Read more!

English | Telugu

రమ్యకృష్ణ కెరీర్ లో టాప్ 10 పాత్రలివే.. ఇందులో మీ ఫేవరెట్ రోల్ ఏంటి?

ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగల నటీమణుల్లో రమ్యకృష్ణ ఒకరు. 40 ఏళ్ళుగా చిత్ర పరిశ్రమలో ఎంటర్టైన్ చేస్తున్న రమ్య.. తన కెరీర్ లో పలు విభిన్న పాత్రలు ధరించారు. రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. ఆమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చిన టాప్ 10 పాత్రలేంటో చూద్దాం..

1. రేవతి: అల్లుడుగారు సినిమాలో రమ్య చేసిన మూగమ్మాయి పాత్ర ఇది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ క్యారెక్టర్ లో తన హావభావాలతో ఆకట్టుకుంది. కె. రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమాలో మోహన్ బాబుకి జోడీగా కనిపించింది రమ్య.
2. మోహన: అల్లుడు గారు తరువాత మోహన్ బాబు, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రమ్య చేసిన సినిమా.. అల్లరి మొగుడు. ఇందులో మోహన పాత్రలో భలేగా అలరించింది. ఈ చిత్రంతోనే హీరోయిన్ గా స్టార్ డమ్ చూసింది రమ్య.
3. లలిత: ఇది కూడా రాఘవేంద్రరావు డిజైన్ చేయించిన పాత్రనే. రాజశేఖర్ టైటిల్ రోల్ లో నటించిన అల్లరి ప్రియుడు కోసం పోషించిన ఈ పాత్ర.. రమ్యకృష్ణకి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. ఇందులో స్నేహితురాలి కోసం ప్రేమనే త్యాగం చేసే అమ్మాయిగా జీవించేసింది రమ్య.
4. హేమ: మహానటుడు నందమూరి తారక రామారావు టైటిల్ రోల్ లో నటించిన మేజర్ చంద్రకాంత్ లో.. రమ్య పోషించిన హేమ పాత్ర కూడా కీలకమే. రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే వచ్చిన ఈ సినిమాలో మోహన్ బాబుతో ఆడిపాడింది. నీకావాల్సింది నా దగ్గరుంది అంటూ కవ్విస్తూనే.. విషాదాంతంగా ముగిసే పాత్రలో గుర్తుండిపోయింది రమ్య.
5. మంగ: రమ్యకృష్ణలోని కామెడీ కోణాన్ని భలేగా ఆవిష్కరించిన పాత్ర ఇది. నాగార్జున ద్విపాత్రాభినయంలో తెరకెక్కిన హలో బ్రదర్ కోసం ఈ అల్లరల్లరి క్యారెక్టర్ చేసింది రమ్య. ఈ సినిమాకి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు.
6. అమ్మోరు: అప్పటివరకు రమ్యలోని గ్లామర్ కోణాన్నే చూస్తూ వచ్చిన ప్రేక్షకులకు.. అమ్మోరులో పోషించిన టైటిల్ రోల్ బిగ్ షాకింగ్ అనే చెప్పాలి. కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాలో అమ్మోరుగా విశ్వరూపం ప్రదర్శించింది రమ్యకృష్ణ.
7. రాజేశ్వరి: ఆహ్వానం సినిమాలో రమ్యకృష్ణ చేసిన రాజేశ్వరి పాత్రని అంత సులువుగా మరచిపోలేం.  ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ఆహ్వానంలో శ్రీకాంత్ కి జోడీగా కనిపించింది రమ్య. 
8. తిమ్మక్క: తెలుగువారికి ఎంతో ఇష్టమైన సినిమాల్లో అన్నమయ్య ఒకటి. ఇందులో అన్నమయ్య భార్యల్లో ఒకరైన తిమ్మక్క పాత్రలో కనిపించింది రమ్య. సినిమాలో ఉన్నంతసేపు తన మార్క్ అభినయంతో ఇంప్రెస్ చేసింది. ఈ సినిమాకి కూడా కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. 
9. నీలాంబరి: రమ్యకృష్ణ కెరీర్ బెస్ట్ రోల్స్ లో నీలాంబరిదే అగ్ర స్థానం. తమిళ చిత్రం పడయప్పాలో పోషించిన ఈ పాత్ర రమ్యకృష్ణకి నటిగా ఎనలేని గుర్తింపుని తీసుకువచ్చింది. సూపర్ స్టార్ రజినీకాంత్ కి ధీటుగా రాణించి అప్పట్లో సంచలనం సృష్టించింది. కె.ఎస్. రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. తెలుగులో నరసింహగా అనువాదమై ఇక్కడా అఖండ విజయం సాధించింది.
10. శివగామి: రమ్యకృష్ణకి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన పాత్ర ఇది. బాహుబలి సిరీస్ లో పోషించిన ఈ రాజమాత పాత్ర.. రమ్యకృష్ణ కోసం మరిన్ని పవర్ ఫుల్ రోల్స్ డిజైన్ చేసుకోవడానికి దోహదపడింది. 
(సెప్టెంబర్ 15.. రమ్యకృష్ణ బర్త్ డే సందర్భంగా..)