Read more!

English | Telugu

1967లో ఎన్టీఆర్‌ సినిమాలు 12 రిలీజ్‌ అయ్యాయి. అందులో ఏది హిట్‌.. ఏది ఫట్‌! 

ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్‌ హీరోలుగా చలామణి అవుతున్న హీరోలు సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని రోజుల్లో పాత తరం హీరోలు సంవత్సరంలో లెక్కకు మించిన సినిమాలు చేసేవారు. వారిలో ఎన్‌.టి.రామారావు ఒకరు. 1967 సంవత్సరంలో ఆయన నటించిన 12 సినిమాలు విడుదల కావడం విశేషం. ఈ 12 సినిమాల్లో కృష్ణకుమారి హీరోయిన్‌గా నటించిన సినిమాలు 5 కాగా, దేవిక హీరోయిన్‌గా నటించిన సినిమాలు 4. ఇక దర్శకుల్లో సి.పుల్లయ్య 2 సినిమాలు, వి.దాదామిరాసి 2 సినిమాలు అత్యధికంగా దర్శకత్వం వహించారు. ఆ 12 సినిమాలు ఎప్పుడు రిలీజ్‌ అయ్యాయి, ఎలాంటి ఫలితాల్ని పొందాయి అనేది పరిశీలిద్దాం. 

జనవరి 14న విడుదలైన ‘గోపాలుడు భూపాలుడు’ చిత్రానికి జి.విశ్వనాథం దర్శకత్వం వహించారు. జయలలిత, రాజశ్రీ హీరోయిన్లుగా నటించారు. భారీ ఓపెనింగ్స్‌ సాధించడమే కాకుండా కమర్షియల్‌గా పెద్ద సక్సెస్‌ అయిందీ సినిమా. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేశారు. మార్చి 2న ‘నిర్దోషి’ చిత్రం రిలీజ్‌ అయింది. వి.దాదామీరాసి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సావిత్రి, అంజలి ఇందులో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఏవరేజ్‌ సినిమా అనిపించుకుంది. ఈ సినిమా విడుదలైన 20 రోజులకే అంటే మార్చి 22న ‘కంచుకోట’ రిలీజ్‌ అయింది. ఈ చిత్రానికి సి.ఎస్‌.రావు దర్శకత్వం వహించారు. ఇందులో సావిత్రి, దేవిక హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 30 కేంద్రాల్లో మొదటివారం రూ.7 లక్షలు కలెక్ట్‌ చేసింది. అప్పటికి అది రికార్డుగా చెప్పొచ్చు. కమర్షియల్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమా విజయవాడ విజయ టాకీస్‌లో 105 రోజులు ప్రదర్శింపబడింది. జూన్‌ 29న ఈ సినిమా శతదినోత్సవాన్ని విజయ టాకీస్‌లో నిర్వహించారు. ఇదే సినిమాను 1975లో రీ రిలీజ్‌ చేస్తే హైదరాబాద్‌లోని శోభన థియేటర్‌లో రోజూ 3 ఆటలతో 105 రోజులు రన్‌ అయింది. 

ఏప్రిల్‌ 7న ‘భువనసుందరి కథ’ విడుదలైంది. ఈ చిత్రానికి సి.పుల్లయ్య దర్శకత్వం వహించారు. కృష్ణకుమారి హీరోయిన్‌. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయం పాలైంది. ఆ తర్వాత రెండు వారాలకే ఏప్రిల్‌ 20న ‘ఉమ్మడి కుటుంబం’ రిలీజ్‌ అయింది. ఈ చిత్రానికి డి.యోగానంద్‌ దర్శకత్వం వహించారు. కృష్ణకుమారి హీరోయిన్‌. ఈ సినిమా ఘన విజయం సాధించింది. 15 కేంద్రాల్లో 100 రోజులు  ప్రదర్శింపబడింది. విజయవాడ దుర్గా కళామందిర్‌లో డైరెక్ట్‌గా 197 రోజులు ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. అంతకుముందు ఎన్టీఆర్‌ సరసన హీరోయిన్లుగా నటించిన సావిత్రి, ఎస్‌.వరలక్ష్మీ ఈ సినిమాలో వదిన పాత్రల్లో కనిపిస్తారు. అలాగే 1954లో విడుదలైన ‘తోడుదొంగలు’ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన హీరోయిన్‌గా నటించిన హేమలత ‘ఉమ్మడి కుటుంబం’ చిత్రంలో ఎన్టీఆర్‌కు తల్లిగా నటించారు. 

