Read more!

English | Telugu

చిన్నతనంలో పెద్ద ప్రమాదం. 23 సర్జరీలు.. నటుడు కావాలన్న తపనే అతన్ని బ్రతికించింది.! 

సినిమా రంగంలో ఎంతో మంది హీరోలు ఉంటారు. తమ విలక్షణమైన నటనతో అందర్నీ ఆకట్టుకుంటారు. కానీ, నటనను దైవంగా భావించేవారు, తాము చేసే క్యారెక్టర్‌ కోసం ఎలాంటి రిస్‌ అయినా తీసుకునేవారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో కమల్‌హాసన్‌ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న నటుడు విక్రమ్‌. తను చేసే క్యారెక్టర్‌ కోసం ప్రాణాలు సైతం లెక్కచేయని నటుడని ‘ఐ’ చిత్రంలోని అతని గెటప్స్‌ కోసం పడిన కష్టం చూస్తే అర్థమవుతుంది. అలాగే ‘అపరిచితుడు’ చిత్రంలో విక్రమ్‌ పోషించిన మూడు విభిన్నమైన పాత్రలు నటన పట్ల అతనికి ఉన్న అంకిత భావాన్ని సూచిస్తుంది. నేషనల్‌ అవార్డులు, ఫిలింఫేర్‌ అవార్డులు, తమిళనాడు గవర్నమెంట్‌ అవార్డులు.. ఇలా అతని కెరీర్‌లో ఎన్నో అవార్డులు గెలుచుకున్న నటుడు చియాన్‌ విక్రమ్‌. భారతదేశం గర్వించదగ్గ నటుడుగా ఈ స్థాయికి రావడం వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి. కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం, తపన.. ఇవన్నీ అతన్ని ఉత్తమనటుడిగా నిలబెట్టాయి. ఏప్రిల్‌ 17 చియాన్‌ విక్రమ్‌ పుట్టినరోజు. తనకెంతో ఇష్టమైన హీరోయిన్‌ సౌందర్య అని చెబుతాడు విక్రమ్‌. కాకతాళీయంగా విక్రమ్‌ పుట్టినరోజునే సౌందర్య హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడం అతన్ని ఎంతో బాధించిన విషయంగా చెబుతాడు. చియాన్‌ విక్రమ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం.

తమిళనాడులోని పథమకుడి విక్రమ్‌ స్వస్థలం. ఇదే ఊరు నుంచి ముగ్గురు జాతీయ ఉత్తమనటులు రావడం విశేషం. కమల్‌హాసన్‌, చారుహాసన్‌, సుహాసిని ఈ ప్రాంతం నుంచి వచ్చినవారే. తండ్రి వినోద్‌రాజ్‌ హీరో అవ్వాలని కలలు కన్నాడు. కొన్ని తమిళ, కన్నడ చిత్రాల్లో నటించినా ఆశించిన గుర్తింపు రాలేదు. విక్రమ్‌కి చిన్నతనం నుంచి కళల పట్ల ఎంతో ఆరాధన ఉండేది. ఈత, కరాటేలో అతనికి ఎంతో ప్రావీణ్యం ఉంది. అలాగే గిటార్‌, పియానో అద్భుతంగా ప్లే చేయగలడు. చిన్నతనంలో స్కూల్‌లో జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో అమ్మాయి వేషంలో నటించి ప్రథమ బహుమతి అందుకున్నాడు. అందరూ అతన్ని ప్రశంసించారు. ఆ క్షణమే నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలన్న కోరిక కలిగింది. చదువు కన్నా నటనమీదే ఎక్కువ ఆసక్తి కనబరిచేవాడు. అయినా బి.ఎ. ఇంగ్లీష్‌ లిటరేచర్‌ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎం.బి.ఎ. డిగ్రీ కూడా తీసుకున్నాడు. 

విక్రమ్‌కి బైక్‌ రైడిరగ్‌ అంటే కూడా ఎంతో మక్కువ. అతనికి ఇష్టమైన బైక్‌ రాజ్‌దూత్‌. అతను స్కూల్‌లో చదువుతున్న రోజుల్లో  స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళుతుండగా జరిగిన పెద్ద ప్రమాదం అతని జీవితంలో మర్చిపోలేని ఘటన. శరీరంపై ఎన్నో గాయాలయ్యాయి. ముఖ్యంగా ఒక కాలు పూర్తిగా దెబ్బతింది. డాక్టర్లు ఎన్నిరోజులు ట్రీట్‌మెంట్‌ చేసినా అతనికి నయం చేయలేకపోయారు. ఈ క్రమంలోనే అతనికి 23 సర్జరీలు జరిగాయి. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో కాలు తీసెయ్యాలని డాక్టర్లు చెప్పారు. కానీ, తన ఆత్మవిశ్వాసంతో కోలుకొని మామూలు స్థితికి వచ్చాడు విక్రమ్‌. ఒక గొప్ప నటుడు కావాలన్న సంకల్పమే తనను మామూలు మనిషిని చేసిందని అంటారు విక్రమ్‌. 

1990లో ‘ఎన్‌ కాదల్‌ కన్మణి’ చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విక్రమ్‌ ఈ 35 సంవత్సరాల్లో చేసిన సినిమాలు కేవలం 55 మాత్రమే. దీన్ని బట్టి ఎంత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తాడో అర్థం చేసుకోవచ్చు. ఒక సినిమా నిర్మాణంలో ఉండగా మరో సినిమా ఒప్పుకోడు. అది పూర్తయిన తర్వాత మరో సినిమా కోసం ఆరు నెలలు లేదా సంవత్సరం వర్కవుట్‌ చేసిన తర్వాతే మరో సినిమాకు వెళతాడు. దీనివల్లే అతను చేసిన సినిమాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. తనకు సినిమాల సంఖ్య, డబ్బు సంపాదించడం ముఖ్యం కాదని, తనకెంతో ఇష్టమైన నటనను ప్రదర్శించడానికి అవకాశం ఉన్న సినిమాలు చేయడమే ప్రధానమని చెబుతాడు విక్రమ్‌. ఎన్ని విలక్షణమైన, విభిన్నమైన పాత్రలు పోషించినా తను చేసే సినిమాల్లో, తను చేసే క్యారెక్టర్లలో కొత్తదనం ఉండాలని కోరుకునే అరుదైన నటుల్లో విక్రమ్‌ ఒకరు. అతని సినిమా కెరీర్‌లో ఇంకా మరెన్నో వైవిధ్యమైన క్యారెక్టర్ల ద్వారా ప్రేక్షకుల్ని అలరించాలని కోరుకుంటూ చియాన్‌ విక్రమ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్‌.