Read more!

English | Telugu

ఓపెనింగ్ షాట్ తీసేట‌ప్పుడు కెమెరా ముందు పిల్లిని ప‌రుగెత్తించిన హీరో!

 

త‌మిళ‌న‌టుడు మ‌న్సూర్ అలీఖాన్ ఒక ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. 'కెప్టెన్ ప్ర‌భాక‌ర్' (1991) సినిమాలో చేసిన బందిపోటు వీర‌భ‌ద్రం అనే విల‌న్ క్యారెక్ట‌ర్‌తో తెలుగువారికి  సుప‌రిచితుడ‌య్యారు. ఆ త‌ర్వాత అనేక అనువాద చిత్రాల‌తో ఆయ‌న తెలుగు వారిని అల‌రిస్తూనే ఉన్నారు. ఎలాంటి దాప‌రికాలు లేకుండా అనుకున్న‌ది అనుకున్న‌ట్లు చెప్పే ల‌క్ష‌ణంతో అనేక‌సార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ఈమ‌ధ్యే కొవిడ్ వాక్సిన్ గురించి వ్య‌తిరేకంగా మాట్లాడి, త‌ప్పుడు స‌మాచారం ప్ర‌చారం చేస్తున్నార‌నే అభియోగంతో అరెస్ట‌యి, బ‌య‌ట‌కు వ‌చ్చారు. మూఢ‌న‌మ్మ‌కాలు, ఆచార‌వ్య‌వ‌హారాల‌కు ఆయ‌న బ‌ద్ధ వ్య‌తిరేకి.

కెరీర్‌లో మొద‌ట విల‌న్ రోల్స్‌తో ఆక‌ట్టుకున్న మ‌న్సూర్, త‌ర్వాత ఎంతోమంది లాగా తాను మాత్రం హీరోగా ఎందుకు న‌టించ‌కూడ‌ద‌ని అనుకుని, ఓ రోజు హ‌ఠాత్తుగా త‌నే హీరోగా, డాన్సులు, ఫైట్లు పెట్టి, త‌న‌కో విల‌న్ని పెట్టుకొని ఓ సినిమా తీసేశారు. జ‌నాన్ని ఆక‌ట్టుకునేందుకు ఆ ఫిల్మ్‌కు, 'రాజాధిరాజ రాజ‌మార్తాండ రాజ‌గంభీర కృష్ణ కామ‌రాస‌న్' అనే టైటిల్ పెట్టారు. అందులో మ‌న న‌టుడు శ్రీ‌హ‌రి కూడా న‌టించారు. ఆ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించ‌డంతో, హీరోగా వెంట‌నే మ‌రో సినిమా నిర్మించారు. కానీ ఈసారి చిన్న టైటిలే.. కానీ యాంటీ సెంటిమెంట్ టైటిల్ - 'రావ‌ణ‌న్' అని పెట్టారు. 

మూఢ‌న‌మ్మ‌కాల‌ను నిర‌సించే మ‌న్సూర్‌, అలాంటి న‌మ్మ‌కాల‌కు నిల‌య‌మైన సినిమా ఇండ‌స్ట్రీ ముక్కున వేలేసుకొనే ప‌నులు ఆ సినిమా ప్రారంభం రోజున చేశారు. రాహు కాలంలో ముహూర్తాన్ని నిర్ణ‌యించారు. దీపారాధ‌న‌ను ఒక వింత‌తువు చేత చేయించారు. ఫ‌స్ట్ షాట్ చిత్రీక‌రించడానికి ముందుగా కెమెరా ముందు ఒక పిల్లిని ప‌రిగెత్తించారు. టైటిల్ 'రావ‌ణ‌న్' అయినంత మాత్రాన ఇది పౌరాణిక చిత్రం అనుకొనేరు. ఫ‌క్తు సోష‌ల్ ఫిల్మ్‌. ఇందులో అతి ఆవేశ‌ప‌రుడైన రావ‌ణ‌న్ అనే రైతుగా మ‌న్సూర్ న‌టించారు. ఈ సినిమా అంద‌రి ఊహాగానాల‌ను త‌ల‌కిందులు చేస్తూ ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేసింది. ఈ సినిమా త‌ర్వాత కూడా ఆయ‌న మ‌రో నాలుగైదు సినిమాల్లో హీరోగా న‌టిస్తూ, నిర్మించారు.