్‌ సినిమాను తట్టుకొని ‘ఆనంద్‌’ ఘనవిజయం సాధించడం అప్పట్లో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయింది.