Read more!

English | Telugu

అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ.. అందరికీ అందనిదీ పూచిన కొమ్మ!

మహానటి అంటే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు సావిత్రి. ఆమెలాంటి నటి మళ్లీ పుట్టదు అంటారు. అది నిజమే. ఏ జనరేషన్‌కి తగ్గట్టు నటీనటులు ఇండస్ట్రీకి వస్తుంటారు, వెళుతుంటారు. ఎప్పటికప్పుడు అలాగే అనుకుంటాం. అయితే ఈ తరంలో అంతటి పేరు ప్రఖ్యాతులు సాధించిన నటీమణి ఎవరైనా ఉన్నారా? వెంటనే మనకు స్పురించే పేరు సౌందర్య. ఎలాంటి క్యారెక్టర్‌లోనైనా ఇట్టే ఒదిగిపోయి దానికి పూర్తి న్యాయం చేసే సౌందర్యతో మిగతా హీరోయిన్లను పోల్చలేం. ఎందుకంటే ఆమెకు ఒక నిబద్ధత ఉంది. తన తోటి హీరోయిన్లు అందరూ పాత్రకు అవసరం అనుకుంటే ఎక్స్‌పోజింగ్‌ చేసేందుకు వెనుకాడేవారు కాదు. కానీ, సౌందర్య అలా కాదు. నటిగా కెరీర్‌ ప్రారంభించిన రోజు నుంచి చనిపోయే వరకు ఏ సినిమాలోనూ ఎక్స్‌పోజింగ్‌ చేయలేదు. నిండుగా దుస్తులు వేసుకొని కేవలం తన నటనతోనే అందర్నీ ఆకట్టుకుంది తప్ప అంగ ప్రదర్శనతో కాదు. 

అందానికి అందం, అభినయానికి అభినయం.. ముగ్థ మనోహర రూపంతో వెండితెరను కొన్నేళ్ళపాటు ఏలిన ఈ సౌందర్య రాశి మన నుంచి దూరమై అప్పుడే 20 సంవత్సరాలు పూర్తవుతోంది. మహానటి సావిత్రి తర్వాత అంతటి నటి అనే పేరు తెచ్చుకున్న ఏకైక హీరోయిన్‌ సౌందర్య. సావిత్రి శకం ఎప్పుడో ముగిసిపోయినా అంతటి పేరును ప్రేక్షకులకు మరెవ్వరికీ ఇవ్వలేదు. ఆ ఘనత సౌందర్యకు మాత్రమే దక్కింది. ఏప్రిల్‌ 17 సౌందర్య వర్థంతి సందర్భంగా ఆమె వ్యక్తిగత, సినీ జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం. 

డాక్టర్‌ కావాలనుకున్నాను. కానీ, యాక్టర్‌ అయ్యాను అంటారు. సౌందర్య విషయంలో నిజంగా అదే జరిగింది. ఎంబిబిఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలోనే ఆమెకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. కొన్ని కన్నడ సినిమాల్లో నటిస్తున్న సమయంలో రచయిత త్రిపురనేని మహారథి కుమారుడు త్రిపురనేని వరప్రసాద్‌ ‘రైతుభారతం’ చిత్రంతో సౌందర్యను తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ఈ సినిమాలో కృష్ణ హీరోగా నటించారు. ఈ సినిమా రిలీజ్‌ అవ్వడానికి మూడేళ్ళు పట్టింది. ‘మనవరాలి పెళ్లి’ ఆమె నటించిన మొదటి చిత్రంగా విడుదలైంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 100 సినిమాలకు పైగా నటించి హీరోయిన్లలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది సౌందర్య. మాతృభాష కన్నడ అయినప్పటికీ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. అప్పట్లో అందరు టాప్‌ హీరోల సరసన నటించింది. 