జూన్‌ 29న విడుదలైన ‘భామావిజయం’ చిత్రానికి సి.పులయ్య దర్శకత్వం వహించారు. దేవిక హీరోయిన్‌. ఈ సినిమాకు మొదట అనుకున్న టైటిల్‌ ‘గొల్లభామ’. సినిమాకి ఈ టైటిల్‌ పెట్టడం అప్పట్లో వివాదాస్పదం కావడంతో ‘భామా విజయం’గా పేరును మార్చారు. ఎబౌ ఏవరేజ్‌ అనిపించుకున్న ఈ సినిమా రాజమండ్రి వెంకట నాగదేవి థియేటర్‌లో 100 రోజులు ప్రదర్శితమైంది. ఆగస్ట్‌ 10న విడుదలైన ‘నిండు మనసులు’ చిత్రానికి ఎస్‌.డి.లాల్‌ దర్శకత్వం వహించారు. దేవిక హీరోయిన్‌. ఏవరేజ్‌ సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ సినిమా విజయవాడలో సింగిల్‌ షిప్ట్‌పై 100 రోజులు ఆడింది. ఆగస్ట్‌ 31న విడుదలైన సినిమా ‘స్త్రీ జన్మ’. ఈ చిత్రానికి కె.ఎస్‌.ప్రకాశరావు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్‌ సరసన కృష్ణకుమారి, కృష్ణ సరసన ఎల్‌.విజయలక్ష్మీ హీరోయిన్లుగా నటించారు. మొదట ఈ సినిమా టైటిల్‌ ‘స్త్రీ’ అనుకున్నారు. ఆ తర్వాత ‘స్త్రీజన్మ’గా మార్చారు. ఈ సినిమా 7 కేంద్రాల్లో 50 రోజులు ప్రదర్శితమైనప్పటికీ కమర్షియల్‌గా సక్సెస్‌ అవ్వలేదు. అక్టోబర్‌ 12న విడుదలైన ‘శ్రీకృష్ణావతారం’ చిత్రానికి కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన దేవికతోపాటు ఏడుగురు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో నందమూరి హరికృష్ణ తొలిసారి నటించడం విశేషం. కమర్షియల్‌గా సక్సెస్‌ అయిన ఈ సినిమా విజయవాడ జైహింద్‌ థియేటర్‌లో 105 రోజులు ప్రదర్శితమైంది. లేట్‌ రన్‌లో బెంగళూరు మినర్వా థియేటర్‌లో 18 వారాలు ప్రదర్శింపబడి షిఫ్టులపై 175 రోజులు నడిచింది. శోభన్‌బాబు ఈ సినిమాలో నారదుడిగా నటించారు. 

నవంబర్‌ 3న విడుదలైన ‘పుణ్యవతి’ చిత్రానికి వి.దాదామిరాసి దర్శకత్వం వహించారు. కృష్ణకుమారి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో భానుమతి కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో శోభన్‌బాబు కూడా ఒక ముఖ్యపాత్ర పోషించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. నవంబర్‌ 30న విడుదలైన ‘ఆడపడుచు’ చిత్రానికి కె.హేమాంబరధరరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన కృష్ణకుమారి, శోభన్‌బాబు సరసన వాణిశ్రీ, హరనాథ్‌ సరసన చంద్రకళ హీరోయిన్లుగా నటించారు. బాక్సాఫీస్‌ వద్ద ఘనవిజయం సాధించిన ఈ సినిమా 5 కేంద్రాల్లో 100 రోజులు  ప్రదర్శింపబడింది. డిసెంబర్‌ 21న విడుదలైన ‘చిక్కడు దొరకడు’ చిత్రానికి బి.విఠలాచార్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌, కాంతారావు కవల సోదరులుగా నటించారు. ఎన్టీఆర్‌ సరసన జయలలిత, కాంతారావు సరసన కృష్ణకుమారి నటించారు. ఈ సినిమా విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి ఓపెనింగ్స్‌ సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద కమర్షియల్‌గా సక్సెస్‌ సాధించింది.