Read more!

English | Telugu

అక్కినేని కోసం చిరంజీవి సినిమాని వ‌దిలేసిన కోదండ‌రామిరెడ్డి!

 

చిరంజీవిని స్టార్ హీరోగా, టాలీవుడ్ నంబ‌ర్ వ‌న్ స్టార్‌గా మార్చిన సినిమాల‌ను డైరెక్ట్ చేసిన వ్య‌క్తిగా ఎ. కోదండ‌రామిరెడ్డి చ‌రిత్ర‌లో నిలిచిపోయారు. ఆ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో న్యాయం కావాలి, అభిలాష‌, ఖైదీ, ఛాలెంజ్‌, కిరాత‌కుడు, ర‌క్త సిందూరం, విజేత‌, రాక్ష‌సుడు, దొంగ‌మొగుడు, ప‌సివాడి ప్రాణం, ముఠామేస్త్రి త‌దిత‌ర సూప‌ర్ హిట్ సినిమాలు వ‌చ్చాయి. అయితే చిరంజీవి హీరోగా కోదండ‌రామిరెడ్డి ఓ సినిమాని ప్రారంభించి, దాని నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చిందనేది చాలామందికి తెలీని విష‌యం. ఆయ‌న ఫిల్మోగ్ర‌ఫీలో ఆ సినిమా పేరు ఉంటుంది కానీ, నిజానికి ఆ సినిమాని ఆయ‌న డైరెక్ట్ చేయ‌లేదు. ఇంత‌కీ ఆ సినిమా.. 'శివుడు శివుడు శివుడు' (1983). 

అవును. ఆ మూవీని శ్రీ‌ క్రాంతి చిత్ర ప‌తాకంపై క్రాంతికుమార్ నిర్మించారు. రాధిక డ్యూయ‌ల్ రోల్ చేసిన ఈ సినిమాను 1983 జ‌న‌వ‌రి 14న ఊటీలో ప్రారంభించారు. అక్క‌డి బృందావ‌న్ హోట‌ల్‌లో దేవుని ప‌టాల‌పై ఫ‌స్ట్ షాట్ తీశారు కోదండ‌రామిరెడ్డి. ఆ మ‌రుస‌టి రోజు నుంచి ఊటీలోనే ప‌లు లొకేష‌న్ల‌లో 40 రోజుల పాటు షూటింగ్ జ‌ర‌పాల‌ని క్రాంతికుమార్ ప్లాన్ చేశారు. 

అదే టైమ్‌లో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు సొంత చిత్రం 'శ్రీ‌రంగ నీతులు' ప్రారంభ‌ద‌శ‌లో ఉంది. దానికి కూడా కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌కులు. అక్కినేని స్వ‌యంగా ఫోన్ చేసి, హైద‌రాబాద్‌కు వ‌స్తున్నావా, లేదా ఒక్క మాట‌లో చెప్ప‌మ‌ని నిల‌దీశారు. నిజానికి రెడ్డిగారి డేట్స్ అప్పుడు అన్న‌పూర్ణ స్టూడియోస్‌కే ఉన్నాయి. మ‌రోవైపు 'న్యాయం కావాలి'తో త‌న‌కు సూప‌ర్ హిట్‌ను ఇచ్చిన క్రాంతికుమార్ మాట కాద‌న‌లేని స్థితి.

ఆ రాత్రికి రాత్రి కె. రాఘ‌వేంద్ర‌రావు తండ్రి కె.ఎస్‌. ప్ర‌కాశ‌రావుకు ఫోన్ చేసి, అక్కినేని నొప్పించ‌కుండా ఒప్పించ‌మ‌ని కోరారు కోదండ‌రామిరెడ్డి. కానీ రెడ్డిగారి నుంచి 'య‌స్' లేదా 'నో' అనే స‌మాధానం కావాల్సిందేన‌ని తేల్చి చెప్పారు అక్కినేని. ఇక చేసేదేమీ లేక 'శివుడు శివుడు శివుడు' మూవీని వ‌దిలేసుకొని 'శ్రీ‌రంగ‌నీతులు'ను తెర‌కెక్కించ‌డానికి హైద‌రాబాద్ వెళ్లిపోయారు రెడ్డిగారు. షెడ్యూల్ తొలిరోజునే ఇలా జ‌ర‌గ‌డంతో, మ‌రో డైరెక్ట‌ర్‌ను పెట్టుకోకుండా జ‌న‌వ‌రి 15 నుంచి తానే మెగాఫోన్ ప‌ట్టుకొని ఆ మూవీని డైరెక్ట్ చేశారు క్రాంతికుమార్‌. అయితే టైటిల్స్‌లో, పోస్ట‌ర్స్‌లో కోదండ‌రామిరెడ్డి పేరునే వేశారు. చాలా శ్ర‌మ‌కు ఓర్చి తీసిన‌ప్ప‌టికీ, ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నిరాశ‌ప‌రిచింది.