Read more!

English | Telugu

‘తెలుసా.. మనసా..’ ట్యూన్‌ని కీరవాణి ఎక్కడి నుంచి కాపీ చేసారో తెలుసా?

మన సినిమాల్లో సంగీతానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా మన సినిమాల్లో పాటలు తప్పనిసరిగా ఉండాలి. అయితే వాటిని వీనుల విందుగా అందించేందుకు సంగీత దర్శకులు ఎంతో కృషి చేస్తారు. ఒక్కోసారి వారికి ట్యూన్‌ నచ్చితే ఇతర భాషల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటారు. తమ కెరీర్‌లో ఇతర భాషల నుంచి సంగీతాన్ని దిగుమతి చేసుకున్న సందర్భాలు లేని మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ కూడా ఉన్నారు. వారిలో ఇళయరాజా ఒకరు. ఇప్పటివరకు ఆయన చేసిన ట్యూన్స్‌ అన్నీ స్వంతంగా చేసినవే. అయితే కొన్ని సందర్భాల్లో దర్శకుల అభిరుచి మేరకు వారికి నచ్చిన ట్యూన్స్‌ను కొందరు సంగీత దర్శకులు దిగుమతి చేసుకుంటారు. అలా జర్మనీ నుంచి దిగుమతి అయిందే ‘తెలుసా.. మనసా’ పాట ట్యూన్‌. 

వివరాల్లోకి వెళితే.. నాగార్జున హీరోగా మహేష్‌ భట్‌ దర్శకత్వంలో వచ్చిన ‘క్రిమినల్‌’ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు. ఈ సినిమాలోని ‘తెలుసా.. మనసా..’ సాంగ్‌ ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. హిందీలో కూడా ఈ పాట చాలా పాపులర్‌ అయింది. అయితే ఈ పాట ‘ఎనిగ్మా’ అనే ఓ జర్మన్‌ బ్యాండ్‌ ట్యూన్‌ చేసింది. ‘ఏజ్‌ ఆఫ్‌ లోన్లీనెస్‌’ అనే ఈ పాట లిరిక్‌ లేకుండా కేవలం హమ్మింగ్‌తో, మ్యూజిక్‌తో సాగుతుంది. దీన్ని యధాతథంగా కీరవాణి కాపీ చేశారు. అయితే లిరిక్‌తో వచ్చే ట్యూన్‌ని మాత్రం ఆయన సొంతంగా ట్యూన్‌ చేశారు. ఎనిగ్మా ట్యూన్‌ చేసిన ఆ హమ్మింగ్‌ను, మ్యూజిక్‌ను కాపీ చేసినప్పటికీ ఆ పాటలో ఓ ఫ్రెష్‌నెస్‌ని తీసుకొచ్చారు కీరవాణి. అది మన పాటే అన్నంత అందంగా మొత్తం పాటని కంపోజ్‌ చేయడంలో ఆయన సక్సెస్‌ అయ్యారు. అప్పట్లో ఈ పాట పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్రతి ఒక్కరూ పాడుకునే విధంగా ఉండడంతో అందర్నీ ఆకట్టుకుంది. 

ఈ పాటను ‘క్రిమినల్‌’ సినిమాలో పెట్టడం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. మొదట ఈ ట్యూన్‌ను జగపతిబాబు హీరోగా కె.రాఘవేంద్రరావు రూపొందించిన ‘అల్లరి ప్రేమికుడు’ కోసం చేశారు. సినిమాలోని ఓ సిట్యుయేషన్‌ చెప్పి దానికి తగిన పాట కావాలని కీరవాణిని కోరడంతో కొన్ని ట్యూన్స్‌ వినిపించారు. అందులో ‘తెలుసా మనసా’ ట్యూన్‌ ఒకటి. ‘కలికి చిలక ముద్దు తాంబూలం ఇమ్మందని’ అంటూ సాగే సాహిత్యంతో ఆ ట్యూన్‌ వినిపించారు. అయితే తాను అనుకున్న సన్నివేశానికి అది సరిపోదని భావించిన రాఘవేంద్రరావు ‘చిలిపి చిలక ఐ లవ్‌ యు అన్న వేళలో..’ అంటూ సాగే ట్యూన్‌ను ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ‘క్రిమినల్‌’కి సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో కీరవాణి ‘తెలుసా.. మనసా’ ట్యూన్‌ను వినిపించారు. దాన్ని మహేష్‌ భట్‌ వెంటనే ఓకే చేశాడు. ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించగా, ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఎంతో మధురంగా ఆలపించారు.