సౌందర్యను అందరూ సావిత్రితో పోలుస్తారు. సావిత్రిలాగే తనకు కూడా డైరెక్షన్‌ చెయ్యాలన్న కోరిక బలంగా ఉండేది. కానీ, ఆ అవకాశం రాకుండానే చిన్న వయసులో అందర్నీ వదిలి వెళ్లిపోయింది. ఆమె నటించిన చివరి చిత్రం ‘నర్తనశాల’. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసింది. రెండో షెడ్యూల్‌ సమయానికి ఆమె మనమధ్య లేదు. అలా ఆ సినిమా ఆగిపోయింది. ఆమె కెరీర్‌లో రిలీజ్‌కి నోచుకోని మరో సినిమా కూడా ఉంది. ఆ సినిమా పేరు ‘గెలుపు’. తెలుగు చిత్ర పరిశ్రమకు సౌందర్యను హీరోయిన్‌గా పరిచయం చేసిన త్రిపురనేని వరప్రసాద్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో డిఫెన్స్‌ లాయర్‌గా ఓ కీలక పాత్ర పోషించారు సౌందర్య. తన క్యారెక్టర్‌ నిడివి తక్కువే అయినప్పటికీ  ‘రైతు భారతం’ చిత్రంతో తనను తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చారన్న గౌరవంతో వరప్రసాద్‌ అడగ్గానే ఆ క్యారెక్టర్‌ చేసేందుకు ఒప్పుకుంది సౌందర్య. 2003లో షూటింగ్‌ పూర్తి చేసుకొని ఫస్ట్‌ కాపీ రెడీ అయిన తర్వాత ఇక సినిమా రిలీజ్‌ కావడమే తరువాయి అనుకుంటున్న టైమ్‌లో బ్రేక్‌ పడిరది. అంతే.. అప్పటి నుంచి ‘గెలుపు’ చిత్రం ప్రింటు రామోజీ ఫిలిం సిటీలోని ల్యాబ్‌లోని బాక్సుల్లోనే ఉండిపోయింది. ఈ సినిమా రిలీజ్‌ కాకపోవడానికి కారణం ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థ అనే చెప్పాలి. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఉషా కిరణ్‌ మూవీస్‌ సంస్థ సినిమాకి అయిన బడ్జెట్‌కి 10 శాతం ఎక్కువ ఇచ్చి తీసుకునేందుకు అంగీకరించింది. అయితే దాన్ని నోటి మాటగా అనుకున్నారే తప్ప రాతపూర్వకంగా అగ్రిమెంట్‌ చేసుకోలేదు. ఆ కారణంగా సినిమా పూర్తవుతున్న సమయంలో కూడా ఎంతో మంది బయ్యర్లు సినిమాను కొనేందుకు వచ్చినా ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థ సినిమాను తీసుకుంటుందన్న గట్టి నమ్మకంతో ఎవ్వరికీ ఇవ్వలేదు వరప్రసాద్‌. ఈ సినిమా రిలీజ్‌కి వచ్చేసరికి ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థ సినిమాల పరంగా భారీ నష్టాల్లోకి వెళ్లిపోయింది. దీంతో సినిమాలకు సంబంధించిన లావాదేవీలను తాత్కాలికంగా ఆపేశారు. ఆ కారణంగా ‘గెలుపు’ చిత్రాన్ని కూడా రిలీజ్‌ చేయలేకపోయారు. మిగతా బయ్యర్లు కూడా ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు ఆసక్తి చూపించలేదు. 

హీరోయిన్‌గా మంచి ఆఫర్స్‌ వస్తున్నాయి. కెరీర్‌ మంచి పీక్స్‌లో ఉంది. ఆ సమయంలోనే తన మేనమామ, చిన్నప్పటి స్నేహితుడు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన జి.ఎస్‌.రఘును 2003 ఏప్రిల్‌ 27న వివాహం చేసుకుంది సౌందర్య. పెళ్ళి చేసుకొని ఏడాది నిండకముందే 2004 ఏప్రిల్‌ 17న హెలికాప్టర్‌ ప్రమాదం రూపంలో ఆమెను మృత్యువు కబళించింది. చనిపోయే సమయానికి సౌందర్య గర్భవతి. ఆమె మరణం సినిమా పరిశ్రమ మొత్తాన్ని శోకసముద్రంలో ముంచేసింది.