Read more!

English | Telugu

సుస్వాగతం, అన్నమయ్య, అతడు.. చిత్రాల్లో నటించేందుకు ‘నో’ చెప్పిన శోభన్‌బాబు.. ఎందుకో తెలుసా?

సాధారణంగా హీరోగా వందల సినిమాల్లో నటించిన వారికి కూడా తర్వాత సహజంగానే అవకాశాలు తగ్గుతాయి. హీరోగా నటించేందుకు వారికి వయసు సహకరించదు, అలాగే ప్రేక్షకులు కూడా వారిని హీరోగా స్క్రీన్‌పై చూసేందుకు ఆసక్తి కనబరచరు. అలాంటి సమయంలో కీలక పాత్రల్లో, సహాయ నటుడిగా సినిమాల్లో కనిపిస్తుంటారు ఆ హీరోలు. క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా నటించే చాలామంది గతంలో హీరోలుగా వెలుగొందినవారే. తమ క్యారెక్టర్‌కి ఎంతటి ప్రాధాన్యం ఉంది అనేది పక్కన పెట్టి వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ నటనలోనే సంతృప్తి చెందుతారు. కానీ, నటభూషణ శోభన్‌బాబు దానికి విరుద్ధం. హీరోగా వందల సినిమాల్లో నటించారు. కానీ, ఆ తర్వాత వచ్చిన ఎన్నో అద్భుతమైన అవకాశాల్ని సున్నితంగా తిరస్కరించారు. శోభన్‌బాబు నో చెప్పిన ఆ క్యారెక్టర్లు ఏమిటో ఒకసారి చూద్దాం. 

నాగార్జున ప్రధాన పాత్రలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అన్నమయ్య’ ఎంత ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని వెంకటేశ్వరస్వామి పాత్ర కోసం మొదట శోభన్‌బాబుని సంప్రదించింది చిత్ర యూనిట్‌. కానీ, ఆయన ఆ పాత్ర పోషించేందుకు ఆసక్తి చూపించలేదు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కిన ‘సుస్వాగతం’ చిత్రంలో హీరో తండ్రిగా నటించిన రఘువరన్‌కి ఎంతో మంచి పేరు వచ్చింది. ఈ క్యారెక్టర్‌ కోసం మొదట శోభన్‌బాబునే సంప్రదించారు. కానీ, ఆయన అది చేయడానికి కూడా ఒప్పుకోలేదు. 

ఆ తర్వాత మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘అతడు’ చిత్రంలో నాజర్‌ పోషించిన పాత్ర కోసం ముందుగా శోభన్‌ని అడిగారు. అంతకుముందు అన్నమయ్య, సుస్వాగతం చిత్రాల్లో నటించేందుకు ఒప్పుకోలేదని తెలుసుకున్న నిర్మాత మురళీమోహన్‌ ఈసారి శోభన్‌బాబుకి ఒక బ్లాంక్‌ చెక్కు ఇచ్చి ఆ క్యారెక్టర్‌ చెయ్యమని అడిగారు. అయినా ససేమిరా అన్నారు శోభన్‌బాబు. హిందీలో అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘బ్లాక్‌’ చిత్రం అక్కడ ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో శోభన్‌బాబుతో రీమేక్‌ చేయాలనుకున్నారు నిర్మాత ఆర్‌.బి.చౌదరి. ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా తప్పకుండా చేస్తారని భావించారు చౌదరి. కానీ, దానికి కూడా శోభన్‌ ‘నో’ చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరచింది. ఇన్ని సినిమాలకు నో చెప్పిన శోభన్‌బాబు చివరికి ఓ సినిమాలో కీలక పాత్ర పోషించేందుకు ఒప్పుకున్నారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వి.బి.రాజేంద్రప్రసాద్‌ ఓ మల్టీస్టారర్‌ నిర్మించాలనుకున్నారు. కృష్ణ, శోభన్‌బాబు, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో సినిమా చెయ్యాలనుకున్నారు. కానీ, ఈ సినిమా ప్రారంభం కాకముందే ఆగిపోయింది. 

ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి అందాల నటుడిగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన శోభన్‌బాబు తనకు వచ్చిన ఈ అవకాశాలను తిరస్కరించడం వెనుక పెద్ద కారణమే ఉంది. ‘నేను హీరోగా ఎన్నో సినిమాల్లో నటించాను. నన్ను ప్రేక్షకులు హీరోగానే తమ గుండెల్లో పదిలపరుచుకున్నారు. వారి మనసుల్లో ఆ స్థానం అలాగే వుండాలన్నది నా కోరిక. నా జీవితం హీరోగానే ముగిసిపోవాలి తప్ప సహాయనటుడిగా తెరపై కనిపించాలని నేను అనుకోవడం లేదు’ అంటూ తను కొన్ని క్యారెక్టర్లు ఎందుకు చెయ్యకూడదు అనుకున్నారో ఓ ఇంటర్వ్యూలో వివరించారు.